తుంగభద్రలో ఖనిజ సందప ఉందా..?
ABN , Publish Date - Oct 02 , 2026 | 12:01 AM
తంగభద్ర జలాశయం ఫోర్‌షోర్ ఏరియాలో పూడికతో పాటు ఇసుక, ఐరన్‌ఓర్ ఖనిజ సంపద ఉందా..? ఉంటే ఏ స్థాయిలో ఉన్నాయి..? అనే వాటిపై తక్షణం సర్వే చేయాలని తుంగభద్ర జలాల వినియోగంపై ఏర్పాటైన హైపవర్ కమిటీ(అత్యున్నతస్థాయి కమిటీ) నియమించిన సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది.
పూడికతో పాటు ఇసుక, ఐరన్ ఓర్ నిల్వలపై నిగ్గు తేల్చాలి
ముందుగా నీటి నిల్వలపై టోపోగ్రాఫిక్, హైడ్రోగ్రాఫిక్ సర్వే
హైపవర్ సబ్ కమిటీ కీలక నిర్ణయం
హోస్పెట్‌లో టీబీపీ బోర్డు కార్యాలయంలో భేటీ
ఏపీ ప్రతినిధిగా హాజరైన ఒంగోలు సీఈ రమేశ్
కర్నూలు, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): తంగభద్ర జలాశయం ఫోర్‌షోర్ ఏరియాలో పూడికతో పాటు ఇసుక, ఐరన్‌ఓర్ ఖనిజ సంపద ఉందా..? ఉంటే ఏ స్థాయిలో ఉన్నాయి..? అనే వాటిపై తక్షణం సర్వే చేయాలని తుంగభద్ర జలాల వినియోగంపై ఏర్పాటైన హైపవర్ కమిటీ(అత్యున్నతస్థాయి కమిటీ) నియమించిన సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. గురువారం కర్ణాటకలోని విజయనగరం జిల్లా హోస్పేట్‌లో టీబీపీ బోర్డు కాన్ఫరెన్స్ హాల్‌లో హైపవర్ సబ్ కమిటీ (హెచ్‌పీఎ్‌ససీ) చైర్మన్, టీబీపీ బోర్డు కార్యదర్శి శ్రీనివాస బైరి అధ్యక్షతన సబ్ కమిటీ భేటీ అయ్యింది. ఈ భేటీకి సబ్ కమిటీ మెంబర్ సెక్రెటరీ, కన్వీనర్ అయిన టీబీపీ బోర్డు కార్యదర్శి ఎస్.నారాయణ నాయక్, సభ్యులు కర్ణాటక నీటిపారుల శాఖ సలహాదారుడు, రిటైర్డ్ సీఈ మంజప్ప, మునిరాబాద్ సీఈ మనోజ్‌కుమార్ హాజరు కాగా, ఏపీ ప్రతినిధి ఒంగోలు ప్రాజెక్ట్స్ సీఈ రమేశ్, కర్ణాటక సభ్యుడు మంజప్ప, తెలంగాణ ప్రతినిధి వనపత్తి సీఈ మహమ్మద్ రహీముద్దీన్ వర్చువల్‌గా హాజరయ్యారు. డ్యాంలో పూడికతీతపై కర్ణాటక ఇచ్చిన నివేదికను పరిశీలించారు. ఇప్పటి వరకు ఉజ్జయినిలో ఒక ప్రాజెక్టు, తెలంగాణ రాష్ట్రంలో మూడు చిన్న ప్రాజెక్టుల్లో పూడికతీత చేపట్టినట్లు తెలుసుకున్నారు. అయితే.. 32 టీఎంసీలకు పైగా పూడిక నిండిపోయిన తుంగభద్ర డ్యాంలో పూడికతీత సాధ్యాసాధ్యాలపై చర్చించారు.
ముందుగా నీటి లెక్కలు తేలుద్దాం
తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక సంయుక్త జలాశయం తుంగభద్ర డ్యాంను 132.473 టీఎంసీల సామర్థ్యంతో 1953లో నిర్మించారు. ఏటేటా వరదతో పాటు పూడిక కూడా డ్యాంలో చేరుతుంది. ఏటా సగటున 0.424 టీఎంసీల మేరకు పూడిక చేరుతుందని అంచనా. దీంతో క్రమక్రమంగా నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. పదేళ్లకు ఒకసారి నీటి నిల్వలపై టీబీపీ బోర్డు ఉన్నతస్థాయి కమిటీ సర్వే చేసి ఏమేరకు పూడిక చేరిందీ అంచనా వేస్తూ వచ్చారు. డ్యాం నిర్మించిన తరువాత 1963లో తొలిసారిగా టోపోగ్రాఫిక్, హైడ్రోగ్రాఫిక్ సర్వే చేశారు. అప్పటికి 5.57 టీఎంసీ మేరకు పూడిక చేరి 126.90 టీఎంసీల సామర్థ్యానికి తగ్గిపోయిందని అంచనా వేశారు. ఇలా 10-12 ఏళ్లకు ఒకసారి సర్వే చూస్తూ వచ్చారు. చివరిగా 2016లో చేసిన సర్వేలో 105.788 టీఎంసీలకు తగ్గిందని నిగ్గు తేల్చారు. 26.68-31.5 టీఎంసీల పూడిక చేరిందని అంచనా వేశారు. సర్వేచేసి పదేళ్లు కావడంతో ముందుగా టోపోగ్రాఫిక్. హైడ్రోగ్రాఫిక్ సర్వే చేసి నీటి నిల్వల లెక్కలు తేల్చాలని సబ్ కమిటీ నిర్ణయించింది.
ఖనిజ సంపదపై సర్వే చేయాలి
వరద సమయంలో పూడికతో పాటు ఇసుక, ఐరన్‌ఓర్ వంటి ఖనిజాలు కూడా వచ్చి చేరిఉంటే ఎంత పరిమాణంలో ఉన్నాయా? అనే అంశంపై అధ్యయనం చేయాలని హైపవర్ కమిటీ నియమించిన సబ్ సమిటీ నిర్ణయించింది. డ్యాం పూర్తిగా ఎండిపోయిన తరువాత వివిధ ప్రాంతాల్లో బోర్ హోల్స్ వేసి కోర్ కటింగ్ తీయాలి. వాటిని ల్యాబ్‌కు పంపి పూడిక, ఇసుక, ఐరన్‌ఓర్.. ఏది ఎంత పరిమాణంలో ఉందో నిర్ధారించాలని నిర్ణయించారు. ఈ పరీక్షల తరువాతే పూడికతీతపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.