తప్పు మీది.. శిక్ష నాదా..?
ABN , Publish Date - Apr 27 , 2026 | 11:29 PM
‘వారసత్వ భూమిని సర్వేచేసి ఇనామ్ భూమిగా మార్చింది
వారసత్వ భూమిని ఇనామ్ రికార్డుల్లోకి మార్చిన అధికారులు
నెలల కొద్దీ తిప్పుకుంటున్నారని ఆగ్రహించిన రైతు
తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నం
గోనెగండ్ల, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): ‘వారసత్వ భూమిని సర్వేచేసి ఇనామ్ భూమిగా మార్చింది రివెన్యూ అధికారులు.. దాన్ని సరి చేయమని కొద్ది నెలల నుంచి కార్యాలయాల చుట్టు తిరుగుతు న్నా. ఒక రోజు గోనెగండ్లకు, మరో రోజు కర్నూలుకు, ఇంకో రోజు ఆ దోనికి.. ఇలా ఎన్ని సార్లు తిరగాలి? తప్పు చేసింది మీరు.. శిక్ష నా కు వేస్తారా?’ అని ఆగ్రహానికి గురైన రైతు సోమవారం తహసీ ల్దార్ కా ర్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.
గోనెగండ్ల మండలం వేముగోడు గ్రామానికి చెందిన బలిజ రాఘవేంద్ర అనే రైతుకు భార్య మహేశ్వరి, ఒక కుమారుడు, ఇద్దరు కూతురులు ఉన్నారు. ఆయనకు వారసత్వంగా వచ్చిన 4ఎకరాల 38 సెంట్ల పొలం ఉంది. 196/1 సర్వేనెంబర్ కింద 2.55 ఎకరాలు, అలాగే 309/ఏ3 కింద 0.50 సెంట్లు. 311/1ఏ 0.38 సెంట్లు, 0.37 సెంట్లు, 258/ఏ 0.58 సెంట్లు ఉంది. ఈ పొలం గాజులదిన్నె ప్రాజక్టు ఎడవ కాలువ కింద ఉంది. ఏడాది క్రితం వరకు ఇది ఆయన వారసత్వ పొలంగానే ఉంది. అయితే ఇటీవల రెవెన్యూ అధికారులు భూమి సర్వే చేశారు. అందులో రాఘవేంద్రకు చెందిన 196/1 సర్వేనెంబర్ కింద 2.55 ఎకరాలు. అలాగే 309/ఏ3 కింద 0.50 సెంట్లను ఇనామ్ భూమిగా రికార్డులలో నమోదు చేశారు. ఈ విషయం రాఘవేంద్రకు తెలియదు. తన కుమారుడికి కాలేజి ఫీజ్ కట్టేందుకుగాను డబ్బులు అవసరమై కోడుమూడు బ్యాంక్‌లో క్రాప్ లోన్ రెన్యువల్ చేసేందుకు వెళ్లాడు. అక్కడ బ్యాంక్ ఉద్యోగులు నీ భూమి ఇనామ్ భూమి కింద ఉన్నది. కాబట్టి లోన్ రెన్యువల్ చేయమని చెప్పారు. దీంతో ఆయన తన భూమిని అడంగల్‌లో ఇనామ్ భూమిగా తొలగించి వారసత్వ భూమిగా మార్చాలని గత ఆరు మాసాలుగా గోనెగండ్ల తహసీల్దార్ కార్యాలయం, ఆదోని ఆర్‌డీవో కార్యాలయం, కర్నూలు కలె క్టర్ కార్యాయాల చుట్టూ తిరుగుతున్నాడు. వారం, పదిరోజులు అంటూ అఽధికారులు కాలయాపన చేస్తున్నారే కాని పని చేయలేదు. ఇంట్లో రోజురోజుకు ఆర్థిక ఇబ్బందులు తీవ్రమవుతున్నాయి. బ్యాంకులో లోన్ ఇవ్వడం లేదు. దీంతో రాఘవేంద్ర జీవితంపై విరక్తి చెందాడు. నిరాశ, ఆగ్రహం ఆయనను ఆవరించాయి. సోమవారం మధ్యాహ్నం గోనెగండ్ల తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి బిగ్గరగా ఆరుస్తూ వెంట బాటిల్‌లో తీసికెళ్లిన పెట్రోల్ వంటిపై పోసుకున్నాడు. దీన్ని గమనించిన అక్కడి జనం పక్కన హోటల్‌లో ఉన్న నీరు తీసుకువచ్చి రాఘవేంద్ర మీద పోశారు. ఈ విషయం తహసీల్దార్ రాజేశ్వరికి, పోలీసులుకు తెలియజేశారు. పోలీసులు, తహసీల్దార్ రాజేశ్వరి ఆయనను విచారించి సర్దిచేప్పడంతో రాఘవేంద్ర శాంతించాడు.
కార్యాలయాల చుట్టూ తిరిగి విరక్తి కలిగింది
నా సొంతభూమిని అధికారులు ఇనామ్ భూమిగా మార్చారు. ఈ సమస్య పరిష్కరించమని ఆరు మాసాలుగా గోనెగండ్ల, ఆదోని, కర్నూలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి విరక్తి వచ్చింది. ఇంట్లో ఆర్థిక సమస్యలు, బిడ్డకు ఆరోగ్యసమస్య, కుమారుడికి కాలేజి ఫీజ్ కట్టాలి, అదనంగా ఆదో సమస్య. తప్పు చేసింది అధికారులు. దాని శిక్ష నన్ను అనుభవించమంటున్నారు. మార్చి 9న కలెక్టర్ కలిస్తే వారం లోపు నీపని పూర్తి అవుతుందని హామీ ఇచ్చారు. పని జరగలేదు. ఈ నెల 13న కలెక్టర్‌ను కలిశాను. సరైన సమాదానం లేదు. నీకు ఊరకే పనులు అవుతాయా? అని మా గ్రామ వీఆర్‌వో మాట్లాడుతున్నాడు. ఎక్కడి వెళ్లినా నా పని జరిగేలా కనిపించలేదు.. అని ఆవేదన చెందాడు.
-రాఘవేంద్ర, రైతు వేముగోడు
ఉన్నతాధికారులకు పంపాము
ఆరు మాసాల క్రితమే రాఘవేంద్ర భూమి రికార్డులను పరిశీలించి నివేదక తయారు చేసి ఆదోని ఆర్‌డీవో కార్యాలయానికి పంపాము. అక్కడి నుంచి జేసీ దగ్గరికి వెళ్లింది. అక్కడ కూడా ఫైల్ పూర్తి అయి విజయవాడ సీసీఎల్‌ఏకు పంపారు. ఈ విషయం రాఘవేంద్రకు తెలిపాము. జేసీ కూడా రాఘవేంద్రకు ఇదే విషయం తెలిపారు. పని త్వరలో అయిపోతుంది.
-రాజేశ్వరి తహసీల్దార్, గోనెగండ్ల