16 వేల ఎకరాలకు సాగు నీరు
ABN , Publish Date - Mar 28 , 2026 | 11:36 PM
మండలంలోని రాజోలి ఆనకట్ట పరిధిలో 16 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని కేసీ కెనాల్ ఏఈ ప్రతాప్ తెలిపారు.
చాగలమర్రి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రాజోలి ఆనకట్ట పరిధిలో 16 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని కేసీ కెనాల్ ఏఈ ప్రతాప్ తెలిపారు. శనివారం మండలంలోని రాజోలి ఆనకట్ట వద్ద కుందూలో ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ రాజోలి ఆనకట్టకు ఎస్‌ఆర్‌బీసీ క్రాస్ హెడ్ రెగ్యులేటర్ నుంచి కుందూకు560 క్యూజెక్కుల నీరు విడుదల చేయించా మని, మైలవరం నుంచి చిన్నపసువుల వద్దగల ఎస్‌కెప్ చానల్ నుంచి 60 క్యూసెక్కుల నీటిని కుందూకు వదిలామని అన్నారు. ఆ నీరు రాజోలి ఆనకట్టకు చేరిందని అన్నారు. ఆనకట్ట నుంచి కడప జిల్లా వైపుగల కేసీ ప్రధాన కాలువకు 420 క్యూసెక్కులు, చాపాడు చానల్‌కు 130 క్యూసెక్కుల నీరు విడుదల చేశామని అన్నారు. మార్చి 31 వరకు రబీ సీజన్‌లో సాగు చేసిన వరితో పాటు మిగతా పంటలకు సాగునీరు అందిస్తున్నామని అన్నారు. ఎగువ నుంచి నీరు వచ్చే వరకు రైతులకు సాగునీరు అందిస్తామని అన్నారు. ఆయన వెంట కేసీకెనాల్ డీఈ పుల్లయ్య, ఏఈ జమాల్‌వలి, సూపర్‌వైజర్ దస్తగిరి, వర్క్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు.