Share News

పత్తి సేకరణలో అక్రమాలు..!

ABN , Publish Date - Feb 12 , 2026 | 11:47 PM

ఆదోనిలో సీసీఐ పత్తి సేకరణలో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఓ కాటన్‌ జిన్నింగ్‌ మిల్లులో పని చేసే ఉద్యోగి, దళారులు కుమ్మక్కై భారీ అక్రమాలకు తెర తీశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పత్తి సేకరణలో అక్రమాలు..!

ఆదోనిలో పది పత్తి జిన్నింగ్‌ మిల్లుల్లో సీసీఐ కొనుగోళ్లు

ఓ మిల్లులో భారీ ఎత్తున అవకతవకలు

మిల్లులో పని చేసే ఓ ఉద్యోగి, దళారులు కుమ్మక్కు

మిల్లులో పత్తి దింపకుండానే మాయాజాలం

రూ.3 కోట్లకు పైగా స్వాహ చేశారనే ఆరోపణ

విచారణ చేపట్టిన పోలీసు అధికారులు

ఆదోనిలో సీసీఐ పత్తి సేకరణలో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఓ కాటన్‌ జిన్నింగ్‌ మిల్లులో పని చేసే ఉద్యోగి, దళారులు కుమ్మక్కై భారీ అక్రమాలకు తెర తీశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారత పత్తి సంస్థ (సీసీఐ) కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. రైతు పేరిట ఆ కేంద్రాలకు తీసుకొచ్చి పత్తి దిగుబడులు తూకం వేశాక లారీలను సంబంధిత మిల్లులో అన్‌లోడ్‌ చేయకుండానే.. బయటకు తీసుకెళ్లడం, అదే పత్తిని మరో రైతు పేరిట సీసీఐ కేంద్రాల్లో స్లాట్‌ బుక్‌ అమ్మకానికి పెట్టి దాదాపు రూ.మూడు కోట్లకు పైగా స్వాహా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నెలలు తరువాత ఈ అక్రమాల భాగోతం పసిగట్టిన మిల్లు యజమాని పోలీసులను ఆశ్రయించిట్లు తెలుస్తోంది.

కర్నూలు, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): రాయలసీమలోనే అతిపెద్ద పత్తి మార్కెట్‌ ఆదోని. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పత్తి కనీస మద్దతు ధర రూ.8,110 నిర్ణయించింది. ఆదోని పత్తి మార్కెట్‌లో ధరలు పతనం కావడంతో రైతులకు అండగా నిలచేందుకు ప్రభుత్వం సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆదోని పట్టణంలో పది పత్తి జిన్నంగ్‌ మిల్లులను సీసీఐ లీజుకు తీసుకుంది. ఆ మిల్లుల్లోనే కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. గతేడాది అక్టోబరు 31 నుంచి గత జనవరి 13 వరకు సీసీఐ పత్తి కొనుగోళ్లు చేపట్టింది. ఒక్క ఆదోనిలోనే 4.59 లక్షల క్వింటాళ్లు సేకరించారు. పత్తి తేమ శాతాన్ని బట్టి క్వింటా రూ.7,800 నుంచి రూ.8,110కు సేకరించారు. సీసీఐ నిబంధనల ప్రకారం ఒక క్వింటం పత్తికి 68 కిలోలు దూదిని లీజుకు ఇచ్చిన కాటన్‌ జిన్నింగ్‌ మిల్లుల యాజామాన్యం ఇవ్వాల్సి ఉంది. సీసీఐ కార్డుల ప్రకారం ఏఏ పత్తి జిన్నింగ్‌ మిల్లులో ఎన్ని క్వింటాళ్లు కొనుగోలు చేశారో.. అందుకు అనుగుణంగా క్వింటాకు 68 కిలోలు చొప్పున దూది బేళ్లు ఇవ్వాలని, ఇప్పటి వరకు ఇచ్చిన దూది బేళ్లు పోనూ, ఇవ్వాల్సి బ్యాలెన్స్‌ బేళ్లు తక్షణమే స్వాధీనం చేయాలంటూ సీసీఐ అధికారులు లీజుకు తీసుకున్న కాటన్‌ జిన్నింగ్‌ మిల్లుల యజమానులకు నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది.

అక్రమాలు ఇలా..:

ఆదోని పట్టణం శిరుగుప్ప సర్కిల్‌ సమీపంలోని ఓ జిన్నింగ్‌ మిల్లు యజమానికి సీసీఐ అధికారులు చెప్పే పత్తి కొనుగోళ్ల లెక్కలకు, మిల్లులోని దూది బేళ్ల లెక్కలకు సరిపోకపోవడంతో అనుమానం వచ్చి ఆరా తీశారు. దాదాపు రూ.3 కోట్లకు పైగా విలువైన పత్తి మాయమైనట్లు తాత్కాలికంగా గుర్తించారు. దీనిపై అనుమానితులను విచారించి న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రమించారు. ఆదోని మండలం అలసందగుత్తి, నెట్టేకల్లు గ్రామాలకు చెందిన పత్తి సేకరణ దళారులు, మిల్లులో పని చేసే ఓ ఉద్యోగి కుమ్మక్కై పక్కా ప్రణాళికతో మాయ చేసినట్లు అనుమానిస్తున్నారు. ముందుగా తమకు భాగా తెలిసిన రైతుల పేరిట కప్పాస్‌ యాప్‌లో స్లాట్‌ బుక్‌ చేయడం, వాహనంలో పత్తిని తీసుకొచ్చి, తూకం వేశాక, పత్తి మిల్లులో దింపకుండానే బయటకు వెళ్లిపోవడం, మిల్లు రికార్డుల్లో లోడింగ్‌ చేసినట్లు ఆ ఉద్యోగి చూపినట్లు గుర్తించారు. మరుసటి రోజు అదే పత్తిలోడ్‌ను వాహనం నంబరు మార్పు చేసి మరో రైతు పేరిట అదే మిల్లులోని సీసీఐ పత్తి కేంద్రంలో ఉంచడడం.. ఇలా ఎవరికి అనుమానం రాకుండా ఈ భాగోతం సాగించిట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దళారులు, కాటన్‌ జిన్నింగ్‌ మిల్లు ఉద్యోగి కలిసే ఈ భాగోతం నడిపారా..? సీసీఐ అధికారుల పాత్ర కూడా ఉందా..? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సమగ్ర విచారణ చేస్తే భారీ కుంభకోణం వెలుగు చూసే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఈ విషయంపై ఆదోని తాలుకా పోలీస్‌ స్టేషన్‌ సీఐ నల్లప్ప దృష్టికి ఆంధ్రజ్యోతికి తీసుకువెళ్లగా.. సీసీఐ పత్తి కొనుగోలు సమయంలో దాదాపు రూ.3 కోట్లకు పైగా అవకతవకలు జరిగాయని మిల్లు యజామాని ప్రాథమిక సమాచారం మేరకు విచారణ చేశామని చెప్పారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Updated Date - Feb 12 , 2026 | 11:48 PM