అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
ABN , Publish Date - Sep 12 , 2026 | 11:17 PM
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఇంట్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ సుస్మిత తెలిపారు.
ఏపీ, తెలంగాణలో 93 కేసులు
రూ.67వేలు విలువైన సొత్తు స్వాధీనం
నంద్యాల క్రైం, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఇంట్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ సుస్మిత తెలిపారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నంద్యాల 3వ పట్టణ పోలీ్‌సస్టేషన్ పరిధిలోని మహానంది కాలనీ రైల్వే క్వార్టర్స్‌లో ఆగస్టు 20న తాళం వేసి ఉన్న ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీఐ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడి కదలికలను గుర్తించామన్నారు. చోరీ అనంతరం గుంటూరుకు వెళ్లిన నిందితుడు తాను వదిలి వెళ్లిన స్కూటీని తీసుకెళ్లేందుకు సెప్టెంబర్ 11న నంద్యాలకు తిరిగి వచ్చాడు. రాత్రి 9గంటల సమయంలో నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలోని పార్కిగ్ ప్రాంతంలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం వెస్ట్ కోడిపల్లికి చెందిన తిమ్మసముద్రం శివనందు వంశీగా గుర్తించారు. అతడి వద్ద నుంచి ఐఫోన్-11, టామీ హిల్‌ఫిగర్ వాచ్, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.67వేలుగా అంచనా వేశారు. విచారణలో నిందితుడిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 93 కేసులు ఉన్నట్లు గుర్తించారు. నంద్యాల, కర్నూలు, ఎమ్మిగనూరు, ఆరండల్‌పేటతో పాటు హైదరాబాద్, రాచకొండ, నల్గొండ, మహబూబ్‌నగర్, తదితర ప్రాంతాల్లో కేసులు నమోదైనట్లు వెల్లడించారు. సీఐ వేణుగోపాల్, కానిస్టేబుళ్లు శేఖర్, మద్దిలేటిని ఎస్పీ సునీల్ షెరాన్, ఏఎస్పీ సుస్మిత అభినందించారు.