Share News

అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు

ABN , Publish Date - Aug 07 , 2026 | 12:22 AM

నంద్యాల తాలుకా పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో గత ఏడాది నమోదైన చోరీ కేసును నంద్యాల సీసీఎస్‌, తాలుకా పోలీసులు చాకచక్యంగా ఛేదించారు.

అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
నిందితుడిని చూపుతున్న ఎస్పీ సునీల్‌ షెరాన్‌, ఏఎస్పీ సుస్మిత, పోలీసులు

రూ.15 లక్షల బంగారు స్వాధీనం

మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు

చాకచక్యంతో కేసును ఛేదించిన పోలీసులు

అభినందించిన ఎస్పీ

నంద్యాల క్రైమ్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): నంద్యాల తాలుకా పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో గత ఏడాది నమోదైన చోరీ కేసును నంద్యాల సీసీఎస్‌, తాలుకా పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి సుమారు 115 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.15 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. గతేడాది మార్చి 7న నంద్యాలలోని శివసాయి గార్డెన్‌ ప్రాంతంలో నివసిస్తున్న కోదండరామిరెడ్డి, ఆయన భార్య ఇంటికి తాళం వేసి నిత్యావసర సరుకుల కోసం బయటకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంట్లోకి చొరబడి బంగారు ఆభరణాలను అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు తాలుకా పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఏఎస్పీ సుస్మిత పర్యవేక్షణలో తాలుకా సీఐ ఆర్‌ ఈశ్వరయ్య, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చేపట్టాయి. బుధవారం రైతునగర్‌ బ్రిడ్జి వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పోలీసులను గమనించిన ఓ అనుమానితుడు తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన సీసీఎస్‌ పోలీసులు చాకచక్యంగా అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. శివసాయి గార్డెన్‌లో జరిగిన చోరీలో తన ప్రమేయాన్ని అంగీకరించాడు. నిందితుడిని జాఫర్‌ అలీ మహమ్మద్‌ హనీఫ్‌ సాగర్‌గా గుర్తించారు. అతడు కర్ణాటక రాష్ట్రంలోని దండేలికి చెందిన వాడు. కేసులో రెండో నిందితుడు నితీష్‌ డాప్లే మృతి చెందాడు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండడంతో వారి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. నిందితుడి వద్ద నుంచి దొంగిలించబడిన 115 గ్రాముల బంగారం ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అతడిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించడంలో విశేష కృషి చేసిన సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ సురే్‌షకుమార్‌, తాలుకా సీఐ ఈశ్వరయ్య, హెడ్‌ కానిస్టేబుల్‌ ఇబ్రహీం, కానిస్టేబుళ్లు గంగారం, కృష్ణమ నాయుడు, మాలిక్‌ భాష, వెంకటేశ్వర్లు, నాగరాజు, తదితర పోలీస్‌ సిబ్బందిని ఎస్పీ సునీల్‌ షెరాన్‌ అభినందించారు.

Updated Date - Aug 07 , 2026 | 12:22 AM