ఇంటర్ పరీక్షలు ప్రారంభం
ABN , Publish Date - Feb 23 , 2026 | 11:57 PM
జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభ మయ్యాయి. సోమవారం ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు.
నిమిషం ఆలస్యం కాకూడదన్న నిబంధనతో విద్యార్థుల్లో టెన్షన్
సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
మొదటి రోజు 823 మంది విద్యార్థులు గైర్హాజరు
కర్నూలు ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభ మయ్యాయి. సోమవారం ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొత్తం 48,964 మంది ఉన్నారు. మొదటి రోజు ప్రథమ సంవత్స రం విద్యార్థులు 26,925 మందికి గాను 26,102 మంది పరీక్ష రాశారు. 823 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.
అరగంట ముందే చేరుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులు..
మొదటి రోజు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, అధిక సంఖ్యలో చేరుకోవడంతో పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ కనిపించింది. అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు బంధువులతో చేరుకుని, హాల్ టికెట్లు నెంబర్లు ఉంచిన నోటీసు బోర్డులో తమ నెంబర్లను చూసుకోవడానికి పోటీ పడ్డారు. కర్నూలు నగరంలో అత్యధిక పరీక్ష కేంద్రాలు ఉండటంతో వాహనాల రాకపోకలతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తి విద్యార్థులు, తల్లిదండ్రులు అసౌకర్యానికి గురయ్యారు. పాతనగరంలోని గడియారం ఆసుపత్రి, కింగ్ మార్కెట్, ఉస్మా నియా కళాశాల, రాజ్‌విహార్ సర్కిల్, మౌర్యఇన్ సర్కిల్ వద్ద వాహనాల రాకపోకలు స్థంభించి పోవడంతో ఇబ్బందులు పడ్డారు.
రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు..
పట్టణాల్లో కాస్త మెరుగ్గా ఉన్నా, గ్రామాల నుంచి మండల కేద్రాలకు చేరుకోవసిన విద్యార్థులు ఆటోలు, బైకుల్లో పరీక్షా కేంద్రానికి చేరుకుకున్నారు. బస్సు సౌకర్యం ఉన్నప్పటికి మెయిన్‌రోడ్డుపైనే నిలిపివేయడంతో అక్కడి నుంచి పరీక్ష కేంద్రాలకు కాలినడకన చేరుకున్నారు. కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు తమ విద్యార్థులు బస్సులను ఏర్పాటు చేశాయి.
సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశా రు. అలాగే వైద్యబృందాలను, మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. నగరంలోని పసుపుల రోడ్డు శ్రీ చైతన్య జూనియర్ కళాశాల, ఎస్‌ఆర్ కళాశాల, సెయింట్ జోసెఫ్, సెయింట్ మేరీస్ కళాశాల సెంటర్లను రాష్ట్ర పరిశీలకుడు నాగముని పర్యవేక్షిం చారు. అలాగే ఆర్‌ఐవో లాలెప్ప, సిట్టింగ్, స్క్వాడ్ బృందాలు జిల్లా పరీక్షల విభాగం సభ్యులు కూడా పర్యవేక్షించారు.
ఫ్యాన్లు లేక ఇబ్బంది..
ఫిబ్రవరిలోనే ఎండలు పెరగడం, రాష్ట్రంలోనే జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండంతో విద్యార్థులు కొంత ఇబ్బంది పడ్డారు. కొన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యుత్, ఫ్యాన్లు ఉన్నా అవి పని చేయకపోవడంతో విద్యార్థులు అసౌకర్యానికి గురయ్యారు. మున్సిపల్ అధికారులు తాగునీరు ఏర్పాటుచేసినా, కొంత మంది విద్యార్థులు ఆ నీరు తాగేందుకు సుముఖత చూపలేదు. మరి కొంత కేంద్రంలోకి వెళ్లే సమయంలో ఇంటి నుంచి తెచ్చుకున్న వాటర్ బాటిల్స్‌ను తీసుకెళ్లడం కనిపించింది.
నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
ఉదయం 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిలేదు. విద్యార్థులు అరగంట ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకుని, నోటీసు బోర్డులో నెంబర్లను సరిచూసుకుని పరీక్ష గదిని చెక్ చేసుకోవాలి. మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.
- జి.లాలెప్ప, ఆర్‌ఐవో, కర్నూలు.