నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
ABN , Publish Date - Feb 23 , 2026 | 12:19 AM
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఈ నెల 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు జరుగుతాయి.
జిల్లాలో 75 పరీక్ష కేంద్రాలు, 48,964 మంది విద్యార్థులు
సీసీ కెమెరాల ఏర్పాటు
ఒక నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
ఇంటర్ పరీక్షలకు పక్కా పకడ్బందీ ఏర్పాట్లు
కర్నూలు ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఈ నెల 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు జరుగుతాయి. జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు జూనియర్ కళాశాలలు 160 ఉన్నాయి. ఈ కళాశాలలో 48,964 మంది ఉన్నారు. ప్రథమ సంవత్సరం 26,473 మంది, ద్వితీయ సంవత్సరం 22,491 మంది పరీక్షలు రాయడానికి సిద్ధమ య్యారు. ఈ పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు కొనసాగుతాయి. జిల్లా వ్యాప్తంగా 75 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్నీ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఇంటర్మీడియట్ బోర్డుకు అనుసంధానం చేశారు. అత్యవసర సమస్యల కోసం ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండేలా టోల్‌ఫ్రీ నెంబర్ 1800 425 1531, ల్యాండ్ ఫోన్ నెంబర్.08645277702, జిల్లా స్థాయిలో 08518-222047 టోల్‌ఫ్రీ నెంబర్లను సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.
ప్రథమ సంవత్సరం విద్యార్థులకు 32 పేజీల బుక్‌లెట్
ఇంటర్ ప్రథమ సంవత్సరం సిలబస్‌తో పాటు ప్రశ్నాపత్రాల విధానంలోనూ భారీ సంస్కరణలు తీసుకువచ్చారు. సమాధానాలు రాయడానికి ఇప్పటి వరకు 24 పేజీలు బుక్‌లెట్ ఇచ్చేవారు. ఈసారి 32 పేజీల బుక్‌లెట్‌ను అందజేస్తారు. అదనపు పేజీలు ఇవ్వరు. ప్రథమ సంవత్సరంలో గణితం, భౌతిక శాస్త్రం, రసాయన, జీవ శాస్త్రాల్లో ప్రశ్నల సంఖ్య పెరగడంతో బుక్‌లెట్ ఫీజులు పెంచారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మాత్రం గతం మాదిరిగానే 24 పేజీల బుక్‌లెట్ ఇస్తారు.
జంబ్లింగ్ విధానంలోనే పరీక్షలు
గతం మాదిరిగానే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జంబ్లింగ్ విధానంలోనే నిర్వహిస్తారు. ఇంటర్ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు పాత పద్ధతినే అనుసరిస్తున్నారు.
నాలుగు సమస్యాత్మక పరీక్ష కేంద్రాలు
ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో చూచి రాతలు, మాల్ ప్రాక్టీసు జరిగే కేంద్రాలను ఇంటర్ బోర్డు అధికారులు గుర్తించారు. కృష్ణగిరి ఏపీ మోడల్ జూనియర్ కాలేజీ, పత్తికొండ, కోసిగి, చిప్పగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రాల్లో అవకతవకలు జరగకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు.
రవాణా సౌకర్యం ఏర్పాటు
జిల్లాలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జరిగే 17 పరీక్ష కేంద్రాలకు రవాణా సౌకర్యం లేదని గుర్తించి ఆర్టీసీ బస్సులు నడపాలని కలెక్టర్ డా. సిరి అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు బస్సు పాసులు ఉంటే అనుమతిస్తారు.
జిరాక్స్ సెంటర్ల మూసివేత
పరీక్షలు జరిగే తేదీల్లో ఉదయం 9 నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు ఆయా పరీక్ష కేంద్రాల పరిసరాల ప్రాంతాల్లో ఉన్న జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయాలని కర్నూలు ఉప కార్మిక కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
నిమిషం ఆలస్యమైనా అనుమతించం
ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుందని, ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోనికి అనుమతించరు. ఉదయం 8.30 గంటలలోపు విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. అన్నీ పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ఫర్నీచర్, మెడికల్ టీమ్ ఏర్పాటు చేశాం. తగినంత గాలి, వెలుతురు ఉండేలా చర్యలు తీసుకున్నాం. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. హాల్‌టికెట్‌లను ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా విద్యార్థులు డౌన్‌లోడు చేసుకోవచ్చు. పరీక్ష కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్ మినహా ఎవరికీ సెల్ ఫోన్ల అనుమతి లేదు.
- జి.లాలెప్ప, ఆర్‌ఐవో, కర్నూలు