నేటి నుంచి ఇంటర్ మూల్యాంకనం
ABN , Publish Date - Jun 06 , 2026 | 11:34 PM
కర్నూలు ప్రభుత్వ టౌన్ మోడల్ జూనియర్ కళాశాలలో ఆదివారం నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డు సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతుందని ఆర్‌ఐవో జి.లాలెప్ప తెలిపారు.
కర్నూలు ఎడ్యుకేషన్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): కర్నూలు ప్రభుత్వ టౌన్ మోడల్ జూనియర్ కళాశాలలో ఆదివారం నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డు సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతుందని ఆర్‌ఐవో జి.లాలెప్ప తెలిపారు. ఆదివారం తెలుగు, హిందీ, ఇంగ్లీషు, సంస్కృతం, చరిత్ర, గణితం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, మైనర్ లాంగ్వేజెస్ మైనర్ మీడియా సబ్జెక్టుల మూల్యాంకనం ప్రారంభమవుతుందని చెప్పారు. సంబంధిత అసిస్టెంట్ ఎగ్జామినర్స్, చీఫ్ ఎగ్జామినర్స్ ఉదయం 9.30 గంటలకు విధిగా హాజరు కావాలన్నారు. సోమవారం కామర్స్, సివిక్స్, ఎకనామిక్స్ మూల్యాంకనం ప్రారంభమవుతుందని చెప్పారు. వాల్యుయేషన్ విధులకు ఉత్తర్వులు వచ్చిన అధ్యాపకులను తక్షణమే రిలీవ్ చేసి వారిని నిర్దేశిత తేదీల్లో శిబిరానికి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కళాశాల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. జిల్లాకు మొత్తం 1,02,100 జవాబుపత్రాలు వచ్చాయని చెప్పారు. వాల్యుయేషన్ ఏసీవోలు 32 మంది, చీఫ్ ఎగ్జామినర్లు 153 మంది, అసిస్టెంట్ ఎగ్జామినర్స్ 1446 మంది, స్కూటినైజర్స్ 180 మందిని నియమించినట్లు ఆర్‌ఐవో తెలిపారు.
రేపటి నుంచి పదో తరగతి పత్రాలు..
కర్నూలు ప్రభుత్వ టౌన్ మోడల్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు 10వ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతున్నట్లు కర్నూలు జిల్లా పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ గోవిందు నాయక్ శనివారం పేర్కొన్నారు. ఇతర జిల్లాల నుంచి ఇప్పటి వరకు 9774 పరీక్ష జవాబు పత్రాలు వచ్చాయని తెలిపారు. ఇంగ్లీషు సబ్జెక్టు పరీక్ష జవాబు పత్రాలు రావాల్సి ఉందన్నారు. ట్యాబ్ బేస్డ్ వాల్యుయేషన్ కోసం అసిస్టెంట్ ఎగ్జామినర్స్, చీఫ్ ఎగ్జామినర్లు మొత్తం 170 మంది, స్పెషల్ అసిస్టెంట్లు 90 మందిని, ముగ్గురుని క్యాంప్ ఆఫీసర్లుగా నియమించినట్లు తెలిపారు. ఈ నెల 8న ఉదయం 8 గంటలకు విధిగా పది స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో ఏఈలు, సీఈలు, స్పెషల్ అసిస్టెంట్లు కర్నూలు ప్రభుత్వ టౌన్ మోడల్ పాఠశాలలో రిపోర్టు చేసుకోవాలన్నారు. బోర్డు నిర్ణయించిన నిర్ణీత సమయంలో మూల్యాంకన శిబిరం పూర్తి చేసేందుకు డీఈవో సుధాకర్ ఆధ్వర్యంలో పూర్తి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు డ్యూటీ ఉత్వర్వులు పంపిణీ చేసినట్లు తెలిపారు.