ఇన్ ఫ్లో నిల్..
ABN , Publish Date - Sep 29 , 2026 | 11:33 PM
కృష్ణా పరివాహక ప్రాంతాల నుంచి వరద లేకపోవడంతోపాటు ప్రతి రోజు వేల టీఎంసీల నీరు వినియోగించి దిగువకు విడుదల చేస్తుండటం వల్ల రిజర్వాయర్‌లో నీటి మట్టం తగ్గిపోతోంది.
శ్రీశైలంలో 89 టీఎంసీల నీటి నిల్వ
మరో నెల రోజుల్లో 830 అడుగులకు తగ్గుముఖం
శ్రీశైలం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కృష్ణా పరివాహక ప్రాంతాల నుంచి వరద లేకపోవడంతోపాటు ప్రతి రోజు వేల టీఎంసీల నీరు వినియోగించి దిగువకు విడుదల చేస్తుండటం వల్ల రిజర్వాయర్‌లో నీటి మట్టం తగ్గిపోతోంది. ఇదిలాగే కొనసాగితే మరో నెల రోజుల్లో నీటిమట్టం 830 అడుగులకు తగ్గుముఖం పడుతూ క్రస్ట్‌గేట్ల దిగువకు నీటినిల్వలు చేరుకునే పరిస్థితి ఎదురవుతుందని నిపుణులు భావిస్తున్నారు. మంగళవారం ఎగువ ప్రాజెక్టుల విద్యుదుత్పత్తి నుంచి నీరు విడుదల కాకపోగా తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేసేందుకు 42,378 క్యూసెక్కుల నీరు వినియోగించుకుని దిగువ సాగర్‌కు విడుదల చేసినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. అదే విధంగా తాగునీరు సాగునీటి కోసం హంద్రీ నీవా లిఫ్ట్ ఇరిగేషన్‌కు 3800 క్యూసెక్కులు, కల్వకుర్తికి 2400 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడుకు 3000 క్యూసెక్కులు, వెలుగొండ ప్రాజెక్టుకు 500 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 158 క్యూసెక్కుల నీరు మంగళవారం సాయంత్రానికి అవుట్‌ఫ్లోగా నమోదైంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 850.00 అడుగులు ఉండగా, పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 89.29 టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే ఉన్నట్లు అధికారులు తెలిపారు.