Share News

వేధిస్తున్న లైన్‌మెన్ల కొరత..

ABN , Publish Date - Aug 02 , 2026 | 12:42 AM

మండలంలో లైన్‌మెన్ల కొరతతో వినియోగదారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 19గ్రామ పంచాయతీలు, 11 మజరా గ్రామాలు ఉండగా, 17 గ్రామ సచివాలయాలు ఉన్నాయి.

వేధిస్తున్న లైన్‌మెన్ల కొరత..
చాగలమర్రి విద్యుత్‌ కార్యాలయం

చాగలమర్రి మండలంలో 15వేల కనెక్షన్లు, తగినంత లైన్‌మెన్లు లేకపోవడంతో తరచూ విద్యుత్‌ సమస్యలు

చాగలమర్రి, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): మండలంలో లైన్‌మెన్ల కొరతతో వినియోగదారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 19గ్రామ పంచాయతీలు, 11 మజరా గ్రామాలు ఉండగా, 17 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. మండలంలో మొత్తం 20 వేల విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా వాటిలో 15వేల గృహ కనెక్షన్‌లు, 5,500 వ్యవసాయ కనెక్షన్‌లు ఉన్నాయి. ప్రతి గ్రామ సచివాలయానికి ఒక జూనియర్‌ లైన్‌మెన్‌తో పాటు లైన్‌మెన్‌ కూడా ఉండాలి. అయితే చాలా గ్రామాలకు జూనియర్‌తో పాటు, లైన్‌మెన్‌ కూడా లేదు. మేజర్‌ పంచాయతీ చాగలమర్రిలో 5 మంది రెగ్యులర్‌ లైన్‌మెన్లు అవసరం, అయితే ఇక్కడక ఇద్దరు లైన్‌మెన్‌లు, జూనియర్‌లైన్‌ మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు.

సమస్య వస్తే అంతే!

విద్యుత్‌ సరఫరాలో అంతరాయం తలెత్తినా, సరఫరా సమస్య తలెత్తిన సందర్భంలో సిబ్బంది ఎల్‌సీ తీసకున్న అనంతరం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని, విద్యుత్‌ సరఫరా ఆగిపోతుందని పరిష్కారం కావడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. డి.వనిపెంట, కొత్తపల్లె, గొట్లూరు, రాజోలి గ్రామాలకు సిబ్బంది లేకపోవడంతో ఇతర గ్రామాల లైన్‌మెన్‌లపై ఆధారపడాల్సి వస్తోంది. చిన్నవంగలి, పెద్దవంగలి గ్రామాలకు కేవలం జూనియర్‌ లైన్‌మెన్‌ మాత్రమే ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. మల్లేవేముల, నగల్లపాడు, కలుగొట్లపల్లె, మద్దూరు, బ్రాహ్మణపల్లె, ఆవులపల్లె గ్రామాల్లో కేవలం రెగ్యులర్‌ లైన్‌మెన్‌ మాత్రమే ఉన్నారు. విద్యుత్‌ సమస్య తలెత్తితే ఇతర గ్రామాల్లోని లైన్‌మెన్‌లు లేదా సచివాలయ జూనియర్‌ లైన్‌మెన్‌లు వచ్చి సరి చేయాల్సి ఉండటంతో గంటల సమయం పడుతోంది. దీంతో చేసేదేమీ లేక ప్రైవేటు హెల్పర్లతో పని చేయించుకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు రాత్రి 12 గంటల సమయంలో త్రీ ఫేస్‌ విద్యుత్‌ సరఫరా చేస్తుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్‌ అధికారులు పగటిపూట త్రీఫీస్‌ ఇవ్వాలని, విద్యుత్‌ సిబ్బంది కొరతను తీర్చాలని రైతులు, వినియోగదారులు కోరుతున్నారు.

లైన్‌మెన్ల కొరత వాస్తవమే

మండలంలో కొన్ని గ్రామాలకు లైన్‌మెన్లు లేనిమాట వాస్తవమే. విద్యుత్‌ సమస్య వచ్చినప్పుడు తక్షణమే పరిష్కరిస్తున్నాం. ప్రజలకు, రైతులకు పూర్తిస్థాయిలో సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సిబ్బంది కొరతపై ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదించాం. - రమణయ్య, ఏఈ, చాగలమర్రి

Updated Date - Aug 02 , 2026 | 12:42 AM