కంబాలపాడులో ఇండస్ట్రియల్ పార్క్
ABN , Publish Date - Oct 29 , 2026 | 11:03 PM
పత్తికొండ నియోజకవర్గం క్రిష్ణగిరి మండలంలోని కంబాలపాడు గ్రామంలో పరిశ్రమల ఏర్పాటుకు అడుగులు పడ్డాయి.
ఏపీఐఐసీకి 200 ఎకరాలు
జైరాజ్ ఇస్పాత్ పరిశ్రమ విస్తరణకు 418.55 ఎకరాలు
జాక్సన్ పోలార్ కంపెనీకి 290 ఎకరాలు
మంత్రివర్గం ఆమోదం
కర్నూలు, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): పత్తికొండ నియోజకవర్గం క్రిష్ణగిరి మండలంలోని కంబాలపాడు గ్రామంలో పరిశ్రమల ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు పలుమార్లు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిశ్రమల స్థాపనకు ఆయన చేసిన కృషి ఫలించింది. కంబాలపాడు కేంద్రంగా పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రామంలో సర్వే నంబరు 855లో 85.758 ఎకరాలు, సర్వే నంబరు 859లో 114.242 ఎకరాలు చొప్పున మొత్తం 200 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఎకరా రూ.7,81,349 ప్రకారం ఏపీఐఐసీకి కేటాయిస్తూ గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.15.62 కోట్లు ఏపీఐఐసీ ప్రభుత్వానికి చెల్లిస్తే, ఆ భూమిని ఏపీఐఐసీకి స్వాధీనం చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత పారిశ్రమిక పార్క్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసే అవకాశం ఉంది. అలాగే ఓర్వకల్లు మండలం గుట్టపాడు గ్రామం వద్ద జైరాజ్ ఇస్పాత్ కంపెనీ విస్తరణకు 418.55 ఎకరాలు, మీదివేముల గ్రామం వద్ద సోలార్ పార్కు ఏర్పాటుకు జాక్సన్ సోలార్ ఇంటిగ్రేటెడ్ లిమిటెడ్ కంపెనీకి 290 ఎకరాలు కేటాయించారు. ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో రిలయన్స్ కన్స్యూమర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (ఆర్సీపీఎల్) సంస్థ నిర్మిస్తున్న ప్యాకేజ్డ్ కార్బోనెటెడ్ శీతల పానీయాలు, జ్యూస్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తయారీ యూనిట్ పెట్టుబడులు రూ.2,606 కోట్లకు పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కంపెనీ ద్వారా 1,200 మందికి ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయని అంచనా.