గ్రామీణ స్థాయికి పారిశ్రామికాభివృద్ధి
ABN , Publish Date - May 25 , 2026 | 10:52 PM
పారిశ్రామికాభివృద్ధిని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లాలని ధృఢసంకల్పంతో కూటమి ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు.
మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
గోస్పాడు, మే 25 (ఆంధ్రజ్యోతి): పారిశ్రామికాభివృద్ధిని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లాలని ధృఢసంకల్పంతో కూటమి ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఎంఎస్‌ఎంఈ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టర్ రాజకుమారి గనియాతో కలిసి యాళ్ళూరు గ్రామంలో శంకుస్థాపన చేశారు. రూ 16.40 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన ఎంఎస్‌ఎంఈ పార్క్ నిర్మాణానికి 9 ఎకరాల భూమిని ఇక్కడికే ఏపీఐఐసీకి అధీనంలో ఉందని తెలిపారు. పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా మౌలిక వసతుల కల్పనను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్దిలోకి తేవాలనే లక్ష్యంతో పని చేస్తున్నారని, ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని అన్నారు.
భూసేకరణ వేగవంతం: కలెక్టర్
జిల్లాలో ఎంఎస్‌ఎంఈ పార్క్ ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని అన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో జుపాడుబంగ్లా మండలం తంగడంచ గ్రామంలో, డోన్ నియోకవర్గం జలదుర్తి గ్రామంలో, బనగానపల్లె నియోజకవర్గం ఇటిక్యాల గ్రామంలో, ఆళ్ళగడ్డ నియోజకవర్గం ఆర్ క్రిష్ణాపురం గ్రామాలలో ఎంఎస్‌ఎంఈ పార్క్‌ల ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియ చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో విశ్వనాథ్, టీడీపీ ఎన్‌ఎండీ ఫయాజ్, టీడీపీ మండల కన్వీనర్ తులసీశ్వర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఓబుల్ రెడ్డి, భూమా హుస్సేన్, మనోజ్, వెంకటరెడ్డి, బాలీశ్వర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.