గవర్నర్ ప్రసంగంలో ఇండస్ట్రియల్ కారిడార్
ABN , Publish Date - Feb 11 , 2026 | 11:27 PM
గవర్నర్ ప్రసంగంలో ఇండస్ట్రియల్ కారిడార్
సీమ ప్రగతికి ఊతం ఓర్వకల్లు పారిశ్రామిక క్లస్టర్
కర్నూలు మీదుగా బుల్టెట్ ట్రైన్
కర్నూలు, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ‘పెట్టుబ డులు రాబట్టాలి.. యువతరానికి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి.. తద్వారా రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించాలి.. పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధా మం కావాలి..!’ ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యం లోని కూటమి ప్రభుత్వ సంకల్పం. బుధవారం అసెం బ్లీలో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తూ.. పారిశ్రామిక పార్కులు, ఎంఎస్‌ఎంఇ పార్కులు, సెక్టోరల్ క్లస్టర్లు.. వంటి బలమైన వ్యవస్థ ద్వారా పారిశ్రామిక మౌళిక సదుపాయాలు విస్తరిస్తున్నాయని స్పష్టం చేశారు.
ఓర్వకల్లు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ 2,612 ఎకరాల్లో రూ.2,786 కోట్లతో అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బడ్జెట్-2024-25 ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్‌పై కీలక ప్రకటన చేశారు. నేషనల్ ఇండస్ర్టియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎన్‌ఐసీడీపీ)లో భాగంగా ఇండస్ర్టియల్ స్మార్ట్ సిటీల అభివృద్ధికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఫేజ్-1 కింద 2,612 ఎకరాల్లో ఓర్వకల్లు ఇండస్ర్టియల్ స్మార్ట్ సిటీలో రూ.2,786 కోట్లతో మౌలిక వసతులు కల్పనకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేశారు. నాన్ మెటలిక్ మినరల్ పరిశ్రమలు, ఆటోమొబైల్ రంగం విడిభాగాల తయారీ, పునరు త్పాధక పరిశ్రమలు, ఎలక్ట్రికల్ అండ్ ఎలకా్ట్రనిక్ పరిక రాలు, ఏరోస్పెస్ అండ్ డిషెన్స్ హార్డ్‌వేర్, ఫార్మా స్యూటికల్స్, వజ్రాలు, బంగారు అభరణాల తయారీ, వస్త్ర ఉత్పత్తి రంగ పరిశ్రమలు ఇక్కడే ఏర్పాటు చేసేందుకు నేషనల్ ఇండస్ర్టియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఐసీడీసీ) ప్రత్యేక దృష్టిని పెట్టిందని, ఈ పరిశ్రమలు ఏర్పాటు ద్వారా రూ.12 వేల కోట్లు పెట్టుబడులు, 45,071 మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేశారు.
ఓర్వకల్లు కేంద్రంగా వస్తున్న పరిశ్రమలు
ఓర్వకల్లు మండలం గుమ్మటంతండా, నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నాపురం గ్రామాల మధ్య గ్రీన్‌కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ 4,766.28 ఎకరాలో 5,230 మెగావాట్ల పవర్ ఉత్పత్తి సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టు (ఐఆర్‌ఏఎస్‌పీ) నిర్మాణం పూర్తయ్యింది. ప్రాజెక్టు ప్రారంభానికి సన్నహాలు చేస్తున్నారు. ఇది దేశంలోనే తొలి ప్రాజెక్టు. 1,680 మెగావాట్లు స్టోరేజ్ హైడ్రోపవర్ ప్రాజెక్టు (పీఎస్‌హెచ్‌పీ), 3 వేల మెగావాట్లు సోలార్, 550 మెగావాట్లు విండ్ పవర్ ఉత్పత్తి చేస్తారు. ఒకే చోట మూడు రకాల విద్యుత్ ఉత్పత్తి చేసి, నిల్వ చేసే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు.
ఓర్వకల్లు సమీపంలో 415 ఎకరాల విస్తీరణంలో జైరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమకు 2017లో ఆనాటి సీఎం చంద్రబాబు పునాదిరాయి వేశారు. దాదాపు రూ.3 వేల కోట్లు పెట్టుబడితో ఈ పరిశ్రమను ప్రారంభించారు. 0.45 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్తత్పి సామర్థ్యం. వంద శాతం పనులు పూర్తి చేసుకొని ట్రైల్‌రన్ ఉత్పత్తిని కూడా చేపట్టింది.
ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్ కారిడార్‌లో రూ.22,976 కోట్ల పెట్టుబడి అంచనాతో స్థాపించే సెమీ కండక్టర్స్ యూనిట్‌కు రాయితీపై 150 ఎకరాలు కేటాయించారు. ఈ పరిశ్రమ ద్వారా 1,241 మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా.
ఓర్వకల్లు కేంద్రంగా డ్రోన్ అండ్ రోబోటిక్ డ్రోన్ సిటీ ఏర్పాటు చేయనున్నారు.
సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.1,090 కోట్లతో అంచనాతో వంద ఎకరాల్లో సింథటిక్ ఆర్గానిక్ కెమికల్స్ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ సంస్థ ద్వారా 1,200 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనుంది.
రిలయన్స్ సంస్థ రూ.1,622 కోట్లతో పెట్టుబడితో శీతలపానీయాలు, జ్యూస్, తాగునీరు తయారీ పరిశ్రమ స్థాపనకు దాదాపు సన్నాహాలు పూర్తయ్యాయి. 80 ఎకరాల భూమిని కూడా కేటాయించారు. 1,200 మందికి ప్రత్యేక్షంగా ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి.
జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్‌లో భాగంగా 1,150 మందికి ఉపాఽధి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా రూ.291 కోట్లతో జైన్ ఫార్మ ఫ్రెష్‌పుడ్ లిమిటెడ్, 400 మందికి ఉపాధి కల్పించేందుకు రూ.300 కోట్లతో జయాదిత్య ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్, 250 మందికి ఉపాధి కల్పించేలా రూ.45 కోట్లతో ఫ్రెష్‌బో హార్టికల్చర్ పరిశ్రమ, 25 మందికి ఉపాధి కల్పించేలా రూ.10 కోట్లతో శ్రీమిత్ర ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ప్రభుత్వంలో ఎంఓయూ చేసుకున్నాయి.