ప్రయాణికులకు సౌకర్యాలను పెంచండి
ABN , Publish Date - Jan 20 , 2026 | 11:28 PM
రైల్వే ప్రయాణికుల సౌకర్యాలను పెంచడానికి చేపడుతున్న వివిధ పనులను సకాలంలో పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాత్సవ అధికారులను ఆదేశించారు.
రూ.46.41కోట్ల వ్యయంతో డోన్ అమృత స్టేషన్ పనులు
దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాత్సవ
వివిధ జంక్షన్లలో తనిఖీలు
డోన్ టౌన్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): రైల్వే ప్రయాణికుల సౌకర్యాలను పెంచడానికి చేపడుతున్న వివిధ పనులను సకాలంలో పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాత్సవ అధికారులను ఆదేశించారు. గుంతకల్లు డివిజన్‌లోని గుంతకల్లు రైల్వేస్టేషన్‌తో సహా బళ్లారి-గుంతకల్లు, డోన్, నంద్యాల జంక్షన్లను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. జీఎంతో పాటు గుంతకల్లు డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్ర ఎస్.గుప్త, ప్రధాన విభాగాధిపతులు, ప్రధాన కార్యాలయం డివిజన్‌కు చెందిన ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా జీఎం బళ్లారి నుంచి రియర్ విండో తనిఖీని ప్రారంభించారు. రైల్వే ట్రాక్‌ల భద్రతా అంశాలను కర్వ్, లెవెల్ క్రాసింగ్‌లను, ఎల్‌సీ, సిగ్నలింగ్ వ్యవస్థ, వంతెనలు, ఆ సెక్షన్‌లోని ప్రముఖ స్టేషన్లను పరిశీలించారు. గేట్‌మెన్‌లతో పని పరిస్థితుల గురించి చర్చించారు. జనరల్ మేనేజర్ గుంతకల్లులోని మెడికల్ రిలీఫ్ వ్యాన్, యాక్సిడెంట్ రిలీఫ్ రైలులో అందుబాటులో ఉన్న సంసిద్ధతను సౌకర్యాలను పరిశీలించారు. డోన్‌లో రూ.46.41 కోట్ల వ్యయంతో జరుగుతున్న డోన్ అమృత్ స్టేషన్‌లో పనులను సమీక్షించారు. పాణ్యం స్టేషన్‌లో జనరల్ మేనేజర్ ప్లాట్‌ఫామ్‌లపై ప్రయాణికుల సౌకర్యాలను, దివ్యాంగుల టాయిలెట్లను కూడా పరిశీలించారు. ఈతనిఖీలో మాజీ మంత్రి, డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డితో సహా అనేక మంది ప్రజాప్రతినిధులు జీఎంను కలిశారు. పలువురు నుంచి వినతులు స్వీకరించారు. రోజు వారీ పనిలో సాధారణంగా ఎదురయ్యే సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ సూచనలు చేశారు.