వేదవతి పరిధిలోకి చేర్చండి
ABN , Publish Date - Oct 09 , 2026 | 11:06 PM
ఆస్పరి మండలాన్ని వేదవతి ప్రాజెక్టు పరిధిలోకి చేర్చాలని కర్నూలు జిల్లా నీటి పారుదల శాఖ ఎస్‌ఈ శైలేశ్వర్‌ను సీపీఐ రైతు సంఘం జిల్లా కార్యదర్శి గిడ్డయ్య శుక్రవారం విజ్ఞప్తి చేశారు.
ఆస్పరి తాగు, సాగు నీటి సమస్య పరిష్కారానికి ఇదే మార్గం
సీపీఐ రైతు సంఘం జిల్లా కార్యదర్శి గిడ్డయ్య
ఎస్‌ఈకి వినతి పత్రం అందజేత
కర్నూలు అగ్రికల్చర్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ఆస్పరి మండలాన్ని వేదవతి ప్రాజెక్టు పరిధిలోకి చేర్చాలని కర్నూలు జిల్లా నీటి పారుదల శాఖ ఎస్‌ఈ శైలేశ్వర్‌ను సీపీఐ రైతు సంఘం జిల్లా కార్యదర్శి గిడ్డయ్య శుక్రవారం విజ్ఞప్తి చేశారు. తీవ్ర కరువు పరిస్థితులను ఏటా ఎదుర్కొంటూ వలసలకు మారుపేరుగా ఉన్న ఆస్పరి మండలాన్ని తక్షణమే వేదవతి ప్రాజెక్టు పరిధిలోకి చేర్చి తాగు, సాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆస్పరి గ్రామానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగనాథహల్లి వాటర్ స్కీం ద్వారా నెలకు ఒకసారి తాగునీరు అందిస్తున్నారని, మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని వారు ఎస్‌ఈకి వివరించారు. వేదవతి ప్రాజెక్టు నిర్మాణం చేస్తే మొలగవల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసే రిజర్వాయర్ ద్వారా ఆస్పరి మండలానికి సాగు, తాగునీరు ఇవ్వడానికి ఇదే అనువైన మార్గమని ఆయన అన్నారు. ఆస్పరి మండలం ఎడారి ప్రాంతంగా మారకముందే ప్రజాప్రతినిధులు సాగునీటి ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో చర్చించి ఆ మండలాన్ని వేదవతి ప్రాజెక్టు పరిధిలోకి చేర్చాలని, ఈ దిశగా వెంటనే ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వ అనుమతి పొందాలని వారు ఎస్‌ఈకి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి విరుపాక్షి, సీనియర్ నాయకులు వీరేష్ తదితరులు పాల్గొన్నారు.