Share News

క్లస్టర్‌ వర్శిటీలో ఇన్‌చార్జిల పాలన

ABN , Publish Date - Mar 16 , 2026 | 11:26 PM

క్లస్టర్‌ వర్శిటీలో ఇన్‌చార్జిల పాలన

క్లస్టర్‌ వర్శిటీలో ఇన్‌చార్జిల పాలన

అటకెక్కిన నియామకాలు, నిఽర్మాణాలు

వైసీపీ పాలనలోని అక్రమాలపై ఎమ్మెల్యే కోట్ల ఫిర్యాదు

విచారణకు ఆదేశిస్తామని సీఎం హామీ..

అసెంబ్లీలో ఎమ్మెల్యే గళమెత్తడంతో కదలిక..

దక్షిణ భారత దేశంలోనే ప్రత్యేకంగా ఉపాధి కోర్సులతో ప్రారంభించిన క్లస్టర్‌ యూనివర్సిటీ పాలన దెబ్బతినిపోయింది. అర్థాంతరంగా నిలిచిన నిర్మాణాలు, భర్తీకానీ ప్రొఫెసర్‌ పోస్టులు, ఆది నుంచి కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఉపకులపతి, రిజిస్ట్రార్‌ల మధ్య ఆధిపత్య పోరు తీవ్రస్థాయి చేరుకుకోవడం మొదలైన సమస్యలతో క్లస్టర్‌ విశ్వ విద్యాలయం కుదేలైంది. ఈ ప్రభావం విద్యార్థులపై చూపుతున్నా .. ఉన్నత విద్యామండలి పర్యవేక్షణను గాలికి వదిలేసిందనే విమర్శలున్నాయి. అధ్యాపకులు, అధికారుల్లో మార్పులు చేసినప్పటికీ .. ఉపకులపతి, రిజిస్త్రార్‌ పదవులు కూడా ఇన్‌చార్జీలకు కుదించడంతో ప్రభావం అడ్మిషన్లపై చూపుతోందని విద్యార్ధి సంఘాల నాయకులు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేక ఉపాధి కోర్సులతో ఏర్పాటైనా.. ప్రణాళిక కార్యరూపం దాల్చులేదనే విమర్శలు ఉన్నాయి.

కర్నూలు అర్బన్‌, మార్చి 16(ఆంధ్రజ్యోతి): గత టీడీపీ ప్రభుత్వం 50 నగర శివారులోని జగన్నాఽథగట్టులో 50 ఎకరాల భూమితో పాటు రూ. 88.50 కోట్ల నిఽధులు కేటాయించింది. 2021 మార్చి 5న ఏర్పాటు కాగా రెండు విడతల్లో రూ. 139 కోట్లు మంజూరయ్యాయి. గత వైసీపీ పాలనలో ఓ ప్రజాప్రతినిధి నిర్మాణాలన్నీ వర్శిటీ పరిధిలో కాకుండా ఏపీఎండీసీ సంస్థకు బదిలీ చేయడం వివాదాస్పదంగా మారింది. అప్పట్లో దాదాపు రూ. 45 కోట్ల నిర్మాణాలు జరిగాయి. వైసీపీ ప్రభుత్వ పాలనలో హడావుడిగా చివరి దశలో రూ. 25 కోట్లు మంజూరు చేసింది. కానీ కూటమి ప్రభుత్వం రాగానే మరో రూ. 20 కోట్లు మంజూరు చేసింది. ఓ ప్రజాప్రతినిధి బినామీగా నిర్మాణాల్లో భారీ అవకతవకలకు పాల్పడ్డారని, కూటమి ప్రభుత్వం ఎలా పాత బకాయిలు మంజూరు చేస్తుందని, నిర్మాణాలపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ డోన్‌ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన ప్రభుత్వం విచారణకు కమిటీ వేస్తామని ప్రకటించి చేతులు ఎత్తేసింది. ఈ క్రమంలో గత నెల 19న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీలో క్లస్టర్‌ వర్శిటీ ఉంటుందా.. లేక ఎత్తి వేస్తారా.. స్పష్టత ఇవ్వాలని చర్చ లేవదీశారు. స్పందించిన మంత్రి నారా లోకేష్‌ కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టిందని, ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని చెప్పడంతో ప్రొఫెసర్లు, ఆధ్యాపకులు, విద్యార్థుల్లో మరోసారి ఆశలు చిగురించాయి.

క్లస్టర్‌ వర్శిటీని 50 ఎకరాల్లో వర్శిటీ పరిపాలన భవనాలు, సిల్వర్‌ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాంప్లెక్స్‌ భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. రూ. 88.50 కోట్లు మొదటి విడతగా అంచనాతో 2021లో పనులు ప్రారంభించారు. బిల్లులు చెల్లించడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించింది. ఈ నేపఽథ్యంలో 2024 అక్టోబర్‌లో కాంట్రాక్లర్‌ పనులు నిలిపి వేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బకాయి బిల్లులు మంజూరు చేసింది. కేవీఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల, సిల్వర్‌ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అనుసంధానం చేస్తూ క్లస్టర్‌ వర్శిటీగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆది నుంచి రెండు కళాశాల ప్రిన్సిపాళ్లు, అప్పటి ఉపకులపతి మధ్య ఆధిపత్యపోరు కారణంగా వర్శిటీ కోర్సులు కూడా పట్టాలెక్కలేక పోయిందని విద్యార్థులు మండిపడుతున్నారు. కూటమి పాలనలోనైనా ఉపకులపతి, రిజిస్ట్రార్‌ ను నియమిస్తారని ఆశించినా ..ఉన్న వారిని తొలగించి ఇన్‌చార్జి పాలనకు పరిమితం చేశారని విద్యార్థులు ఆందోళన చెందుతువచ్చారు.

ఇన్‌చార్జిల పాలనలో ఉన్న వర్శిటీకి ప్రారంభంలోనే వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి ఉపకులపతిగా ప్రొఫెసర్‌ సాయిగోపాల్‌, రిజిస్ట్రార్‌గా శ్రీనివాసులను నియమించారు. 2025 మార్చిలో ఉపకులపతి పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి రాయలసీమ యూనివర్సిటీ ఉపకులపతికి ఇన్‌చార్జీ బాధ్యత అప్పగించారు. 2024లో రిజిస్ట్రార్‌ శ్రీనివాసులు కూడా తన పదవీ కాలం ముగియగానే మాతృసంస్థకు వెళ్లారు. ఆయన స్థానంలో కడప యోగి వేమన వర్శిటీ నుంచి మరో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కట్టా వెంకటేశ్వర్లును ఇన్‌చార్జీ రిజిస్ట్రార్‌గా నియమించారు. ఆయన కూడా 2025 ఆగస్టులో మాతృ సంస్థకు వెళ్లారు. ఆ స్థానంలో ప్రస్తుతం సిల్వర్‌ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ప్రిన్సిపాల్‌ జీ. శ్రీనివాస్‌కు రిజిస్ట్రార్‌తో పాటు ఉపకులపతి బాధ్యతలు కట్ట బెట్టారు. నూతన వీసీ, రిజిస్ట్రార్‌ల నియామకానికి చర్యలు తీసుకోకపోవడంతో ఏడాదిగా రెండు పదవులను సిల్వర్‌ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌కు బాధ్యతలు అప్పగించారు. వర్శిటీ పరిఽధిలో డిగ్రీ కళాశాలల్లో 169 మంది బోధన సిబ్బంది ఉన్నారు. మరో 49 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను నియమించాలని భావించారు. దీనిపై ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి పెడ చెవిన పెట్టడంతో పాటు ఉన్న ఉపకులపతిని తొలగించి వర్శిటీని మూసి వేసే దిశగా సంకేతాలు ఇస్తూ వచ్చారు. మంత్రి ప్రకటనతో మరోసారి ఉపిరి పోసుకున్నట్లైంది.

అటకెక్కిన నియామకాలు..

49 టీచింగ్‌ పోస్టుల భర్తీకి 2022లో ఆమోదం పొంది.. రత్నకుమారి కమిటీ సిఫారసు చేసింది. నియామకాల ప్రక్రియకు వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగకుండా అడ్డుకుందనే ప్రచారం ఉంది. దీనికి తోడు బడ్జెట్‌ సాకు చూపి ప్రక్రియను నిలిపి వేసింది. టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టు భర్తీ లేకపోవడంతో ఇతర కళాశాల నుండి డిప్యుటేషన్‌పై ఉద్యోగులను నియమించుకుని పాలన సాగదీస్తోంది.

కొత్త కోర్సులు ప్రవేశపెట్టబోతున్నాం

రాబోయే విద్యా సంవత్సరంలో నూతన కోర్సుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. వర్శిటీ పరిధిలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు, ల్యాబ్‌లు, గ్రంథాలయాలు నూతన టెక్నాలజీతో ఏర్పాటు చేశాం.

- జీ. శ్రీనివాస్‌, ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌, క్లస్టర్‌ వర్శిటీ

రెగ్యులర్‌ ఉపకులపతి, రిజిస్ట్రార్‌లను నియమించాలి

పరిపాలన అస్తవ్యస్తంగా తయాఐంది. వెంటనే రెగ్యులర్‌ ఉపకులపతి, రిజిస్ట్రార్‌ను ప్రభుత్వం నియమించాలి. ఇప్పటికే పరిపాలనలో లోపాలు తలెత్తి .. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు చేపడతాం.

- ఎస్‌. శరత్‌ కుమార్‌, జిల్లా సహాయ కార్యదర్శి, ఏఐఎస్‌ఎఫ్‌

Updated Date - Mar 16 , 2026 | 11:26 PM