Share News

ఆనందం మాటున.. అరాచకం..

ABN , Publish Date - Jun 02 , 2026 | 12:25 AM

ఆర్‌సీబీ అభిమానులు రెచ్చిపోయారు. ఆదివారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో ఆర్‌సీబీ గెలుపుతో అభిమానులు చేసిన రచ్చ వీరంగం పలు విమర్శలకు తావిస్తుంది. ఆదివారం రాత్రి 12గంటల సమ యంలో రోడ్లపైకి వచ్చి స్థానిక రాజ్‌విహార్‌ కూడలి, కిడ్స్‌ వరల్డ్‌ వద్ద వీరంగం సృష్టించారు.

ఆనందం మాటున.. అరాచకం..
రాజ్‌విహార్‌ సర్కిల్‌లో వీరంగం

ఆర్‌సీబీ గెలుపుతో వీరంగం చేసిన అభిమానులు

మూడు బస్సు ల అద్దాలు ధ్వంసం

చోద్యం చూసిన టూటౌన్‌ పోలీసులు

కర్నూలు క్రైం, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): ఆర్‌సీబీ అభిమానులు రెచ్చిపోయారు. ఆదివారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో ఆర్‌సీబీ గెలుపుతో అభిమానులు చేసిన రచ్చ వీరంగం పలు విమర్శలకు తావిస్తుంది. ఆదివారం రాత్రి 12గంటల సమ యంలో రోడ్లపైకి వచ్చి స్థానిక రాజ్‌విహార్‌ కూడలి, కిడ్స్‌ వరల్డ్‌ వద్ద వీరంగం సృష్టించారు. ఒక్కసారిగా వందలాది మంది అభిమానులు రోడ్లపైకి వచ్చి బాణాసంచా పేలుస్తూ హల్‌చల్‌ చేశారు. అప్పటి వరకు బార్లలో, రెస్టారెంట్లలో, వైన్‌షాపుల వద్ద మద్యం తాగుతూ మ్యాచ్‌ తిలకించిన వీరంతా ఆర్‌సీబీ గెలిచిన వెంటనే ఒక్కసారిగా రోడ్లపై పడ్డారు. ఈలలు, కేకలు వేస్తూ, కేరింతలు వేస్తూ బాణాసంచా కాలుస్తూ చేసిన వీరంగం విధ్వంసానికి దారీ తీసింది. డివైడర్లను పగులకొట్టారు. తాగిన మైకంలో ఏం చేస్తున్నామో అర్థం కాని పరిస్థితుల్లో చెల రేగిపోయారు. అర్ధనగ్నంగా డ్యాన్స్‌ చేస్తూ ఆటో బైక్‌ల స్నేక్‌ విన్యాసాలతో దారిన పోయే ప్రయాణికులను సైతం అడ్డుకుని విధ్వంసం సృష్టించారు. పోలీసులు పెట్టిన హోిర్డింగ్స్‌తో పాటు ప్రైవేటు యాడ్‌ ఏజెన్సీ చెందిన హోర్డింగ్స్‌ను ధ్వంసం చేశారు. దూర ప్రాంతాలకు వెళ్లే మూడు ప్రైవేటు బస్సుల అద్దాలను పగులకొట్టారు. అర్ధరాత్రి సమయంలో నిద్రలో ఉన్న సమయంలో బస్సు అద్దాలు ధ్వంసం కావడంతో, బయట ఈలలు కేకలు వినిపించడంతో ఏం జరుగుతుందో అర్థం గాక ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటనను చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిసినా కూడా..

ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఏదో ఒక జట్టు గెలుస్తుంది.. అభిమానులు సంబరాలు చేసుకుంటారు... బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిసి కూడా టూటౌన్‌ పోలీసులు పట్టించుకోలేదు. అర్దరాత్రి 12 గంటల ప్రాంతంలో అభిమానులంతా రోడ్లపైకి వచ్చి విధ్వంసం చేస్తుంటే.. తాపీగా పది మంది పోలీసులు రోడ్లపైకి వచ్చి అల్లరిమూకలు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. వందలాదిగా ఉన్న అభిమానులు ఆ పోలీసులను సైతం లెక్క చేయలేదు. పోలీసుల ఎదుటే బస్సు అద్దాలు పగులకొడుతున్నా కూడా వారు మిన్నకుండిపోయారు. ప్రతిరోజు పెద్ద ఎత్తున విజిబుల్‌ పోలీసింగ్‌ చేసే పోలీసు శాఖ ఆదివారం రాత్రి మాత్రం నిద్రమత్తులో ఉన్నారని పలువురు విమర్శలు చేస్తున్నారు. టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ రెండు సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇంత జరుగుతున్నా కూడా పోలీసులు ఏం చర్యలు తీసు కోకపోవడంతో పలువురు సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకరిద్దరు పోలీసులు లాఠీచార్జి చేసిన ప్రయత్నం చేసినా కూడా అభిమానులు పెద్ద ఎత్తున ఉండటంతో చేసేదేమీ లేక చూస్తుండిపోయారు.

విధ్వంసం చేసిన వారిపై కేసులు

అభిమానం మాటున అరాచకం చేసిన అల్లరి మూకలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పలువురు వీడియోలు చిత్రీకరించిన దృశ్యాల ఆధారంగా, సీసీ కెమెరాల ఆధారంగా ఎవెరెవరు ఈవిధ్వంసానికి పాల్పడ్డారో గుర్తిస్తున్నారు. సుమారు 50మంది వివరాలు సేకరించినట్లు తెలిసింది. వీరిలో 10 మందిని సోమవారం రాత్రి అరెస్టుచేసినట్లు సమాచారం. ఈవిషయంపై పోలీసు శాఖ స్పందించకపోవడం విశేషం.

18 మంది అరెస్టు

విజయోత్సవం పేరుతో బీభత్సం చేసిన 18మంది నిందితులను టూటౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా వీరిని గుర్తించి అందరిని స్టేషన్‌కు తరలించి. వీరిపై కేసులు నమోదు చేశారు. వినూత్న రీతిలో వీరిని మున్సిప్‌ కోర్టు వరకు నడిపించుకుంటూ తీసుకెళ్లారు. తిరిగి అక్కడి నుంచి స్టేషన్‌కు నడిపించుకుంటూ తీసుకొచ్చారు. ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేటు ఆస్తులు గానీ ధ్వంసం చేస్తే సహించేది లేదని పోలీసులు హెచ్చరించారు. ఏమైనా వేడుకలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. మిగతా వారికోసం సీసీ కెమెరాలు, వీడియోల ద్వారా ఆదారాలు సేకరిస్తున్నామని వెల్లడించారు.

Updated Date - Jun 02 , 2026 | 12:25 AM