సర్‌అస్తవ్యస్తం
ABN , Publish Date - Jun 20 , 2026 | 12:11 AM
ఈనెల 15 నుంచి ప్రారంభమైన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియ అస్తవ్యస్తంగా సాగుతోంది.
ఇంటింటి సర్వే ఎక్కడ?
ఎన్నికల నిబంధనలకు తూట్లు
వేలాది మంది ఓటర్లకు అందని ఎన్యుమరేషన్ ఫారాలు
కర్నూలు కలెక్టరేట్, జూన్ 19(ఆంధ్రజ్యోతి): ఈనెల 15 నుంచి ప్రారంభమైన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియ అస్తవ్యస్తంగా సాగుతోంది. నిబంధనల ప్రకారం అమలు కావడం లేదన్న ఆరోపణలున్నాయి. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) ఇంటింటికి వెళ్లి ప్రతి కుటుంబాన్ని కలుసుకుని ఎన్యుమరేషన్ ఫారాలు అందించాల్సి ఉంది. ఆచరణలో మాత్రం సచివాలయాలకు పరిమితమయ్యారనే విమర్శలున్నాయి. గ్రామాలు, పట్టణాలు, కార్పొరేషన్ ప్రాంతాల్లో బీఎల్వోలు ఇంటింటికి వెళ్లడం లేదని ప్రజలు చెబుతున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు సచివాలయాల్లోనే బీఎల్వోలు విధులు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సర్వే జరుగుతున్న ఆనవాళ్లు కనిపించడం లేదని అంటున్నారు. ఇప్పటివరకు బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎన్నుమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తున్నట్లు అధికారిక ఫొటోలు కూడా ఎక్కడా అప్‌లోడు చేయలేదని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
అవగాహన లేకుండా పోయింది
గ్రామాల్లో దండోరా వేయకపోవడం, గ్రా మసభలు నిర్వహించకపోవడంతో ‘సర్’పై ప్రజలకు అవగాహన లేకుండా పోయిందని స్థానికులు చెబుతున్నారు. 2002, 2025 సంవత్సరాల ఓటరు జాబితాలను సచివాల యాల్లో ప్రదర్శించాల్సి ఉన్నప్పటికీ, అనేక ప్రాంతాల్లో ఆ ప్రక్రియ కూడా జరగడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఓటుకు దూరం
గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఉదయం నుంచే పొలాలకు వెళ్లిపోతున్నారు. మరికొందరు కూలీ పనుల కోసం పట్టణాలు, నగరాలకు వెళ్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ కార్యాలయాలకు హాజరవుతున్నారు. కేంద్ర ప్రభుత్వ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు బెంగళూరు, హైదరాబాదు, కోల్‌కత్తా వంటి నగరాల్లో పనిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇం టింటికి వెళ్లి ఫారాలు అందించకుండా కేవలం సచివాలయాల్లో ఉంచితే పెద్ద ఎత్తున అర్హులైన ఓటర్లు ప్రక్రియకు దూరమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సమన్వయ లోపం
‘సర్’లో రాజకీయ పార్టీల గుర్తింపు పొందిన బూత్ ఏజెంట్లతో సమన్వయం చేయాల్సిన బీఎల్వోలు, వారికి కూడా సరైన సహకారం అందించడం లేదని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. రాజకీయ పార్టీల బూత్ ఏజెంట్లతో కలిసి ఓటుహక్కు ఉన్న ప్రతి ఓటరుకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేయాలి.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన
రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ‘సర్’పై ప్రజా అవగాహన కార్యక్రమాలు, దండోరా, గ్రామసభలు, ఫారాల పంపిణీ, జాబితాల ప్రదర్శన వంటి చర్యలు తప్పనిసరి. జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఇవి అమలు కాకపోవడంతో నిబంధనలు అడుగడుగునా ఉల్లంఘనకు గురవుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. మండల ఎన్నికల అధికారులు కూడా సమర్థవంతమైన పర్యవేక్షణ చేపట్టడం లేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
బీఎల్‌వోలు తప్పనిసరిగా ఇంటింటికి వెళ్లాలి.
ఎన్యుమరేషన్ ఫారాలను ప్రతి కుటుంబానికి అందించాలి.
గ్రామాల్లో దండోరా వేయాలి. గ్రామసభలు నిర్వహించాలి.
2002, 2025 ఓటరు జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శించాలి
రాజకీయ పార్టీల బూత్ ఏజెంట్లతో సమన్వయంతో ముందుకు వెళ్లాలి.