Share News

రోశయ్య సీఎం కావడంలో కీలకపాత్ర

ABN , Publish Date - Jul 12 , 2026 | 12:16 AM

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మరణం తర్వాత అనుభవజ్ఞుడు, మేధావి కొణిజేటి రోశయ్య సీఎం కావడంలో కీలకంగా వ్యవహరించానని, ఆ సమయంలో తాను పెద్దన్న పాత్ర పోషించినట్లు మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ అన్నారు.

రోశయ్య సీఎం కావడంలో కీలకపాత్ర
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ప్రముఖులు

అప్పట్లో పెద్దన్న పాత్ర పోషించా

మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్‌

కర్నూలు జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

ఎమ్మిగనూరు, జూలై 11 (ఆంధ్రజ్యోతి): వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మరణం తర్వాత అనుభవజ్ఞుడు, మేధావి కొణిజేటి రోశయ్య సీఎం కావడంలో కీలకంగా వ్యవహరించానని, ఆ సమయంలో తాను పెద్దన్న పాత్ర పోషించినట్లు మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ అన్నారు. శనివారం ఎమ్మిగనూరులో కర్నూలు జిల్లా ఆర్యవైశ్వ సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో అప్పట్లో కేవలం నలుగురు మాత్రమే ఆర్యవైశ్యులు ఎమ్మెల్యేలుగా ఉన్నారని, అందులో తానొకడినని.. రోశయ్య నుంచి లబ్ధిపొందిన వారు ఎవరూ ఆయన సీఎం కావాలని ముందుకు రాలేదన్నారు. అయితే అంత మంది ఎమ్మెల్యేలలో రోశయ్య సీఎం కావాలని ఆయన వెనుక నిలిచింది తానొక్కడినేనన్నారు. మన వర్గీయులు పైకి ఎదుగుతున్న సమయంలో వారికి తమ వంతు సహకరించాలని, అలా కాకుండా మౌనంగా ఇంట్లో కూర్చోవటం మంచిది కాదన్నారు. ఆర్యవైశ్యుల్లో పుట్టిన మహాత్మగాంధీ, పొట్టి శ్రీరాములు దేశం, రాష్ట్రం కోసం సేవలు చేశారని, అయితే ఆర్యవైశ్యుల కోసం ఏమి చేయలేకపోయారన్నారు. దీంతో ఓసీల్లో మిగిలిపోయామన్నారు. భయం ముందు పుట్టి ఆర్యవైశ్యులు తరువాత పుట్టారని, ఆర్యవైశ్యులు ఐక్యంగా ఉండి భయం వీడాలన్నారు. ఆర్యవైశ్యులను ఇబ్బంది పెడితే సహించేది లేదని, మనవర్గీయులను ఇబ్బంది పెడుతున్న వారిని ఇప్పటికే తరిమేశామన్నారు. ఆర్యవైశ్యులకు అండగా ఉంటానన్నారు. ఆర్యవైశ్యుల్లో అనైక్యత ఉందని దాన్ని మానుకోవాలన్నారు. కొంతమంది సంఘంలో బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడుతున్నారని, సంఘం ఆస్తులు, అమ్మవారి ఆస్తులను కొట్టేయాలని చూస్తున్నారని అటువంటి వారిని సైతం వదిలేదిలేదన్నారు. టీజీ భరత్‌ పరిశ్రమలశాఖ మంత్రిగా ఉన్నాడని భూములున్న వారు పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేవారికి మంత్రి సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయన్నారు. అలాగే సీఎం చంద్రబాబు ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారని దాని ద్వారా లబ్దిపొంది అభివృద్ది చెందాలన్నారు. అంతకు ముందు మాజీ మంత్రి బీవీ మోహాన్‌ రెడ్డిని గుర్తుచేసుకొని ఆయన సేవలను కొనియాడారు. ఆయన బాటలో తనయుడు బీవీ జయనాగేశ్వర రెడ్డి వెళ్తున్నారని కితాబిచ్చారు. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్‌ రెడ్డి, కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మయ్య, నూతన అధ్యక్ష, కార్యదర్శులు బిళేహలు భాస్కర్‌ శెట్టి, గ్రంథే వెంకటగిరి, ప్రతాప్‌ రంగయ్య శెట్టి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 12 , 2026 | 12:16 AM