Share News

కేసీలోనే నిమజ్జనం..!

ABN , Publish Date - Sep 15 , 2026 | 11:27 PM

నగరంలో వీధివీధిన గణనాథులు కొలువుదీరారు. భక్తుల అఖండ పూజలు అందుకుంటున్నారు.

కేసీలోనే నిమజ్జనం..!
మాట్లాడుతున్న మంత్రి టీజీ భరత్‌

ఎల్‌నినో ప్రభావంతో ఒట్టిపోయిన కేసీ

హంద్రీ నీవా ప్రత్యామ్నాయాన్ని ఒప్పుకోని గణేశ్‌ మహోత్సవ కేంద్ర సమితి

కేసీ కెనాల్‌కు అడ్డంగా వినాయక ఘాట్‌ ఎగువ, దిగువన తాత్కాలిక గోడలు

600 మీటర్ల పొడువున నీటి నిల్వకు సన్నాహాలు

ఉత్సవ కమిటీ ఆకాంక్ష మేరకే మంత్రి టీజీ భరత్‌

కర్నూలు, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): నగరంలో వీధివీధిన గణనాథులు కొలువుదీరారు. భక్తుల అఖండ పూజలు అందుకుంటున్నారు. తొమ్మిది రోజున గణేశ్‌ నిమ జ్జనం ఎక్కడ? భక్తులను వెంటాడుతున్న ప్రశ్న ఇది. ఎల్‌ నినో ప్రభావంతో తుంగభద్ర నది ఒట్టిపోవడం, సుంకేసుల జలాశయం అడుగంటి వినాయకుల నిమజ్జనం చేసే కేసీ కెనాల్‌లో చుక్కనీరు లేకపోవడమే ఇందుకు ప్రధాన కార ణం. అధికారులు స్వచ్ఛమైన నీటి ప్రవాహంతో గలగల పారే హంద్రీనీవాలో నిమజ్జజానికి ఏర్పాట్లు చేశారు. గణేశ్‌ మహోత్సవ కేంద్ర సమితి దీనికి అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో భక్తుల ఆకాంక్షల మేరకు కేసీ కెనాల్‌లోనే నిమజ్జనం నిర్వహిస్తామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌ పేర్కొన్నారు.

కర్నూలు నగరంలో దాదాపు 2,500 విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు గణేశ్‌ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు తెలిపారు. పూల బజారు, మిల్చిన్‌ బజారు, ఎన్‌ఆర్‌ పేట, బంగారు పేట, ధర్మపేట, ప్రకాశ్‌ నగర్‌, అరోరా నగర్‌, మాధవి నగర్‌, వెంకటరమణ కాలనీ, అశోక్‌, కృష్ణా నగర్‌, చెన్నమ్మ సర్కిల్‌, కల్లూరు ఎస్టేట్‌, సంతోష్‌ నగర్‌, డాక్టర్‌ కాలనీ.. వంటి ప్రాంతాల్లో భారీ, అతి భారీ విగ్రహాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఏడాది సూపర్‌ ఎల్‌నినో ప్రభావం కారణంగా చుక్కనీరు లేకుండా తుంగభద్ర నది ఎండిపోయింది. కర్నూలు-కడప కాలువ (కేసీ కెనాల్‌)కు నీటి ఆధారమైన సుంకేసుల జలాశయం 20 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతగా 0.201 టీఎంసీలకు పడిపోయింది. దీని వల్ల నగర శివారులో 3,050 క్యూసెక్కుల నీరు పారుతున్న హంద్రీనీవా కాలువలో నిమజ్జనం చేయడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా పరిశీలించారు. నన్నూలు టోల్‌ప్లాజా, తడకనపల్లె, ఉల్లిందకొండ సమీపంలో హంద్రీనీవా కాలువలో నిమజ్జన ఏర్పాట్లు చేయడానికి జిల్లా యంత్రాంగం పరిశీలించింది.

పట్టువీడని గణేశ్‌ ఉత్సవ సమితి

గణేశ్‌ నిమజ్జన మహోత్సవ ఏర్పాట్లపై సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో వివిధ శాఖ అధికారులు, గణేశ్‌ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు, ప్రజా ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహారశుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్‌, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, జేసీ నూరల్‌ ఖమర్‌, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు, జలవనరుల శాఖ కర్నూలు సర్కిల్‌ ఎస్‌ఈ శైలేశ్వర్‌, హంద్రీనీవా సర్కిల్‌-1 ఎస్‌ఈ రాజన్‌బాబు సహా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. హంద్రీనీవా కాలువలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు, ప్రజా ప్రతినిధులు వివరించారు. కేసీ కాలువలో కూడా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. గణేశ్‌ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు దీన్ని అంగీకరించలేదు. వారి డిమాండ్‌ మేరకు అధికారులు కేసీ కెనాల్‌లోనే నిమజ్జనం ఏర్పాట్లు చేస్తున్నారు.

ఘాట్‌ ఎగువ, దిగువన గోడలు కట్టి

కేసీ కాలువలో గణనాథుల నిమజ్జనం చేసేంతగా నీళ్లు లేవు. వినాయక ఘాట్‌ వద్ద 600 మీటర్లు పొడవు, 6-9 అడుగుల లోతులో నీరు నిలిపేందుకు ఘాట్‌ ఎగువ, దిగువన కాలువకు అడ్డంగా గోడలు నిర్మిస్తారు. నగర ప్రజలకు తాగునీరు అందించే అశోక్‌ నగర్‌ ప్రధాన పంప్‌హౌస్‌ నుంచి రోజుకు దాదాపు 3.5-4 మిలియన్‌ లీటర్లు (ఎంఎల్‌డీ) వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ద్వారా బయటకు వస్తున్న నీటిని కేసీ కాలువలోకి వదులుతున్నారు. ఆ నీటిని వినాయక్‌ ఘాట్‌ ఎగువ భాగంలో నిర్మించే గోడ వెనుక వైపు నుంచి కేసీలోకి పంపింగ్‌ చేయాలని అధికారుల ప్రణాళిక. అలా ఎత్తిపోసి నిల్వ చేసిన నీటిలో వినాయక నిమజ్జనం చేసేందుకు వీలుగా, నీటిని ఎత్తిపోసే కార్యక్రమం చేపట్టారు. అదే క్రమంలో హంద్రీనీవా కాలువలో కూడా నిమజ్జనం చేసుందుకు వీలుగా తడకనపల్లె, ఉల్లిందకొండ దగ్గర కూడా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

తుంగభద్ర డ్యాం నుంచి..

తుంగభద్ర డ్యాంలో కేసీ కెనాల్‌ వాటాగా 4.62 టీఎంసీలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వంతో చర్చించి, ఏపీ, తెలంగాణ ఉమ్మడిగా ఇండింట్‌ ఇస్తే, సుంకేసుల బ్యారేజీకి కొంతవరకైనా తుంగభద్ర జలాలు చేరే అవకాశం ఉంది. తద్వారా నగరానికి తాగునీరు, వినాయక నిమజ్జనానికి నీటి సమస్య తీరుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. కేసీ కెనాల్‌లో నిమజ్జనం కోసం 600 మీటర్లు నీరు నింపేందుకు కాలువకు రెండు వైపులు గోడలు నిర్మించి చెరువుగా మారుస్తున్నారు. హంద్రీనీవా కాలువ నుంచి ట్యాంకర్ల ద్వారా తెచ్చి కేసీని నింపితే బాగుంటందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

గణేశ్‌ ఉత్సవ కమిటీ ఆకాంక్షను గౌరవించి

ఎల్‌నినో ప్రభావం వల్ల కేసీ కెనాల్‌కు నీరు లేకపోవడంతో నన్నూరు టోల్‌ప్లాజా, తడకనపల్లె, ఉల్లిందకొండ సమీపంలో హంద్రీనీవా కాలువలో నిమజ్జనం చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పరిశీలించాం. కానీ గణేశ్‌ మహోత్సవ కేంద్ర సమితి ఒప్పుకోలేదు. దీంతో ఘాట్‌ ఎగువ, దిగువన కేసీలో గోడలు కట్టి 600 మీటర్లు పొడవు, 6-9 అడుగుల లోతులో నీరు నిల్వ చేసేందుకు చర్యలు తీసుకున్నాం.

- టీజీ భరత్‌, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఆహారశుద్ధి శాఖ మంత్రి

పకడ్బందీగా ఏర్పాట్లు

గణేశ్‌ మహోత్సవ కేంద్ర కమిటీ ప్రతినిధుల కోరిక మేరకు కేసీ కాలువలోనే నిమజ్జనం చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం.

- గౌరు చరిత, పాణ్యం ఎమ్మెల్యే

Updated Date - Sep 15 , 2026 | 11:27 PM