నిర్లక్ష్యం చేస్తే కన్నీళ్లే..!
ABN , Publish Date - Apr 05 , 2026 | 11:40 PM
తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) పశ్చిమ పల్లెసీమల దాహం తీర్చే జలజీవనాడి. గేట్ల మరమ్మతుల దృష్ట్యా జనవరి 16న ఎల్లెల్సీకి నీటి విడుదల ఆపేశారు.
ఎల్లెల్సీకి నీటి విడుదల
రెండు రోజుల్లో జిల్లాకు తుంగభద్ర జలాలు
ఇప్పటికే అడుగుంటిన ఎస్‌ఎస్ ట్యాంకులు
నీళ్లున్నప్పుడే నింపుకోవాలి
లేదంటే తాగునీటి కోసం తల్లడిల్లాల్సిందే
తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) పశ్చిమ పల్లెసీమల దాహం తీర్చే జలజీవనాడి. గేట్ల మరమ్మతుల దృష్ట్యా జనవరి 16న ఎల్లెల్సీకి నీటి విడుదల ఆపేశారు. ఇప్పటికే పలు ఎస్‌ఎస్ ట్యాంకులు అడుగంటిపోయాయి. దాహం తీర్చుకోవడం కోసం వివిధ పల్లెల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బిందెడు నీటి కోసం మండుటెండల్లో వ్యవసాయ బోరుబావుల వద్దకు పరుగులు పెడుతున్నారు. తాగునీటి అవసరాల తీర్చేందుకు జిల్లా అధికారులు ఇచ్చిన ఇండెంట్ మేరకు టీబీపీ డ్యాం నుంచి శుక్రవారం 900 క్యూసెక్కుల మేర నీటిని కాలువకు విడుదల చేశారు. రెండు మూడు రోజుల్లో జిల్లాకు తుంగభద్ర జలాలు చేరే అవకాశం ఉంది. గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీ ఇంజనీర్లు పక్కా ప్రణాళికతో ఎస్‌ఎస్ ట్యాంకులు నింపాలి. నిర్లక్ష్యం చేస్తే గ్రామీణులకు క‘న్నీటి’ కష్టాలు తప్పవు.
కర్నూలు, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 354 గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం 33 సీపీడబ్ల్యూఎస్‌లు ఉన్నాయి. వాటి నిర్వహణకు ప్రభుత్వం ప్రతి ఏటా దాదాపుగా రూ.50 కోట్లు ఖర్చు చేస్తుంది. తాగునీటి సరఫరా కోసం రూ.కోట్లు ప్రజా ధనం వెచ్చిస్తున్నా, నిత్యం కరువుతో తల్లడిల్లే పశ్చి మ పల్లెసీమల్లో తాగునీటి కష్టాలు తీరడం లేదు. ఎల్లెల్సీ కాల్వ, తుంగభద్ర నది ఆధారంగా 33 సమ్మర్ స్టోరేజ్ (ఎస్‌ఎస్) ట్యాం కులు నిర్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఎన్టీఆర్ బాధ్యతలు చేపట్టిన తరువాత 1988లో నెదర్లాండ్ అస్యూరెన్స్ ప్రాజెక్టు (ఎన్‌ఏపీ) స్కీం కింద కౌతాళం మండలం హాల్వి, ఆదోని మండలం హానవాలు, కోసిగి మండలం సాతనూరు, నందవరం మండలం చిన్నకొత్తిలికి సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు (సీపీడబ్ల్యూఎస్) నిర్మించారు. ఇప్పటికే 38 ఏళ్లు గడిచింది. 1991 జూన్ 21న ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పీవీ నరసింహారావు నంద్యాల ఎంపీగా విజయం సాధించారు. తాగునీటి కోసం 1993లో నంద్యాల వాటర్ సప్లయ్ స్కీం (ఎన్‌డబ్ల్యూఎ్‌సపీ) కింద రూ.100 కోట్లు మంజూరు చేశారు. ఈ స్కీం కింద బండగట్టు (పత్తికొండ), గోనేగండ్ల, పెద్దకడబూరు, హోళగుంద మండలం హె బ్బటం, నందవరం మండలం నాగులదిన్నె, హాలహర్వి, చిప్పగిరి మండలం ఖాజీపురం వంటి సీపీడబ్ల్యూఎస్ స్కీంలు నిర్మించారు. ఇప్పటికే 33 ఏళ్లు దాటింది. అయితే 30 ఏళ్ల జనాభాకు అనుగుణంగా అప్పట్లో డిజైన్ చేశారు. కాలపరమితి తీరడం, మరో పక్క జనాభా పెరగడంతో పూర్తిస్థాయిలో తాగునీరు సరఫరా చేయలేని పరిస్థితి ఉందని ఇంజనీర్లే అంటున్నారు. తుంగభద్ర డ్యాం గేట్ల మరమ్మతుల కారణంగా జనవరి 16న ఎల్లెల్సీ కాలువకు నీటి సరఫరా ఆపేశారు. వేసవి తాగునీటి ఇబ్బందుల దృష్ట్యా ఎస్‌ఎస్ ట్యాంకులను పూర్తిస్థాయిలో నింపుకోవాలని జలవనరుల శాఖ ఇంజనీర్లు ముందే హెచ్చరికలు జారీ చేసినా, జనాభాకు సరిపడా నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఎస్‌ఎస్ ట్యాంకులు లేకపోవడం శాపంగా మారింది.
నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు తప్పవు
ఎల్లెల్సీ ఆధారంగా ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో 195 గ్రామాలు, ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. సమ్మతగేరి, ఎల్లార్తి, విరుపాపురం, నాగనాథనహల్లి.. వంటి ఎస్‌ఎస్ ట్యాంకులు దాదాపుగా ఎండిపోయాయి. మిగిలిన ఎస్‌ఎస్ ట్యాంకుల్లో 15-25 రోజులకు సరిపడా నీరు కూడా లేవు. తాగునీటి అవసరాల కోసం మార్చి 20న ఎల్లెల్సీ నీటిని విడుదల చేయాలని టీబీపీ బోర్డుకు జిల్లా అధికారులు ఇండెంట్ ఇచ్చినా నీటి విడుదల కాలేదు. పది రోజుల వరకు రోజుకు 900 క్యూసెక్కుల చొప్పున తాగునీరు ఇవ్వాలని మరోసారి ఇండెంట్ పంపారు. శుక్రవారం తుంగభద్ర డ్యాం నుంచి నీటిని విడుదల చేశారు. రెండు మూడు రోజుల్లో జిల్లాకు నీరు చేరే అవకాశం ఉంది. వచ్చిన నీటిని వృథా చేయకుండా ఆర్‌డబ్ల్యూఎస్, జలనవరుల శాఖ ఇంజనీర్లు సమన్వయంతో తక్షణమే ఎస్‌ఎస్ ట్యాంకులు నింపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏప్రిల్, మే, జూన్ ఆఖరు వరకు తాగునీటికి డిమాండ్ ఉంటుంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా దాహం తీర్చుకోవడానికి గ్రామీణ ప్రజలు తీవ్ర కష్టాలు పడాల్సి వస్తుంది.
పుష్కలంగా నీళ్లు ఉన్నా..
తుంగభద్ర డ్యాం నుంచి ఎల్ల్లెల్సీ కాలువకు 24 టీఎంసీలు నీటివాటా ఉంది. 2025-26 నీటి సంవత్సరంలో ఎల్లెల్సీ కోటాగా 20.08 టీఎంసీలు కేటాయించారు. అందులో 14.288 టీఎంసీలు వినియోగించుకోగా, 5.80 టీఎంసీలు మిగుల వాటా ఉంది. రోజుకు 900 క్యూసెక్కులు చొప్పున ఇండెంట్ తీసుకుంటే నెలకు సరాసరి 2.33 టీఎంసీలు కావాలి. డ్యాంలో 5.80 టీఎంసీలు మిగులు వాటా ఉంది. అంటే.. జూన్ 15-20 వరకు నిరంతరాయంగా నీటిని తీసుకునే అవకాశం ఉంది. డ్యాం గేట్లు మరమ్మతుల దృష్ట్యా నిరంతరాయంగా నీటిని ఇవ్వలేమని, ఒక దఫా మాత్రమే విడుదల చేస్తామని టీబీపీ బోర్డు అధికారులు తేల్చి చెప్పినట్లు సమాచారం. డ్యాంలో నీటి వాటా పుష్కలంగా ఉన్నా, గేట్ల మరమ్మతుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో జిల్లా యంత్రాంగం పక్కా ప్రణాళిక, సమన్వయంతో చుక్కనీరు కూడా వృథా చేయకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే క్రమంలో జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తుంగభద్ర డ్యాం నుంచి పూర్తివాటా నీటిని తీసుకునేలా కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.
మున్సిపాలిటీల్లో ఇది పరిస్థితి
ఆదోని పట్టణ జనాభా 2.60 లక్షలు. ప్రధాన తాగునీటి ఆధారం ఎల్లెల్సీ కాలువ. రోజుకు 26 మిలియన్ లీటర్లు (ఎంఎల్‌డీ) సరఫరా చేయాల్సి ఉంటే 24 ఎంఎల్‌డీ మాత్రమే సరఫరా చేస్తున్నారు. తాగునీటి అవసరాలు తీర్చేందుకు 3,110 మిలియన్ లీటర్లు (120 రోజులకు సరిపడా) సామర్థ్యంతో బస్సాపురం ఎస్‌ఎస్ ట్యాంక్ నిర్మించారు. డిజైన్ లోపమో, నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు విస్మరించారో..? ఇంజనీర్లకే తెలియాలి. అప్పుడే ఎస్‌ఎస్ ట్యాంక్ కట్ట కుంగిపోయింది. ఇసుక సంచులు అడ్డంగా వేసి 700-800 మిలియన్ లీటర్లు (ఎంఎల్) నింపుతున్నారు. అంటే.. నెల రోజులకు మించి సరిపోవడం లేదు.
ఎమ్మిగనూరు పట్టణ జనాభా 1.20 లక్షల జనాభా ఉంది. తాగునీటి అవసరాలకు ఎల్లెల్సీ కాలువే ఆధారం. రోజుకు 14 ఎంఎల్‌డీ నీరు సరఫరా చేయాల్సి ఉంటే 10.45 ఎంఎల్‌డీ సరఫరా చేస్తున్నారు. పట్టణ జనాభా నీటి అవసరాలు తీర్చే నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఎస్‌ఎస్ ట్యాంక్ లేదు. దీంతో గుడేకల్లు చెరువు ఆధారపడాల్సి వస్తుంది. పులికనుమ రిజర్వాయన్ నుంచి నీటిని తీసుకున్నా, ప్రస్తుతం 25-30 రోజులకు మించి నీటి నిల్వలు లేవు. దీంతో ఎల్లెల్సీపైనే ఆధార పడాల్సి వస్తుంది.
ఆదోని, ఎమ్మిగనూరు పట్టణ ప్రజల అవసరాలు దృష్ట్యా మే ఆఖరు వరకు ఎల్లెల్సీ ద్వారా నీటిని తీసుకుంటే జూన్ ఆఖరకు వరకు తాగునీటి కష్టాలు లేకుండా నీటిని సరఫరా చేసి ఈ వేసవిని గట్టెకించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.