వేదవతిని పూర్తి చేస్తా
ABN , Publish Date - Jul 26 , 2026 | 12:02 AM
‘ఆలూరు నియోజకవర్గం అభివృద్ధికి దూరంగా ఉంది. ఇక్కడ మనం ఎమ్మెల్యేగా గెలవకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. అయినా.. ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేపట్టిన వేదవతి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తాను..’ అని సీఎం చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న సంజీవని ప్రాజెక్టు ఆరో విడత కార్యక్రమాన్ని శనివారం సీఎం చంద్రబాబు ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రారంభించారు.
బాధ్యత నాదే
రూ.1,768 కోట్లతో పనులు చేపడుతున్నాం
నగరడోణ జలాశయానికి రూ.38 కోట్లు
బళ్లారి-కర్నూలు వయా ఆలూరును హైవేగా చేస్తాం
తాగునీరు అందించేందుకు చర్యలు
ఆస్పరి ప్రజా వేదిక సభలో సీఎం చంద్రబాబు హామీ
సంజీవని కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి
వివిధ శాఖల పనితీరుపై చంద్రబాబు సమీక్ష.. అధికారులకు చెమటలు
బాబు ఆలూరు పర్యటన సూపర్ సక్సెస్
కర్నూలు/ఆస్పరి/ఆలూరు, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ‘ఆలూరు నియోజకవర్గం అభివృద్ధికి దూరంగా ఉంది. ఇక్కడ మనం ఎమ్మెల్యేగా గెలవకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. అయినా.. ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేపట్టిన వేదవతి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తాను..’ అని సీఎం చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న సంజీవని ప్రాజెక్టు ఆరో విడత కార్యక్రమాన్ని శనివారం సీఎం చంద్రబాబు ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రారంభించారు. ప్రజా ఆరోగ్యానికి సాంకేతికతను జోడించి రాష్ట్రంలో ఎక్కడైనా వైద్యం పొందేలా తీసుకొస్తున్న సంజీవని కార్యక్రమాన్ని ఆగస్టు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. కుప్పంలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఆ తరువాత దశల వారీగా విస్తరిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఆస్పరిలో సీఎం చంద్రబాబు ఆరో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కర్నూలు రోడ్డులో కలెక్టర్ ఏ. సిరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, రాయలసీమ జిల్లాల్లో పారిశ్రామిక పురోగతి, కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం ప్రగతిని వివరించారు. ఆలూరు నియోజకవర్గం అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని స్పష్టంగా ప్రకటించారు.
వేదవతి, నగరడోణ పూర్తి చేస్తాం
ఆలూరు ప్రాంతంలో 80 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని వేదవతి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు తాను నిధులు మంజూరు చేశానని, తానే వేదవతి పనులు ప్రారంభించానని, తానే పూర్తి చేస్తానని సీఎం చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. 36 ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితాలో వేదవతి ఉందని, రూ.1,768 కోట్లతో పనులు పూర్తి చేసేందుకు 2028లో ప్రారంభిస్తామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని, గంపెడు మట్టి కూడా తీయలేదని ఆయన వివరించారు. ఎన్నో ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న నగరడోణ జలాశయం పనులు రూ.38 కోట్లతో పూర్తి చేస్తామన్నారు. ఆ సందర్భంగా సభలో ఉన్న రైతులు జేజేలు కొడుతూ.. ఈలలు వేశారు. దీనికి సీఎం స్పందిస్తూ ఇంతటి ఉత్సాహం ఎన్నడూ చూడలేదని అన్నారు. ఇక్కడ మన ఎమ్మెల్యేలు గెలవకపోవడంతో అభివృద్ధిలో వెనుకపడ్డామని చంద్రబాబు వివరించారు. జొహరాపురం గ్రామంలో తాగునీటి సమస్య తీర్చేందుకు రూ.7 కోట్లు మంజూరు చేశానన్నారు. త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. ఇక్కడ ఆస్పత్రిని సంజీవని కార్యక్రమంలో ప్రారంభించామని, కర్నూలు-బళ్లారి రోడ్డు కూడా వస్తుందని, నీళ్లు కూడా ఇచ్చే బాధ్యత తనదేనని అన్నారు. దీనికి ఒక్కసారిగా సభలోంచి జేజేలు, కేకలు, ఈలలు వినిపించాయి. రాయలసీమను రూ.లక్ష కోట్లతో హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని, ఆలూరు కూడా అందులో ఉంటుందని తెలిపారు.
బలహీనులదే రాజ్యం కావాలి
‘రాయలసీమలో ఫ్యాక్షన్‌ను ఊపుమాపింది ఎవరు తమ్ముళ్లూ..!’ అని చంద్రబాబు అనగానే మీరే సార్..! అంటూ ముక్తకంఠంతో బిగ్గరగా అరిచారు. ‘ముఠా గొడవలకు స్వప్తి చెప్పాం. బలవంతుడిది రాజ్యం కారాదు.. బలహీనులదే రాజ్యం కావాలి. అది జరగాలంటే ప్రజలు గట్టగా నిలబడాలి’ అని చంద్రబాబు వివరించారు. ప్రతి ఒక్కరు సమిష్టిగా విజయం సాధించాలని, ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, ప్రజా ఆర్యోగం కోసం ప్రభుత్వం ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు.
పని తీరు సమీక్ష.. అధికారులకు చెమటలు
ఆలూరు నియోజకవర్గంలో 42 శాఖల పని తీరుపై సీఎం చంద్రబాబు ఆయా శాఖ అధికారులతో సమీక్షించారు. ప్రజలకు అందుతున్న సేవలు, అభివృద్ధి ఫలాలపై ఏమేరకు సంతృప్తి ఉన్నారో అంకెలతో సహా వివరించారు. పలు శాఖల పనితీరు ఎలా ఉందని సభలోని ప్రజలను సీఎం చంద్రబాబు అడగగా.. ఏమాత్రం బాగాలేదంటూ ముక్తకంఠంతో చెప్పడంతో ఇదీ మీ పనితీరు అంటూ చంద్రబాబు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. అందరినీ సమన్వయం చేసుకొని పనులు చేయించాల్సిన బాధ్యత మీదే అంటూ కలెక్టర్ డాక్టర్ ఎ. సిరికి చురకలు అంటించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసే పింఛన్ల పంపిణీ సక్రమంగా లేదని చెప్పడంతో బాబు మండిపడ్డారు. అన్న క్యాంటీన్లు, పంచాయతీరాజ్, తాగునీటి సరఫరా, సీఎం రిలీఫ్ ఫండ్ పనితీరు ఏమాత్రం బాగాలేదని, ప్రజల సంతృప్తి రాష్ట్రంలో కంటే బాగా తక్కువగా ఉందని అంకెలతో సహా చూపారు. వచ్చే సమావేశం నాటికి మెరుగు పడుతామని అధికారులు చెప్పారు. సర్వే, ఆర్ ఓ ఆర్ సక్రమంగా లేదని, ప్రజల సంతృప్తి మైనస్ ఉందని, డీఆర్‌ఓ వెంకటరమణమ్మను గట్టిగా హెచ్చరించారు. అదే క్రమంలో ప్రజా పంపిణీ, దీపం పథకాలు అమలు కూడా బాగా లేదని, ఉద్యోగం అంటే భయం లేదా..? అంటూడీఎస్‌ఓ రఘువీరాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్ శాఖ పనితీరు బాగా లేదని, అగ్ని మాపక శాఖ పనితీరు మరీ అధ్వానంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను ఉద్దేశించి, ఇవన్నీ నీవు చూసుకోమ్మా.. అని ఆదేశించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ పనితీరు గతంలో కంటే మెరుగుపడిందని, మరింత మెరుగు పడాలని ప్రాజెక్టు డైరెక్టర్‌ను అభినందించారు. గంజాయి, మహిళా నేరాలపై కూడా నెగిటివ్ ఉందని, ఆడవాళ్ల జోలికి ఎవరైనా వస్తే కఠినంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, టీజీ భరత్, సత్యకుమార్ యాదవ్, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్, కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి, జేసీ నూరుల్ ఖమర్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. సీఎం పర్యటన సంద ర్భంగా అవాం చనీ య సంఘట నలు జరగకుండా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పర్యవే క్షణలో గట్టి బందో బస్తు ఏర్పాటు చేశారు.
సాంకేతిక విప్లవానికి నాంది
ప్రజల ఆరోగ్య అమృతం.. ‘సంజీవని’
గ్రామీణులు సద్వినియోగించుకోవాలి
వైద్యుల పనితీరు భేష్
సీఎం చంద్రబాబు
ఆస్పరి పీహెచ్‌సీలో సంజీవని కార్యక్రమం ప్రారంభం
కర్నూలు/ఆస్పరి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): వైద్య రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ.. సంజీవని ప్రాజెక్టు ఆరవ విడత పైలెట్ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు శనివారం ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రారంభించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆ శాఖ కమిషనర్, నియోజకవర్గం ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి, కలెక్టర్ ఏ.సిరిలతో కలసి చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరెటీవ్ విధానం అమలు, సంజీవని ప్రాజెక్టు అమలు తీరుపై స్థానిక వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సంజీవని కార్యక్రమం ఎలా అమలు అవుతుందో చంద్రబాబుకు వివ రించారు. వ్యక్తి ఆరోగ్య వివరాలు డిజిటలైజేషన్ చేసి, వ్యక్తిగత ఆరోగ్య రికార్డులను అనుసంధానం చేయడం, ఆరోగ్య సంరక్షణ అందించే విధానాన్ని చంద్రబాబు పరిశీలించారు. డిజిటల్ సాంకేతిక సమాచారం, ఫాలోఅప్ చేయడం, వ్యాదుల గుర్తింపు, రోగులకు కౌన్సెలింగ్, కుటుంబ సభ్యునలు ఎలా భాగస్వామ్యం చేయడం వంటి వివరాలు ఆరా తీశారు. ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని పథకం అమలుకు ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి.. ఏఏ సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ కార్యక్రమం తరువాత ఎలాంటి మార్పులు వచ్చాయి, రోగులు స్పందన ఎలా ఉంది వంటి విషయాలను పీహెచ్‌సీ వైద్యఅధికారి డాక్టర్ రఘురామిరెడ్డి, డాక్టర్లు బాలకృష్ణ, దుర్గాబాయి, రత్నమ్మను అడిగి చంద్రబాబు తెలుసు కున్నారు. ఈ కార్యక్రమం వచ్చిన తరువాత స్పెషలిస్టుల సహాయంతో వి-పీవోడీ వ్యవస్థ ద్వారా హైరిస్క్ ప్రసవసం ఈ పీహెచ్‌సీలో చేశామని వైద్యులు చంద్రబాబు వివరించారు. దీంతో వైద్యులను ఆయన అభినందించారు. ఆస్పత్రి మొత్తం తిరిగి సౌకర్యాలు పరిశీలించారు. వైద్యం కోసం వచ్చిన రోగులతో మాట్లాడారు. పిల్లలతో ఆప్యాయంగా ఎత్తుకొని మహిళల ఆరోగ్య సమస్యలు, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గర్భదారణ సమయంలో తమకు అందిన వైద్య సేవలు, హెల్త్‌ఫాలో అప్ గురించి వారిని సీఎం ంద్రబాబు అడగగా, చాలా బాగున్నాయని, గతంలో పోలిస్తే ఎంతో మెరుగు పడిందని మహిళలు చంద్రబాబు వివరిం చారు. చంద్రబాబు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య అమృతం.. సంజీవని కార్యక్రమనని, ఈ ప్రాజెక్టు ద్వారా ప్రజల ఆరోగ్యం సంరక్షిస్తామని తెలిపారు. అనంతరం వైద్యులు, ఉమ్మడి కుటుంబ సభ్యులతో చంద్రబాబు ఫొటోలు దిగారు.
సీఎం పర్యటన సాగిందిలా..
మధ్యాహ్నం 1.27 గంటలకు: ఆస్పరి హెలిపాడ్‌కు సీఎం చంద్రబాబు చేరుకున్నారు. ఇక్కడే జిల్లా నాయకులను ఆయన కలిశారు
1.57 గంటలకు: ‘సంజీవని’ కార్యక్రమం ప్రజావేదిక వద్దకు సీఎం చేరుకున్నారు. బాబును చేసిన కార్యకర్తలు, యువత కేరింతలు కొడుతూ చంద్రబాబుకు విక్టరీ సింబల్ చూపించారు
2.25: డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు.
3.37: సీఎం చంద్రబాబు ప్రసంగం మొదలు పెట్టి దాదాపు గంట మాట్లాడారు.
సాయంత్రం 4.45: టీడీపీ కార్యకర్తల భేటీలో పాల్గొన్నారు
6.15కు: ఆస్పరి పీహెచ్‌సీలో సంజీవని కార్యక్రమం ప్రాభించారు.
6.45కు: ఆస్పరి హెలిపాడ్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు.
చంద్రన్నకు ఘన స్వాగతం
ఆస్పరి హెలిపాడ్‌కు చేరుకున్న సీఎం చంద్రబాబుకు జిల్లా నాయకులు ఘనస్వాగతం పలికారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, టీజీ భరత్, సత్యకుమార్ యాదవ్, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేశ్, డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్‌కుమార్, కలెక్టర్ ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, ఆలూరు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి, ఎమ్మెల్యేలు కేఈ శ్యాంబాబు, బీవీ జయనాగేశ్వరరెడ్డి, డాక్టర్ పార్థసారథి, బొగ్గుల దస్తగిరి, కేడీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, జోన్-5 ఇన్‌చార్జి పి.శ్రీనివాసరెడ్డి, ఆదోని ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, ఏపీ వాల్మీకి కార్పొరేషన్ చైర్ పర్సన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మ, ఆలూరు బీజేపీ ఇన్‌చార్జి విట్టా రమేష్, ఆలూరు జనసేన ఇన్‌చార్జి వెంకప్ప స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. సాయంత్ర 6.45 గంటలకు సీఎం చంద్రబాబుకు జిల్లా అధికారులు, టీడీపీ మాజీ ఇన్‌చార్జి వైకుంఠం ప్రసాద్ సహా నాయకులు ఆత్మీయ వీడ్కోలు పలికారు.