Share News

భర్తే హంతకుడు

ABN , Publish Date - May 07 , 2026 | 11:58 PM

భార్యపై అనుమానంతో భర్తనే ఆమె హత్య చేశాడు. ఈ ఘటన మండలంలోని నందివర్గం పోలీసుస్టేషన్‌లో పరిధిలోని బీరవోలు గ్రామంలో చోటుచేసుకోగా గురువారం ముగ్గురు నిందితులు లొంగిపోయినట్లు బనగానపల్లె రూరల్‌ సీఐ మంజునాథరెడ్డి, ఎస్‌ఐ భూపాలుడు తెలిపారు

భర్తే హంతకుడు
నిందితుల అరెస్టు చూపుతున్న సీఐ మంజునాథరెడ్డి, ఇన్‌సెట్‌ లక్ష్మి(ఫైల్‌)

భార్యను హత్యచేసి బావిలో పడేసిన వైనం

లొంగిపోయిన ముగ్గురు నిందితులు

బనగానపల్లె, మే 7 (ఆంధ్రజ్యోతి): భార్యపై అనుమానంతో భర్తనే ఆమె హత్య చేశాడు. ఈ ఘటన మండలంలోని నందివర్గం పోలీసుస్టేషన్‌లో పరిధిలోని బీరవోలు గ్రామంలో చోటుచేసుకోగా గురువారం ముగ్గురు నిందితులు లొంగిపోయినట్లు బనగానపల్లె రూరల్‌ సీఐ మంజునాథరెడ్డి, ఎస్‌ఐ భూపాలుడు తెలిపారు. వివరాలు.. బీరవోలుకు చెందిన వెంకటస్వామి భార్య లక్ష్మి(35)పై అనుమానంతో ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకొని పక్కప్రణాళికతో హత్య చేశారు. గత నెల 29న పలుకూరు గని పనులకు వెళ్లాలని వెంకటస్వామి భార్య లక్ష్మిని మోటార్‌సైకిల్‌లో ఎక్కించుకొని చెర్వుపల్లె గ్రామ పొలిమేరలో మద్దిలేటి పొలం వద్దకు తీసుకు వెళ్లి ఆమెను కొట్టి అనంతరం గొంతుపై కాలువేసి దారుణంగా హత్య చేశారు. లక్ష్మి శవాన్ని పక్కనే ఉన్న బావిలో రాళ్లు కట్టి పడేశారు. హత్య చేసిన రెండు రోజుల తర్వాత అతడు బావి వద్దకు వచ్చి చూడగా శవం బయటకు తేలడంతో ఎక్కడ బయటకు వస్తుందో అని శవాన్ని బావిలో నుంచి బయటకు తీశారు. ఇందుకు సోదరులు వెంకటరమణ, శ్రీనివాసులు సాయం తీసుకున్నారు. బావిలో ఉన్న లక్ష్మి మృతదేహాన్ని బయటకు తీసి పక్కనే గాలేరి నగరి వద్ద గొయ్యి తవ్వి గుట్టు చప్పుడుకాకుండా పూడ్చివేశారు. ఈనెల 2న నందివర్గం పోలీ్‌సస్టేషన్‌లో వెంకటస్వామి తన భార్య లక్ష్మి కనబడడం లేదని మిస్సింగ్‌ కేసు నమోదు చేయించారు. లక్ష్మి బంధువులు అనుమానం వచ్చి బనగానపల్లె రూరల్‌ సీఐ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పోలీసులు పక్కాగా విచారణ చేసి లక్ష్మి హత్యకు భర్త కారణమని తేల్చారు. హత్య విషయం బయటపడిందని భయపడి పోయిన భర్త వెంకటస్వామి, ఆయన సోదరులు వెంకటరమణ, శ్రీనివాసులు బనగానపల్లె రూరల్‌ పోలీ్‌సస్టేషన్‌లో లొంగిపోగా వారి నుంచి వివరాలు సేకరించి గాలేరునగరి వద్దకు తీసుకుపోయి తహసీల్దారు ఎదుట పంచనామా నిర్వహించి డాక్టర్ల సహకారంతో గాలేరి నగరి కాల్వ గొయ్యి వద్దే పోస్టుమార్టం నిర్వహించినట్లు సీఐ తెలిపారు. వెంకటస్వామి, వెంకట రమణ, శ్రీనివాసులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - May 07 , 2026 | 11:58 PM