Share News

కుటుంబ కలహాలతో.. భార్యను కడతేర్చిన భర్త

ABN , Publish Date - Apr 08 , 2026 | 12:06 AM

కుటుంబ కలహాలతో భార్యను ఓ భర్త కడతేర్చాడు. అతి కిరాతకంగా గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు నందివర్గం ఎస్‌ఐ భూపాలుడు తెలిపారు.

కుటుంబ కలహాలతో..   భార్యను కడతేర్చిన భర్త
వెంకటలక్ష్మమ్మ(ఫైల్‌)

గొడ్డలితో నరికి దారుణ హత్య

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

బనగానపల్లె, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): కుటుంబ కలహాలతో భార్యను ఓ భర్త కడతేర్చాడు. అతి కిరాతకంగా గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు నందివర్గం ఎస్‌ఐ భూపాలుడు తెలిపారు. వివరాలు.. మండలంలోని నందివర్గం పోలీసుస్టేషన్‌ పరిధిలోని నందవరం గ్రామానికి చెందిన వెంగన్న అదే గ్రామానికి చెందిన వెంకటలక్ష్మమ్మ(65) అనే మహిళను 45ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వెంగన్న గొర్రెల వ్యాపారం చేసేవాడు. వీరికి ఇద్దరు మగ పిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు. వీరందరికీ పెళ్లిళ్లు కూడా చేశారు. భార్యాభర్తలు ఇరువురు నందవరంలో, యాళ్లూరులో, బేతంచర్లలో కొన్నేళ్లు పాటు నివాసం ఉన్నారు. వెంగన్న నిత్యం భార్యను వేధించేవాడు. ఆమెతో అనేకసార్లు గొడవపడ్డాడు. నందవరంలో ఓ అద్దె ఇంటిలో ప్రస్తుతం నివసిస్తున్నారు. శనివారం రాత్రి భార్య వెంకటలక్ష్మమ్మ నిద్రిస్తుండగా భర్త వెంగన్న గొడ్డలితో అతి కిరాతకంగా నరికి హత్య చేశాడు. ఇంటికి తాళం వేసుకొని పరారయ్యాడు. నాలుగు రోజులైనా అతడు ఇంటికి రాకపోవడంతో ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు తాళం తెరిచిచూశారు. వెంకటలక్ష్మమ్మ దారుణ హత్యకు గురై రక్తపుమడుగులో ఉండి శరీరం దుర్వాసన వెదల్లుతూ కుళ్లిపోయినట్ల్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో మంగళవారం ఆమె మృతదేహాన్ని బనగానపల్లెకు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఫోరెన్సిక్‌ నిపుణలను రప్పించి పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబ కలహాలతోనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. మృతురాలి కుమారుడు ఆంజనేయులు ఫిర్యాదు మేరకు వెంగన్నపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Apr 08 , 2026 | 12:06 AM