Share News

ఓటెత్తారు..

ABN , Publish Date - Nov 06 , 2026 | 12:08 AM

ఆళ్లగడ్డ, డోన్‌ నియోజకవర్గాల పరిధిలో గురువారం నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో భారీగా పోలింగ్‌ నమోదైంది. ఆళ్లగడ్డ పరిధిలో 78.45 శాతం, శిరివెళ్లలో 73.08, దొర్నిపాడులో72, డోన్‌లో 71, రుద్రవరం 70, చాగలమర్రిలో 68 శాతం నమోదైంది. కాగా ఉయ్యాలవాడలో ఎంపీటీసీకి అత్యల్పంగా 65 శాతం నమోదు అయింది.

ఓటెత్తారు..
శిరివెళ్లలో ఓటు వేసేందుకు వేచి ఉన్న మహిళలు

డోన్‌, ఆళ్లగడ్డ నియోజకవర్గాల పరిధిలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో భారీగా పోలింగ్‌

ఆళ్లగడ్డలో అత్యధికంగా 78.45శాతం, ఉయ్యాలవాడలో అత్యల్పంగా 65 శాతం నమోదు

ఆళ్లగడ్డలో 78.45 శాతం

ఆళ్లగడ్డ, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): మండలంలో గురువారం ఎంపీటీసీ, జడ్పీటీ ఎన్నికల్లో 78.5 శాతం పోలింగ్‌ నమోదు అయినట్లు ఆర్‌వో హరిగోపాల్‌ తెలిపారు. స్వల్ప సంఘటనలు మినహా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదన్నారు. కాగా కోటకందుకూరులో ఓటరు స్లిప్పులు ఇవ్వలేదని ఎస్డీపీఐ నాయకులు పోలింగ్‌ కేంద్రం వద్ద బైఠాయించారు. అధికారుల జోక్యంతో స్లిప్పులు ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. నంద్యాల సబ్‌ కలెక్టర్‌ మనిషా, ఆర్‌వో హరిఓపాల్‌, ఏఆర్‌వో నూర్జహాన్‌, తహసీల్దార్‌ జ్యోతి రత్నకూమారి ఓబులంపల్లె పోలింగ్‌ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆళ్లగడ్డలో 28,825 మంది ఓటర్లు ఉండగా 22,614 మంది ఓటు వేశారు. 10,974 మంది మహిళలు, 11,640 మంది మహిళలు ఉన్నారు. మండలంలోని ప్రతి పొలింగ్‌ కేంద్రంలో 70 శాతానికి మించి పోలింగ్‌ నమోదు అయింది.

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన సబ్‌ కలెక్టర్‌

నంద్యాల సబ్‌ కలెక్టర్‌ మనిషా ఓబులంపల్లె పోలింగ్‌ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఏర్పాట్లపై ఓటర్లను అడిగి తెలుసుకున్నారు. ఆర్‌వో హరి గోపాల్‌, ఏఆర్‌వో నూర్జహాన్‌, తహసీల్దార్‌ జ్యోతి రత్నకుమారి ఉన్నారు.

చాగలమర్రిలో 68.75 శాతం

చాగలమర్రి: మండలంలో 48 పోలింగ్‌ కేంద్రాలు, 19 గ్రామ పంచాయతీల్లో ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగింది. ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్‌, ఆళ్లగడ్డ ఎస్‌ఐ పర్యవేక్షణలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు ఆర్‌వో సునిల్‌ఖన్న తెలిపారు. 41,383 ఓటర్లు ఉండగా, 28,451మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని, 68.75శాతం పోలింగ్‌ నమోదు అయిందన్నారు. తహసీల్దార్‌ పవన్‌కుమార్‌రెడ్డి, ఎంపీడీవో తాహిర్‌హుసేన్‌ ఉన్నారు.

శిరివెళ్లలో 73.08 శాతం

శిరివెళ్ల: మండలంలో 73.08 పోలింగ్‌ శాతం నమోదైనట్లు ఆర్వో చిలకల విజయ శేఖర్‌, ఏఆర్వో శివ మల్లేశ్వరప్ప గురువారం తెలిపారు. 47,958 మంది ఓటర్లు ఉండగా 35,047 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు. 18,527 మంది పురుషులు 16,520 మంది మహిళలు ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారన్నారు. బ్యాలెట్‌ బాక్సులను నంద్యాలలోని స్ట్రాంగ్‌ రూంకు తరలించారు. సీఐ ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి, ఎస్‌ఐ మధుసూదన బందోబస్తు నిర్వహించారు.

డోన్‌లో 71 శాతం

డోన్‌ టౌన్‌: మండలంలో 71 శాతం పోలింగ్‌ నమోదు అయినట్లు ఆర్‌వో ఎన్‌.రామాంజనేయులు తెలిపారు. 63 పోలింగ్‌ కేంద్రాల్లో 51,445 మంది ఓటర్లకు గానూ 36,594 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. 18 ఎంపీటీసీ స్థానాలకు గానూ 11 ఎంపీటీసీలు ఏకగ్రీవం కాగా, 7 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానానికి గురువారం ఎన్నికలు నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సీఐలు ఇంతియాజ్‌ బాషా, సీఎం రాకేష్‌, ఎస్‌ఐలు శరత్‌ కుమార్‌ రెడ్డి, మమత పోలీసులతో బందోబస్తు నిర్వహించారు.

డోన్‌ రూరల్‌: కామగానికుంట్ల, కమలాపురం, చనుగొండ్ల, ఉంగరానిగుండ్ల, ఎద్దుపెంట, దొరపల్లె, ఓబులాపురం గ్రామాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

రుద్రవరంలో 70.89శాతం

రుద్రవరం: మండలంలో 70.89శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఆర్‌వో మనోరంజన్‌ ప్రతాప్‌ తెలిపారు. 14 ఎంపీటీీసీ స్థానాలకు, జడ్పీటీసీ స్థానానికి 39974 మందికి గాను 26923 మంది ఓటు వేశారు. బ్యాలెట్‌ బాక్సులను ఆళ్లగడ్డ స్ట్రాంగ్‌రూంకు తరలించామన్నారు.

కాగా పెద్దకంబలూరు గ్రామంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి జోక్యంతో సద్దుమణిగింది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని సీఐ అన్నారు. ఎస్‌ఐ మహ్మద్‌రఫి, సిబ్బంది పాల్గొన్నారు.

ఎంపీటీసీకు 65.96శాతం, జడ్పీటీసీకి 67.39..

ఉయ్యాలవాడ: మండలంలో ఎంపీటీసీ స్థానానికి 65.96 శాతం, జడ్పీటీసీకి 67.39శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఆర్‌వో నాగముణేశ్వరి తెలిపారు. ఎంపీటీసీకి 16,649 మంది, జడ్పీటీసీ అభ్యర్థులకు 23,112 మంది ఓట్లు వేశారన్నారు. ఎస్‌ఐ రామిరెడ్డి బందోబస్తు ఏర్పాటు చేశారు.

దొర్నిపాడులో 72.01 శాతం

దొర్నిపాడు: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 72.01శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఆర్‌వో నాగరాజు, ఎంపీడీవో సావిత్రి తెలిపారు. 7 ఎంపీటీసీ, 1 జెడ్పీటీసీ స్థానాలకు 25 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 20,459 మంది ఓటర్లకు గాను 14,733మంది ఓటు వేశారన్నారు. ఎస్‌ఐ వరప్రసాద్‌ బందోబస్తు నిర్వహించారు.

ప్యాపిలిలో 68.7 శాతం

ప్యాపిలి: మండలంలో 68.7శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఆర్‌వో శ్రీనివాస రావు తెలిపారు. 21 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 19 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మాధవరం, జక్కసానికుంట్ల ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. సీఐ వెంకటరామిరెడ్డి, ఎస్‌ఐలు నాగార్జున, రమే్‌షబాబు, అనిల్‌కుమార్‌ బందోబస్తు నిర్వాహించారు.

Updated Date - Nov 06 , 2026 | 12:08 AM