Share News

ఎంత పనిచేశావు అమ్మా..

ABN , Publish Date - Mar 14 , 2026 | 11:41 PM

నవ మాసాలు మోసిన కన్నతల్లే తమను మృత్యువులోకి నడిపిస్తోందని ఆ చిన్నారులకు తెలియలేదు. తల్లితో పాటే అడుగులు వేశారు.

ఎంత పనిచేశావు అమ్మా..
మృతదేహాలను పరిశీలిస్తున్న పోలీసులు

ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకిన తల్లి

గార్గేయపురంలో విషాదం

నవ మాసాలు మోసిన కన్నతల్లే తమను మృత్యువులోకి నడిపిస్తోందని ఆ చిన్నారులకు తెలియలేదు. తల్లితో పాటే అడుగులు వేశారు. చివరకు చెరువులోకి తోసేస్తుంటే నిశ్చేష్టులవడం, అంతలోనే తుది శ్వాస విడవడం తప్ప ఏమీ అర్థం కాలేదు ఆ చిన్నారులకు.. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యల కారణంగా ఓ తల్లి తన పిల్లలతో కలిసి చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడింది. మహిళతో పాటు బయటి ప్రపంచం తెలియని పిల్లల మృతదేహాలను చూడగానే అక్కడున్న వారికి కన్నీరు ఆగలేదు దీంతో గార్గేయపురంలో విషాదఛాయలు అలముకున్నాయి.

కర్నూలు క్రైం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యల కారణంగా ఇద్దరు పిల్లలతో కలిసి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కర్నూలు మండలం గార్గేయపురంలో జరిగింది. పుట్టినిల్లు కర్నూలు మండలం గార్గేయపురం వచ్చిన రాజేశ్వరి (35) తన కుమారులు సుకుమార్‌ (6), అబ్రహాం(3)తో కలిసి గ్రామ సమీపంలోని చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.. గార్గేయపురం గ్రామానికి చెందిన నాగమణి భర్త గతంలోనే మృతి చెందాడు. ఆమెకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. కూతురు రాజేశ్వరికి తెలంగాణ రాష్ట్రం అలంపూర్‌కు చెందిన రాజుతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిపించింది. రాజేశ్వరి, రాజు దంపతులకు కుమారులు సుకుమార్‌, అబ్రహాం సంతానం. రాజు ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రాజేశ్వరి కంటి సంబంధిత వ్యాధితో తీవ్రంగా బాధపడుతూ మూడు రోజుల క్రితం అలంపూర్‌ నుంచి గార్గేయపురం వచ్చింది. తన తల్లి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో స్వీపర్‌గా పని చేస్తోందని, అక్కడికి వెళ్లి చికిత్స తీసుకుంటానని భర్త రాజుకు చెప్పి వచ్చింది. శుక్రవారం ఉదయం ఆసుపత్రికి వెళ్దామని రాజేశ్వరి తల్లి నాగమణిని అడిగింది. అయితే శనివారం ఉదయం తీసుకెళ్తానని తల్లి చెప్పడంతో ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. తన భర్త దగ్గరే చూపించుకుంటానని చెప్పి శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో ఇద్దరు పిల్లలను తీసుకొని ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. నాగమణి తన అల్లుడు రాజుకు ఫోన్‌చేసి, తన కూతురు ఇంటికి వచ్చిన వెంటనే సమాచారం ఇవ్వాలని చెప్పింది. రాత్రి కూడా మరోసారి రాజుకు ఫోన్‌ చేసి ఆరా తీయగా.. ఇంతవరకు ఇంటికి రాలేదని రాజు చెప్పాడు. దీంతో నాగమణి శనివారం ఉదయాన్నే గార్గేయపురం చెరువు దగ్గరకు వెళ్లి వెతికింది. అక్కడ తన కూతురుకు సంబంధించిన చెప్పులు, ఆధార్‌ కార్డు కనిపించాయి. దీంతో ఆమె స్థానికుల సాయంతో జాలర్లను పిలిపించి చెరువులో వెతికించింది. చెరువులో రాజేశ్వరి, ఇద్దరు పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. మూడు రోజులుగా తన ఇంట్లో ఆటలాడుకున్న చిన్నారులు విగత జీవుల్లా కనిపించే సరికి నాగమణి రోదించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. డీఎస్పీ బాబూ ప్రసాద్‌, సీఐ తేజోమూర్తి ఘటన స్థలాన్ని పరిశీలించి ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. కుటుంబ సమస్యలు, అనారోగ్యం కారణంగా తన కూతురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లి నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మృతదేహాలను మార్చురీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.

Updated Date - Mar 14 , 2026 | 11:41 PM