Share News

ఇంకెంతమంది చావాలి?

ABN , Publish Date - Jul 19 , 2026 | 11:59 PM

రోడ్డు ప్రమాద నిబంధనలు లేకపోవడం చాలామంది ప్రమాదాలకు గురయ్యామని, ఇంకా ఎంతమంది చావాలి?

ఇంకెంతమంది చావాలి?
చిలకలడోణ వద్ద హైవేపై బైఠాయించిన గ్రామస్థులు

చిలకలడోణ గ్రామస్థుల ఆగ్రహం

రోడ్డు ప్రమాదాలను నివారించాలని హైవే దిగ్బంఽధం

పోలీసులతో వాగ్వాదానికి దిగిన ప్రజలు

గంటన్నర సేపు నిలిచిపోయిన వాహనాలు

మంత్రాలయం, జూలై 19(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాద నిబంధనలు లేకపోవడం చాలామంది ప్రమాదాలకు గురయ్యామని, ఇంకా ఎంతమంది చావాలి? అని మండలంలోని చిలకలడోణ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిలకలడోణ వద్ద హైవే 167పై తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు నివారించాలని డిమాండ్‌ చేస్తూ గ్రామస్థులు హైవేను దిగ్బంధించారు. శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన వెంకటేష్‌ అనే వ్యక్తి మృతి చెందడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు వందల సంఖ్యలో ఆదివారం ఉదయం హైవేపై బైఠాయించారు. రోడ్డుకు అడ్డంగా ఎద్దుల బండ్లను ఉంచి దాదాపు గంటన్నర సేపు వాహన రాకపోకలు నిలిపివేశారు. రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చే భక్తులు, దర్శించుకుని ఊళ్లకు వెళ్లే భక్తులు, వివిధ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామస్థులు మాట్లాడుతూ.. గ్రామంలో స్పీడ్‌ బ్రేకర్లు, బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు, లైట్లు వంటి చర్యలు లేకపోవడంతో వాహనదారులు హైస్పీడుతో రాకపోకలు సాగిస్తుండటం, రోడ్డును కూడా దాటలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోడ్డు ప్రమాదాల వల్ల చాలామంది గాయాలపాలు కావడమేకాక చాలా మంది మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రాలయం సీఐ దస్తగిరి బాబు, మాధవరం, మంత్రాలయం ఎస్‌ఐలు విజయ్‌కుమార్‌, మల్లికార్జున తమ సిబ్బందితో వెళ్లి రోడ్డుకు అడ్డంగా ఉన్న ఎద్దుల బండ్లను తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో గ్రామస్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఉన్నతాధికారులతో మాట్లాడి గ్రామంలో స్పీడు బ్రేకర్లు, బారికేడ్లు, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో గ్రామస్థులు శాంతించారు. గ్రామస్థులు మాట్లాడుతూ.. వెంకటేష్‌ను ఢీకొట్టిన కారును గుర్తించి మృతునికి న్యాయం చేయాలని కోరారు.

Updated Date - Jul 19 , 2026 | 11:59 PM