Share News

పొలాలకు కాకుండా పరిశ్రమలకు నీరెలా ఇస్తారు?

ABN , Publish Date - Apr 14 , 2026 | 11:49 PM

కేసీ కాలువ కింద రైతులు సాగు చేసిన పంటలు నీరు లేక ఎండిపోతున్నా పట్టించుకోని అధికారులు ఎత్తిపోతల నుంచి ఓర్వకల్లులోని పరిశ్రమలకు ఎలా ఇస్తారని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి రంగనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు

పొలాలకు కాకుండా పరిశ్రమలకు నీరెలా ఇస్తారు?

ఎత్తిపోతల నుంచి కేసీకి నీరు విడుదల చేయాలి

జేసీ వాహనం ఎదుట బైఠాయించిన

సీపీఐ నాయకులు, రైతులు

జేసీని చుట్టుముట్టిన రైతులు

పగిడ్యాల, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి) : కేసీ కాలువ కింద రైతులు సాగు చేసిన పంటలు నీరు లేక ఎండిపోతున్నా పట్టించుకోని అధికారులు ఎత్తిపోతల నుంచి ఓర్వకల్లులోని పరిశ్రమలకు ఎలా ఇస్తారని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి రంగనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముచ్చుమర్రి ఎత్తిపోతుల నుంచి ఓర్వకల్లులోని పరిశ్రమల కోసం నీరు పంపింగ్‌ చేసేందుకు నిర్మిస్తున్న పైప్‌లైన్‌ నిర్మాణం పనులను రాష్ట్ర పరిశ్రమలశాఖ చీఫ్‌ సెక్రటరీ యువరాజు, నంద్యాల జిల్లా జాయింట్‌ కలెక్టరు కార్తీక్‌ మంగశవారం ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించేందుకు వచ్చారు. అధికారులు ఎత్తిపోతల వద్దకు వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న సీపీఐ నాయకులు, వివిధ గ్రామాలకు చెందిన రైతులు అక్కడికి చేరుకున్నారు. జేసీ వాహనం ఎదుట బైఠాయించి మా నీరు మాకు ఇవ్వకుండా పరిశ్రమలకు తరలించుకుపోవడం అన్యాయమని నినాదాలు చేశారు. జేసీ ఎత్తిపోతల వద్దకు వెళ్తుండగా సీపీఐ నాయకులు, రైతులు చుట్టుముట్టి ఎత్తిపోతల నుంచి 10 రోజుల పాటు నీరు వదిలితే పంటలు చేతికి వస్తాయని, లేదంటే ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం సారవంతమైన పొలాలు ఇచ్చి తీవ్రంగా నష్టాపోయామని, తమ ప్రాంతాల్లోని నీటిని ఇతర ప్రాంతాలకు తీసుకొనిపోతే సహించేది లేదన్నారు. జేసీ కార్తీక్‌ మాట్లాడుతూ ప్రాజెక్టులో నీరు అడుగంటిపోవడంతో మోటార్లకు మట్టి చేరుకొని నీరు విడుదల చేసేందుకు సాధ్యం కాక కేసీ కెనాల్‌ అధికారులు నీరు నిలిపివేశారని అన్నారు. ఈ సమస్యను కలెక్టరు దృష్టికి తీసుకొనిపోయి న్యాయం చేస్తామని అన్నారు. కేసీ కాలువకు నీరు విడుదల చేయకపోతే హంద్రీనీవా కాలువకు కూడ నీరు నిలిపి వేయలని రైతులు పట్టుబట్టారు. దీంతో జేసీ కలెక్టరుతో ఫోన్‌లో మాట్లాడారు. ఎత్తిపోతలను సందర్శించి కేసీకి నీరు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో రైతులు వెనుదిరిగిపోయారు.

Updated Date - Apr 14 , 2026 | 11:50 PM