నోటీసులు ఇవ్వకుండానే పనులు ఎలా చేస్తారు?
ABN , Publish Date - Jun 01 , 2026 | 12:11 AM
నోటీసులు ఇవ్వకుండానే పనులు ఎలా చేస్తారు? అని రైతులు జాతీయ రహదారి పనులను ఆదివారం అడ్డుకున్నారు. వివరాలివీ..
జాతీయ రహదారి నిర్మాణాన్ని అడ్డుకున్న రైతులు
ఆలూరు, మే 31 (ఆంధ్రజ్యోతి): నోటీసులు ఇవ్వకుండానే పనులు ఎలా చేస్తారు? అని రైతులు జాతీయ రహదారి పనులను ఆదివారం అడ్డుకున్నారు. వివరాలివీ.. ఆలూరు నుంచి ఆదోనికి వెళ్లే జాతీయ రహదారి నిర్మాణం పనులు టోల్‌గేట్ నిర్మాణం పేరుతో మూడేళ్లుగా నిలిచిపోయాయి. ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో కిలోమీటర్ మేర పనులు నిలిపివేయడంతో వాహన రాకపోకలకు ఇబ్బందికరంగా మారి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ విషయంపై టీడీపీ ఆలూరు ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి మంత్రి నారా లోకేశ్ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. యుద్ధ ప్రాతిపదికన పనులను రెండు రోజుల క్రితం ప్రారంభించారు. అయితే జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న పొలాల రైతులు పనులను ఆదివారం అడ్డుకున్నారు. అధికారులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తమ పొలాలకు ఆనుకుని ఎలా వేస్తారంటూ నేషనల్ హైవే ఇంజనీర్లను నిలదీశారు. టోల్‌గేట్ ఊరి మధ్యలో ఎలా వేస్తారని, ఆదోని-కర్నూలు వెళ్లే వై.జంక్షన్‌లో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అలాగే పరిహారం కూడా పెంచాలని రైతులు ఉరుకుందు, ఈరన్న, మచ్చన్న, అంపయ్య, లక్ష్మీనారాయణ, ఈరన్న, బూర్ల వీరేష్, సోడాల వెంకటరాముడు కోరారు. దాదాపుగా 40 సెంట్ల భూమి కోల్పోతామని తమకు పరిహారం పెంచి రోడ్డు వేసుకోవాలని అధికారులకు వినతి పత్రం అందించారు.