అందరికీ ఇళ్లు
ABN , Publish Date - Sep 28 , 2026 | 12:16 AM
రాష్ట్రంలో అందరికీ సొంత ఇల్లు ఉండేలా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు.
అదే ప్రభుత్వ లక్ష్యం- మంత్రి ఫరూక్
లబ్ధిదారులకు టిడ్కో గృహాల అందజేత
306 మందికి పట్టాల పంపిణీ
మినీ టౌన్ షిప్ తరహాలో గేటెడ్ కమ్యూనిటీ వసతులు
నంద్యాల టౌన్, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అందరికీ సొంత ఇల్లు ఉండేలా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు. ఆదివారం స్థానిక ఎస్‌ఆర్‌బీసీ కాలనీలో ఏపీ ప్రభుత్వం, నంద్యాల మున్సిపాలిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఏపీ టిడ్కో పీఎంవై (అర్బన్) ఎన్‌టీఆర్ నగర్ గృహప్రవేశం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రిలో పాటు ఇన్‌చార్జి కలెక్టర్ సూరజ్ ధనుంజయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడడుతూ.. అర్హత కల్గిన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చి వారి ఆత్మగౌరవాన్ని కాపాడతామన్నారు. నిరుపేదలకు ఆర్థిక భారం పడకుండా రూ.6.55 లక్షల విలువైన 300 చదరపు అడుగుల ఇంటిని కేవలం ఒక్క రూపాయకు అందిస్తున్నామని తెలిపారు. అలాగే 365, 430 చ.అ ఇళ్లకు లబ్ధిదారులకు చెల్లించాల్సిన ముందస్తు 50 శాతం రాయితీ కల్పించి పేదలకు అండగా నిలిచామన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి అందరికీ ఇళ్లు అందజేస్తామన్నారు. ఇళ్ల నిర్మాణంతోపాటు రూ.56.91 కోట్లతో రోడ్లు డ్రైనేజీ, విద్యుత్తు వంటి సదుపాయాలు కల్పించి గేటేడ్ కమ్యూనిటీ తరహాలో వసతులు కల్పిస్తామన్నారు. అనంతరం ఎస్‌ఆర్‌ీబీసీ కాలనీలో 306 మందికి ఇళ్ల తాళాలు అందజేశారు. అనంతరం లబ్ధిదారులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో విశ్వనాథ్, కమిషనర్ బండి శేషన్న, నాయకులు ఎన్‌ఎండీ ఫయాజ్, హరిబాబు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం
ప్రజల సమస్యలను పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర న్యాయ, మైనార్టీ, సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక విశ్వనగర్ వద్ద రూ. 4 కోట్లతో చామకాల్వ మీదుగా నూనతంగా బ్రిడ్జి, సీసీ రోడ్డుకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి నిత్యం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎండీ ఫయాజ్, మార్కెట్ యార్డు ఛైర్మన్ హరిబాబు, మిద్దె హుసేన్, మంజుల సుబ్బరాయుడు, రామ మద్దయ్య పాల్గొన్నారు.