Share News

అర్హులందరికీ ఇంటి స్థలాలు

ABN , Publish Date - Oct 06 , 2026 | 11:26 PM

అర్హులందరికీ ఇంటి స్థలాలు అందజేస్తామని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ చెప్పారు. పట్టణంలోని టెక్కె మార్కెట్‌ యార్డులో నంద్యాల అర్బన్‌, రూరల్‌ తహసీల్దార్లు శ్రీనివాసులు, శ్రీవాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అర్హులందరికీ ఇంటి స్థలాలు
మహిళకు పట్టా పంపిణీ చేస్తున్న మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

233 మంది లబ్ధిదారులకు పట్టాల పంపిణీ

నంద్యాల రూరల్‌, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): అర్హులందరికీ ఇంటి స్థలాలు అందజేస్తామని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ చెప్పారు. పట్టణంలోని టెక్కె మార్కెట్‌ యార్డులో నంద్యాల అర్బన్‌, రూరల్‌ తహసీల్దార్లు శ్రీనివాసులు, శ్రీవాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ.. పట్టణ పరిధిలో రెండు సెంట్ల చొప్పున 173 మందికి, రూరల్‌ పరిధిలో మూడు సెంట్ల చొప్పున 60 మందికి ఇంటి స్థలాల పట్టాలు అందజేసినట్లు తెలిపారు. ఎవరూ స్థలాలను విక్రయించకుండా నిబంధన మేరు ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. ఎన్టీఆర్‌ ఆశయాలను ప్రభుత్వం నెరవేరుస్తోందని అన్నారు. మిగతా అర్హులను కూడా గుర్తించి రెండు, మూడు నెలల్లో పట్టాలు మంజూరు చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో సెంటు స్థలం మాత్రమే ఇచ్చారని, అందులోనూ నిర్మాణాలకు నిధులివ్వకుండా చేతులెత్తేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రికే దక్కుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో పల్లెలో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలాలు కేటాయించి మాట తప్పకుండా పంపిణీ చేసిన ఘనత సీఎం చంద్రబాబుదేనని అన్నారు. జేసీ సూరజ్‌ ధనుంజయ్‌ మాట్లాడుతూ.. ఎవరికైనా పట్టాలకు సంబంధించి హద్దులపై అనుమానాలుంటే అధికారులను సంప్రదించి హద్దులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నంద్యాల సబ్‌ కలెక్టర్‌ మనీషా, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ ప్రియాంక, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌, నంద్యాల మార్కెట్‌ యార్డు చైర్మన్‌ గుంటుపల్లి హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 06 , 2026 | 11:27 PM