రూ.9.25 కోట్లతో హాస్టళ్ల మరమ్మతులు
ABN , Publish Date - Jul 19 , 2026 | 11:56 PM
నంద్యాల జిల్లాలో హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించడానికి, మరమ్మతులు చేయడానికి రూ.9.25 కోట్లు ఖర్చు చేసినట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు.
మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
బనగానపల్లె, జూలై 19 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాలో హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించడానికి, మరమ్మతులు చేయడానికి రూ.9.25 కోట్లు ఖర్చు చేసినట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం బనగానపల్లె పట్టణంలోని ఎస్‌సీ బాలికల వసతి గృహంలో బాలికలకు ఉచిత స్కూల్ కిట్లను పంపిణీ చేశారు. బెడ్ షీట్, టవల్, నైట్ డ్రస్, స్పోర్ట్స్ షూస్, సాక్సులు పంపిణీ చేశారు. జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి ఎంవీ శివారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా మంత్రి బీసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బనగానపల్లె నియోజవకర్గంలోని హాస్టళ్లలో మౌలిక సదుపాయాలకు రూ.2కోట్లు ఖర్చు చేశామన్నారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లపట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోం దన్నారు. హాస్టల్ విద్యార్థుల కోసం ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. బాలికల హాస్టల్ నుంచి మురుగునీరు బయటకు వెళ్లేందుకు రూ.75 లక్షల రూపాయలు ఖర్చుచేసి శాశ్వతంగా సమస్యను పరిష్కరించామన్నారు. ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా సకల సదుపాయాలు కల్పిస్తోందని మంత్రి తెలిపారు. రుచికరమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ అధికారి నరసింహులు, హాస్టల్ వార్డెన్లు ముంతాజ్, రఫీ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.