Share News

ఉద్యాన విప్లవం

ABN , Publish Date - Oct 02 , 2026 | 11:25 PM

కరువు.. వలసలకు నిలయమైన కర్నూలు జిల్లా ఇక ఉద్యానవన పంటల సాగు కేంద్రం (హార్టికల్చర్‌ హబ్‌)గా మారనుంది.

 ఉద్యాన విప్లవం

జిల్లాలో ఉద్యాన సాగుకు మహా ప్రణాళిక

కొత్తగా 69 వేల హెక్టార్లలో పండ్ల తోటలు

లక్ష్యం.. 35.28 మెట్రిక్‌ టన్నుల దిగుబడి

21 క్లస్టర్లు.. 408 రైతు సేవా కేంద్రాలతో రైతులకు అండ

సాగు నుంచి ఎగుమతుల దాకా సమగ్ర వ్యవస్థ

కరువు.. వలసలకు నిలయమైన కర్నూలు జిల్లా ఇక ఉద్యానవన పంటల సాగు కేంద్రం (హార్టికల్చర్‌ హబ్‌)గా మారనుంది. రైతుకు అండగా నిలవాలనే మహా సంకల్పంతో సమగ్ర ఉద్యానవన అభివృద్ధి ప్రణాళిక (ఇంటిగ్రేటెడ్‌ హార్టికల్చర్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ - ఐహెచ్‌డీపీ)కు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉద్యాన పంట ఉత్పత్తులు 19.32 లక్షల మెట్రిక్‌ టన్నుల నుంచి 35.28 లక్షల టన్నులకు పెంచడం, ఈ రంగంలో స్థూల విలువ జోడింపు (జీవీఏ) రూ.12,764 కోట్లుకు పెంచడం లక్ష్యం. శుక్రవారం కేంద్ర అర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్‌తో కలసి సీఎం చంద్రబాబు ‘ప్రపంచ ఉద్యాన కేంద్రం - రాయలసీమ రైజింగ్‌’లో భాగంగా రూ.లక్ష కోట్ల ‘రాయలసీమ ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక’ను మదనపల్లెలో ప్రారంభించారు. జిల్లాలో ఉద్యాన పంటల సాగు, దిగుబడులు, ఐహెచ్‌డీపీ లక్ష్యాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

కర్నూలు, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా ప్రధాన జీవనాధారం వ్యవసాయం. ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 3,72,947 హెక్టార్లు, రబీ సాధారణ సాగు విస్తీర్ణం 1.75 లక్షల హెక్టార్లు పైమాటే. ప్రధాన వాణిజ్య పంటలు పత్తి 2.52 లక్షల హెక్టార్లు, ఉల్లి 35 వేల హెక్టార్లు, కంది 66 వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. 65-70 శాతం వరకు తెల్లబంగారం పత్తినే సాగు చేస్తున్నారు. విత్తనాలు మొదలు పంట దిగుబడులు చేతికొచ్చే వరకు ఎకరానికి రూ.50 వేలకు పైగా పెట్టుబడి ఖర్చు చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో దిగుబడులు చేతికి రాక, వచ్చిన అరకొర పంటలకు గిట్టుబాటు ధర లభించిక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఉల్లికి ధరలు లేక రోడ్లపై పారబోసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఫలితంగా అన్నదాతలకు ఆత్మహత్యలే శరణ్యం అవుతు న్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతును ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించే ఏకైక అస్త్రం ఉద్యాన పంటల సాగు అని సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాయలసీమ ఉద్యాన పంటల సమగ్ర అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసింది. కరువు, వలసలతో తల్లడిల్లే సీమ రైతులను ఆదుకోవడానికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ కూడా ముందుకు వచ్చింది. రూ.లక్ష కోట్లతో సీమలో ఉద్యాన పంటల అభివృద్ధికి పచ్చజెండా ఊపారు. కరువు నేలగా పేరుగాంచిన కర్నూలు జిల్లాలో ఐహెచ్‌డీపీలో భాగంగా రూ.10,850 కోట్లతో ఉద్యాన పంటల సాగు ప్రోత్సాహకం, సాగునీటి వనరుల అభివృద్ధి, రహదారుల సౌకర్యం మెరుగు పరిచేలా ప్రణాళిక తయారు చేశారు. జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఇన్నాళ్లు కరువు దరువేస్తే.. ఇక ఉద్యాన సాగుతో రైతు ముంగిటన సిరుల పంట పండుతుందని వ్యవసాయ నిపుణులు అంటున్నారు.

21 కస్టర్లు.. 408 ఆర్‌ఎస్‌కేలు

జిల్లాలో 27 మండలాల్లో 21 ఉద్యాన క్లస్టర్లు, 408 రైతు సేవా కేంద్రాలు (ఆర్‌ఎస్‌కే) కీలకంగా పని చేసేలా పక్కా ప్రణాళిక రూపొందించారు. రైతులకు నాణ్యమైన మొక్కలు పంపిణీ, అధునిక సాగు పద్ధతులు, సాంకేతిక సలహాలు, మార్కెట్‌ సమాచారం అందించే వ్యవస్థను బలోపేతం చేయబోతున్నారు. ఉద్యాన సాగుకే పరిమితం కా కుండా పంట దిగుబడులు పెంచడం, సేకరణ, గ్రేడింగ్‌, ప్యాకింగ్‌, పంట నిల్వలు, ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌, ఎగుమతులు.. ఇలా పూర్తిస్థాయిలో గొలుసుకట్టు విధానం అభివృద్ధి చేయనున్నారు. దీని వల్ల నాణ్యమైన పంట దిగుబడులు అధిక ధరలకు విక్రయించి రైతులు లాభపడడమే కాకుండా, దేశ వ్యాప్తంగా ఎక్కడ గిట్టుబాటు ధర ఉందో అక్కడికి వెళ్లి అమ్ముకునే అవకాశాలు లభిస్తాయి.

కొత్తగా 60 వేల హెక్టార్లలో అభివృద్ధి

జిల్లాలో కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ, పాణ్యం నియోజకవర్గాల్లో ప్రస్తుతం 86,342 హెక్టార్లలో మామిడి, జామ, చీని, సపోట, బొప్పాయి వంటి ఉద్యాన పంటలతో పాటు కూరగాయలు, పూలు సాగు చేస్తున్నారు. ఐహెచ్‌డీపీలో భాగంగా కొత్తగా మరో 60వేల హెక్టార్లలో ఉద్యాన సాగుకు రైతులను ప్రోత్సహించి 1,46,343 హెక్టార్లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఏటా 19.32 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడులు సాధిస్తే, దానిని 35.28 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెంచాలని లక్ష్యం. అదే క్రమంలో ఉద్యాన పంటల ద్వారా జిల్లా స్థూల విలువ జోడింపు (జీవీఏ) రూ.6,768 కోట్ల నుంచి రూ.12,764 కోట్లకు పెంచాలని లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఉద్యాన రంగం పాత్ర కీలకం కానుంది.

కర్నూలుకు నూతన గుర్తింపు

రాయలసీమ ఉద్యాన హబ్‌లో భాగంగా నీటి పొదుపు, సాంకేతికత, ఆధునిక సాగు విధానాలు, యాంత్రీకరణ, ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌, ఎగుమతులు.. ఇలా అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి జిల్లాలో ఉద్యాన పంటల సాగుకు కొత్త బాటలు వేస్తున్నారు. రైతులు పొలంలో పండించే పంట దిగుబడులు స్థానిక మార్కెట్‌ లోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించి ఆర్థికంగా లాభపడే అకాశాలు ఉన్నాయి. ఇక కర్నూలు అంటే కొండారెడ్డి బురుజు ఒక్కటే కాదు.. ఉద్యాన పంటల సాగులో ప్రసిద్ధి అనే స్థాయికి ఎదిగే అవకాశాలు ఉన్నాయి.

ఉద్యాన పంటలు సాగుకే పరిమితం కాకుండా సాగునీటి ప్రాజెక్టులు, నీటి వనరులు, గ్రామీణ రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేశారు. జిల్లాలో రూ.2,019 కోట్లతో.. వేదవతి నది నుంచి 8.292 టీఎంసీలు ఎత్తిపోసి ఆలూరు, ఆదోని, మంత్రాలయం నియోజకవర్గాల్లో 80 వేల ఎకరాలకు సాగునీరు, 196 గ్రామాలకు తాగునీరు అందించేలా చేపట్టిన వేదవతి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు, ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆలూరు నియోజకవర్గాల్లో సాగు, తాగునీరు అందించే గాజులదిన్నె ప్రాజెక్టు సామర్ద్యాన్ని 4.50 టీఎంసీల నుంచి 5.50 టీఎంసీలకు పెంచడం, హంద్రీనీవా కాలువ ద్వారా పత్తికొండ, డోన్‌, పాణ్యం నియోజకవర్గాల్లో 74 చెరువులను అభివృద్ధి చేయనున్నారు. అలాగే.. రూ.530 కోట్లతో గ్రామీణ రహదారుల కనెక్టివిటీ పెంచబోతున్నారు.

ప్రయోజనాలు ఎన్నో

వాతావరణ మార్పులకు అనుగుణంగా ఉద్యాన పంటలు ఎంపిక, సాగు విస్తీర్ణం పెంచడం.

ఉద్యాన పంటలకు కీలకమైన డ్రిప్‌, స్ర్పింకర్లు.. వంటి సూక్ష్మ నీటిపారుదల విధానాలతో నీటి వినియోగం సామర్ద్యం పెంచడం

నాణ్యమైన మొక్కలు ఎంపిక, పంపిణీ, ఆధునిక సాగు పద్ధతులతో దిగుబడులు పెంచడం

ఆధునిక వ్యవసాయ యంత్రాల వినియోగంపై రైతుల్లో చైతన్యం కల్పిస్తూ యంత్రీకరణకు ప్రత్యేక ప్రోత్సాహకాలు

పంట ఉత్పత్తుల సేకరణ కేంద్రాలు (కలెక్షన్‌ సెంటర్లు), ప్యాక్‌హౌస్‌లు, గ్రేడింగ్‌, కోల్డ్‌ స్టోరేజీలు, పంట నిల్వ గోదాముల ఏర్పాటు చేయడం

ప్రాథమిక, ద్వితీయ ప్రాసెసింగ్‌ ద్వారా పంట దిగుబడులకు విలువ జోడింపు

ఎఫ్‌డీవోల ద్వారా పంట ఉత్పత్తుల సేకరణ, మార్కెట్‌ అనుసంధానం, బ్రాడింగ్‌, నాణ్యత ధ్రువీకరణ. ఎగుమతులకు ప్రోత్సాహం

జిల్లాలో ఐహెచ్‌డీపీ లక్ష్యాలు

జిల్లాలో ప్రస్తుత ఉద్యాన సాగు: 86.343 హెక్టార్లు

ఐహెచ్‌డీపీ తరువాత : 1,46,343

కొత్తగా సాగు : 60 వేల హెక్టార్లు

ప్రస్తుత ఉద్యాన ఉత్పత్తి : 19,32,625 మెట్రిక్‌ టన్నులు

ఐహెచ్‌డీపీ లక్ష్యం : 35,28,826 మెట్రిక్‌ టన్నులు

జిల్లా ప్రస్తుతం జీవీఏ : రూ.6,768 కోట్లు

జీవీఏ లక్ష్యం : రూ.12.764 కోట్లు

Updated Date - Oct 02 , 2026 | 11:25 PM