ఆశలు తారుమారు!
ABN , Publish Date - Oct 15 , 2026 | 11:57 PM
డోన్ మున్సిపాలిటీ చైర్మన్ పదవి మహిళకు రిజర్వ్ కావడంతో డోన్‌లో రాజకీయ సమీకరణాలు తారుమారయ్యాయి. పదవిపై ఆశపెట్టుకున్న ఆశామహులు నిరాశ చెందారు.
డోన్ టౌన్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): డోన్ మున్సిపాలిటీ చైర్మన్ పదవి మహిళకు రిజర్వ్ కావడంతో డోన్‌లో రాజకీయ సమీకరణాలు తారుమారయ్యాయి. పదవిపై ఆశపెట్టుకున్న ఆశామహులు నిరాశ చెందారు. ఎలాగైనా దక్కించుకోవాలని సతీమణి, కుమార్తె లేదా కోడలిని బరిలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆశావాహులు ఎమ్మెల్యేను కలిసి తమవారికే కేటాంచాలని కోరినట్లు సమాచారం. ఎమ్మెల్యే కోట్ల, ఇన్చార్జి మంత్రి పయ్యావుల కేశవ్, ఎన్నికల పరిశీలకుడు ప్రభాకర్ చౌదరి బలబలాలను పరిశీలించి అభ్యర్థుల వివరాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని విశ్వసనీయ సమాచారం.
మారుతున్న సమీకరణాలు
టీడీపీ తరపున ఎమ్మెల్యే సతీమణి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పేరు వినిపిస్తోంది. ఇప్పటికే ఇన్చార్జి మంత్రి పయ్యావుల కేశవ్, పరిశీలకుడు ప్రభాకర్ చౌదరితో కలిసి ఎమ్మెల్యే, సుజాతమ్మ చర్చించినట్లు తెలిసింది. దీంతో డోన్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అలాగే మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ టీఈ కేశన్నగౌడ్ సతీమణి టీఈ శిరీష పేరుకూడా వినిపిస్తోంది. మాజీ మున్సిపల్ చైర్మన్ కోట్రికే హరికిషన్ సతీమణి మాజీ కౌన్సిలర్ కోట్రికే పద్మజ, సాయిశ్రీ విద్యాసంస్థల అధినేత మర్రి రమణ సతీమణి మర్రి వసుధ రేసులో ఉన్నారు.
అయోమయంలో వైసీపీ
నోటిఫికేషన్ విడుదలైనా అభ్యర్థుల ఎంపికలో వైసీపీ నాయకుల్లో అయోమయం కనిపిస్తోంది. చైర్మన్ రేసులో ఎవరున్నారన్నది ఇంతవరకు స్పష్టత రాలేదు. మున్సిపాలిటీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నాటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ నాయకులు ఇప్పటివవరకు చైర్మన్ అభ్యర్థిని ఎంపిక చేయకపోవడం ఆ పార్టీ పరిస్థితిని తెలియచేస్తోంది. మాజీ ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి సతీమణి రేగటి స్వర్ణ కుమారి, పోస్టు ప్రసాద్ సతీమణి వల్లె చైతన్య, డి.షాహీనాబాను మరో ఇద్దరు పేర్లు రేసులో ఉన్నట్లు సమాచారం.