విధేయతకు పట్టం
ABN , Publish Date - Jul 11 , 2026 | 10:57 PM
రాజకీయాల్లో కొందరు ప్రచారం కోసం ఆరాటపడితే.. మరికొందరు ప్రజాక్షేత్రంలో కనిపించకుండానే పార్టీ గెలుపు గుర్రాలను పరుగులెత్తిస్తారు..
టీడీపీ ఎన్‌ఆర్‌ఐ జాతీయ కమిటీ సారథిగా డాక్టర్ గురురాజా
రెండు దశాబ్దాలుగా నిశ్శబ్ద వ్యూహ రచన
అధినేత చంద్రబాబు ఆప్తుడికి దక్కిన గౌరవం
కర్నూలు, జూలై 11 (ఆంధ్రజ్యోతి): రాజకీయాల్లో కొందరు ప్రచారం కోసం ఆరాటపడితే.. మరికొందరు ప్రజాక్షేత్రంలో కనిపించకుండానే పార్టీ గెలుపు గుర్రాలను పరుగులెత్తిస్తారు.. ప్రచార ఆర్భాటాలకు దూరంగా తెర వెనుక ఉండి నిశ్శబ్దంగా వ్యూహాలు రచిస్తూ పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమించే అరుదైన నాయకులకు తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ సముచిత స్థానం దక్కుతుందని మరోసారి నిరూపితమైంది. రెండు దశాబ్ధాలుగా ఎన్‌ఆర్‌ఐ టీడీపీ విభాగంలో అలుపెరుగని సేవలు అందిస్తున్న ప్రముఖ వైద్యులు, రాజకీయ వ్యూహకర్త డాక్టర్ పి.గురురాజా (డాక్టర్ రాజా)ను గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ జాతీయ కమిటీ అధ్యక్షుడిగా అధినేత, సీఎం నారా చంద్రబాబునాయుడు నియమించారు. 44 మంది సభ్యులతో కూడిన ప్రతిష్టాత్మక టీడీపీ ఎన్‌ఆర్‌ఐ జాతీయ కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ గురురాజాను ప్రకటించడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. నంద్యాల జిల్లాకు చెందిన డాక్టర్ గురురాజా వృత్తిరిత్యా గుర్తింపు పొందిన ప్రముఖ స్త్రీ వైద్య నిపుణుడు. వైద్య వృత్తిలో భాగంగా అమెరికా వెళ్లి టెక్సా్‌సలో స్థిరపడ్డారు. డాలర్ల గడ్డపై ఉన్నప్పటికీ సొంత గడ్డపై ఉన్న మమకారాన్ని, బాధ్యతలను ఆయన ఎన్నడూ మరువలేదు. రాయలసీమ ప్రాంతంలోనూ, రాష్ట్రంతోనూ బలమైన సాంస్కృతిక, సామాజిక అనుబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్, ఐటీ విప్లవానికి ఆకర్షితులైన డాక్టర్ రాజా 20 ఏళ్లుగా ఎన్‌ఆర్‌ఐ టీడీపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. అంతర్జాతీయంగా ప్రవాసాంధ్రులు, పార్టీ అధిష్టానానికి మధ్య ఒక బలమైన వారధిగా నిలిచారని టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు. 2024 ఎన్నికల్లో కూటమి విజయం కోసం తెరవెనుక పని చేసిన ఎందరో నాయకుల్లో డాక్టర్ గురురాజా ఒకరు. అయితే.. ఆయన కీలక భూమిక పోషించారు. ముఖ్యంగా సొంత ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూటమి గెలుపు కోసం ఆయన వ్యూహాత్మక చొరవ పార్టీకి పెద్ద ప్లస్ పాయింట్ అయింది.
కుటుంబ నేపథ్యం
డాక్టర్ గురురాజా తండ్రి పిళ్లారశెట్టి రంగారావు వృత్తిరిత్య ఉపాధ్యాయుడు. వారి స్వగ్రామం కాకినాడ జిల్లా జగన్నాథపురం. విద్యా శాఖలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరిన ఆయన చిత్తూరు జిల్లా పుత్తూరులో ఉద్యోగ ప్రస్థానం మొదలైంది. పులివెందులు, ఆదోని, గిద్దలూరు, కొమరోలు.. వంటి ప్రాంతాల్లో ఉపాధ్యాయుడిగా పని చేశారు. ఆ సమయంలోనే జయమ్మను పెళ్లి చేసుకున్నారు. ఎక్కువ కాలం ఉమ్మడి కర్నూలు జిల్లాలో పని చేసిన ఆయన ప్రస్తుత నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో స్థిరపడ్డారు. రంగారావు, జయమ్మ దంపతులకు రాఘవేంద్ర ప్రసాద్, సుధాకర్, గురురాజా, రమేశ్ నలుగురు కుమారులు సంతానం. గురురాజా కర్నూలు మెడికల్ కళాశాలలో వైద్యవిద్యను పూర్తి చేశారు. స్త్రీవైద్య నిపుణుడిగా ప్రసిద్ధి చెందారు. వైద్య వృత్తిలో భాగంగా అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుతో ఉన్న సన్నిహిత్యం వల్ల టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగంలో కీలకంగా పని చేశారు.
డాక్టర్ గురురాజాను టీడీపీ ఎన్‌ఆర్‌ఐ జాతీయ కమిటీ అధ్యక్షుడిగా ఎంపికచేయడంపై ఆయన అభిమానులు, టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. లీగల్ సెల్ కర్నూలు జిల్లా అధ్యక్షులు కేఈ జగదీశ్ గౌడ్, టీడీపీ నాయకులు నాగేంద్రుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కేఈ జగదీశ్ గౌడ్ మాట్లాడుతూ వ్యూహరచనలో దిట్ట అయిన డాక్టర్ రాజా సారఽథ్యంలో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ గ్లోబల్ వేధికపై సరికొత్త రికార్డులు సృష్టించాలని ఆకాంక్షిస్తున్నారు. అదేవిధంగా ఏపీ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డైరెక్టర్ మహేశ్ నాయుడు సహా పార్టీ శ్రేణులు కేక్‌కట్ చేసి ప్రజలకు పంపిణీ చేశారు. డాక్టర్ గురురాజాకు అధినేత సముచిత స్థానం కల్పించి గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ అధ్యక్షుడిగా ఎంపిక చేయడం అభినందనీయమని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, సివిల్ కార్పొరేషన్ డైరెక్టర్ మహేశ్ నాయుడు తెలిపారు.