విజయ డెయిరీ వద్ద హైటెన్షన్
ABN , Publish Date - Sep 29 , 2026 | 11:32 PM
పట్టణ సమీపంలోని విజయ పాల కేంద్రంలో పాలకవర్గ సభ్యుల మధ్య ఉన్న విభేదాల కారణంగా కార్యాలయంలో నిర్వహించాల్సిన సర్వసభ్య సమావేశం నడిరోడ్డుపై నిర్వహించారు.
నడిరోడ్డుపై పాల కేంద్రం సర్వసభ్య సమావేశం
భారీగా మోహరించి అడ్డుకున్న పోలీసులు
నంద్యాల రూరల్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : పట్టణ సమీపంలోని విజయ పాల కేంద్రంలో పాలకవర్గ సభ్యుల మధ్య ఉన్న విభేదాల కారణంగా కార్యాలయంలో నిర్వహించాల్సిన సర్వసభ్య సమావేశం నడిరోడ్డుపై నిర్వహించారు. మంగళవారం విజయ డెయిరీ చైర్మన్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్యనున్న విభేదాల కారణంగా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందేమోనన్న నేపథ్యంలో పోలీసులు డైరెక్టర్లు, ప్రెసిడెంట్లను కార్యాలయంలోకి వెళ్లకుండా గేటు వద్దనే అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులతో డైరెక్టర్లు వాగ్వాదానికి దిగారు. తమ సమావేశాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. శాంతిభద్రతల దృష్ట్యా ఈ సమయంలో సమావేశం నిర్వహించడం సబబు కాదని పోలీసులు చెప్పారు. అయినప్పటికీ వినకుండా కార్యాలయ గేటు వద్ద సమావేశాన్ని నిర్వహించి ఏకపక్షంగా చర్చలు, తీర్మానాలు, ఆమోదాలు తెలిపారు. అనంతరం కార్యాలయంలోని సమావేశ భవనంలో డైరెక్టర్లు, ప్రెసిడెంట్లతో ఛైర్మన్ సమావేశం నిర్వహించి అధిక పాలు సేకరించిన ప్రెసిడెంట్లకు బహుమతులు అందజేశారు. ఈ నేపథ్యంలో తాలూకా సీఐ ఈశ్వరయ్య అక్కడకు చేరుకొని సమావేశానికి అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. గతంలో విజయ డెయిరీలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయంటూ టీడీపీ నేతలు అనేకసార్లు ధర్నాలు, నిరసనలు చేపట్టిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఏమైనా ఘర్షణలు చోటు చేసుకుంటాయేమోనని తాలూకా సీఐ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నూనెపల్లి సమీపంలోని గెలివి కాటా, షుగర్ ప్యాక్టరీ సమీపంలో ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి, విజయ డెయిరీలో సభ్యులు కానీ వారిని అటువైపుగా వెళ్లకుండా అడ్డుకున్నారు. నేడు సర్వసభ్య సమావేశంలో వైస్ ఛైర్మన్ ఎంపిక జరగాల్సి ఉంది. కానీ సర్వసభ్య సమావేశం సజావుగా సాగక పోవడంతో ఎంపిక జరగలేదు. కార్యక్రమంలో 15 మంది డైరెక్టర్లు, 80 మంది ప్రెసిడెంట్లు పాల్గొన్నారు.