భానుడి భగభగలు
ABN , Publish Date - Jun 01 , 2026 | 12:36 AM
రోహిణి కార్తెలో ’రోలు పగిలేలా’ ఎండలు కాస్తాయి అన్నది పెద్దల మాట. ఈ క్రమంలోనే ఆదివారం కోసిగి మండలంలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడా అనే రీతిలో ఎండలు మండిపోయాయి.
నిర్మానుష్యంగా మారిన రోడ్డు
బయటకు రావాలంటేనే బెంబేలెత్తుతున్న జనం
కోసిగి, మే 31 (ఆంధ్రజ్యోతి): రోహిణి కార్తెలో ’రోలు పగిలేలా’ ఎండలు కాస్తాయి అన్నది పెద్దల మాట. ఈ క్రమంలోనే ఆదివారం కోసిగి మండలంలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడా అనే రీతిలో ఎండలు మండిపోయాయి. వారం ఆఖరి రోజున ఉష్ణోగ్రత ఒక్కసారిగా 40 డిగ్రీలకు చేరడంతో జనం అల్లాడిపోయారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత ప్రారంభం కాగా, మధ్యాహ్న సమయానికి ఎండలు మరింత ముదిరాయి. తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వేడిగాలుల కారణంగా మధ్యాహ్నం వేళ కోసిగిలోని ప్రధాన రహదారులన్నీ జన సంచారం లేక వెలవెలబోయాయి. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ నుంచి బస్టాండు, వాల్మీకి సర్కిల్ వరకు, సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయ పరిసర ప్రాంతాలు పూర్తిగా నిర్మానుష్యంగా మారి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించాయి. ఎండ దెబ్బకు భయపడి ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో వ్యాపార సముదాయాలు కూడా బోసిపోయాయి. అత్యవసర పనులుంటే తప్పా జనం బయటకు రావడానికి సాహసించడం లేదు. రానున్న రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.