సన్’డే’
ABN , Publish Date - Mar 09 , 2026 | 12:02 AM
కొద్ది రోజులుగా ఎండలు మండి పోతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. కొలిమిగుండల్లలో రెండు రోజులుగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
మండుతున్న ఎండలు .. ఇబ్బందులు పడుతున్న జనం
కొలిమిగుండ్లలో 39 డిగ్రీలు, జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు
కొలిమిగుండ్ల, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): కొద్ది రోజులుగా ఎండలు మండి పోతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. కొలిమిగుండల్లలో రెండు రోజులుగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
మరింత పెరిగే అవకాశం
ఈఏడాది ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో జనం ఆందోళన చెందుతున్నారు. కొలిమిగుండ్ల, అవుకు, బనగానపల్లె మైనింగ్ ప్రాంతం కావడంతో వేడి అధికంగా ఉన్నట్లు ప్రజలు వాపోతున్నారు. మధ్యాహ్నం బయటకి రావాలంటే భయపడిపోతున్నారు. నిత్యం ఆర్టీసీ బస్సులు, ప్రయాణికులతో కళకళలాడే కడప, అనంతపురం, కర్నూలు మూడు జిల్లాల సరిహద్దుగా ఉన్న కొలిమిగుండ్ల ఆర్టీసీ బస్టాండు ప్రయాణికులు లేక ఆదివారం వెలవెలబోయింది. దీంతో ప్రధాన రహదారులు బోసిపోయాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయట తిరగకూడదు. అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్లకూడదు. తప్పనిసరిగా బయటికి వెళ్లాల్సి వస్తే తెల్లని నూలువస్త్రాలు, గొడుగు లేదా టోపీ, తలపాగా ధరించాలి. ద్రవ పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి. మత్తు పానీయాల జోలికి వెళ్లరాదు. శీతల పానీయలు తీసుకోకుండా, మజ్జిగను తరచూ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాలి
వడదెబ్బ బాధితులను వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రా నికి తీసుకెళ్లాలి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రనజలు జాగ్రత్తలు తీసుకోవాలి. శీతల పానీయాలు, మంచు ముక్కలు తీసుకుంటే గొంతుకు సంబంధించి అనారోగ్యం వస్తుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4గంటల మధ్య ఆరుబయట శారీరక శ్రమ చేయరాదు. ఎండలో తిరిగే సమయంలో చల్లని నిమ్మరసం, మజ్జిగ తీసుకోవాలి. - డాక్టర్ శ్రావణి, వైద్యాధికారి, రుద్రవరం
ఎండలో తిరగవద్దు..
రుద్రవరం: ఎండలు ఎక్కువగా ఉండటంతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయట తిరగవద్దని వైద్యులు సూచించారు. ప్రజలు తమ పనులను ఉదయం, సాయంత్రం చూసుకోవాలంటున్నారు. నిర్లక్ష్యం వహిస్తే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
వడదెబ్బ లక్షణాలు
వడదెబ్బకు గురైతే తీవ్ర తలనొప్పి స్తుంది. నాడీ వేగంగా కొట్టుకుంటుంది. నాలుక తడారిపోయి ఎండిపోతుంది. శరీరంలో కనీస నీటి శాతం తగ్గిపోతుంది. బాధితుడు పాక్షికంగా లేదా పూర్తిగా అపస్మారక స్థితికి చేరుకునే ప్రమాదం ఉంది.
ప్రథమ చికిత్స ఇలా
వడదెబ్బకు గురైన వారిని వెంటనే నీడకు తీసుకెళ్లాలి. వ్యక్తి శరీరాన్ని చల్లని నీటిలో ముంచిన గుడ్డతో తుడవాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజు, కొబ్బరినీరు, ఓఆర్‌ఎస్ కలిపిన నీటిని తాగించాలి. ప్రధమ చికిత్స నిమిత్తం దగ్గరలోని ప్రాధమిక ఆరగ్యో కేంద్రానికి తీసుకెళ్లాలి. అత్యవసర పరిస్థితుల్లో 108, 104 కు సంప్రదించి ఆసుపత్రికి తరలించాలి.