‘బాహుబలి’ బలం
ABN , Publish Date - Sep 08 , 2026 | 12:31 AM
శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా ఉరుకుంద ఈరన్నస్వామి పల్లకి మహోత్సవంలో భాగంగా కందుకూరు గ్రామంలో సోమవారం నిర్వహించిన క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగాయి.
కోసిగి, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా ఉరుకుంద ఈరన్నస్వామి పల్లకి మహోత్సవంలో భాగంగా కందుకూరు గ్రామంలో సోమవారం నిర్వహించిన క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగాయి. కౌతాళం మండలం తిప్పలదొడ్డి నుంచి కందుకూరు వరకు నిర్వహించిన 8కి.మీ. పరుగుపందెంలో సుమారు 50 మంది పాల్గొన్నారు. విజయనగరం జిల్లాకు చెందిన హరీష్ అనే యువకుడు అత్యంత వేగంగా పరిగెత్తి ప్రథమ స్థానంలో నిలవగా, పెద్దతుంబలం గ్రామానికి చెందిన ఈరన్న ద్వితీయ స్థానంలో నిలిచాడు. గుండు ఎత్తే పోటీల్లో.. రాయచూరు జిల్లా మాన్వి తాలూకా కప్పగల్ గ్రామానికి చెందిన కప్పగల కర్ణ ఏకంగా 204కిలోల బరువున్న రాతి గుండును అవలీలగా ఎత్తాడు. కర్ణాటక రాష్ట్రం దేవదుర్గ తాలూకా శారదహళ్లికి చెందిన మరియప్పనాయక్ 185 కిలోల గుండు ఎత్తి ద్వితీయ స్థానంలో నిలిచాడు. ఇసుక బస్తా ఎత్తే పోటీల్లోనూ కర్ణాటకకు చెందిన మరియప్ప నాయక్ తన బలాన్ని చాటుకున్నాడు. 200 కిలోల ఇసుక బస్తాను ఎత్తి ప్రథమ స్థానంలో నిలవగా, 190 కిలోల ఇసుక బస్తాను ముదుకప్ప నాయక్ ఎత్తి ద్వితీయ స్థానంలో నిలిచాడు. నేలకోసిగి గ్రామానికి చెందిన పూజారి సిద్ధరామయ్య 170 కిలోల బస్తాను ఎత్తి మూడో స్థానంలో నిలిచాడు.