Share News

పటిష్ట బందోబస్తు

ABN , Publish Date - Oct 29 , 2026 | 11:53 PM

పురపోరుకు సంబంధించిన నవంబరు 1వ తేదీన పోలింగ్‌ జరగనుండటంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసినట్లు ఎస్పీ సునీల్‌ షెరాన్‌ తెలిపారు.

పటిష్ట బందోబస్తు

1,925 మంది పోలీసులతో భద్రత కట్టుదిట్టం

ప్రత్యేక బృందాలతో విస్తృత నిఘా

ఎస్పీ సునీల్‌ షెరాన్‌

నంద్యాల, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): పురపోరుకు సంబంధించిన నవంబరు 1వ తేదీన పోలింగ్‌ జరగనుండటంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసినట్లు ఎస్పీ సునీల్‌ షెరాన్‌ తెలిపారు. గురువారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. మున్సిపాలిటీల వారీగా ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామన్నారు. పోలింగ్‌ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా 1,925 పోలీసు అధికారులు, సిబ్బందితో భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. ప్రశాంత వాతారణంలో ఓటర్లు తమ ఓటుహక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నామ న్నారు. ఎక్కడైన ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని, లేకపోతే 112 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేయవచ్చని సూచించారు.

ఇద్దరు అదనపు ఎస్పీలు..

పురపోరు ఎన్నికల బందోబస్తు కోసం అదనపు ఎస్పీలు- ఇద్దరు, డీఎస్పీలు-5, సీఐలు- 40, ఎస్‌ఐలు- 60 మందిని నియమించారు. వీరితో పాటు ఏఎ్‌సఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు, కలిపి మొత్తంగా 1404 మంది ఎన్నికల బందోబస్తుకు నియమించారు. వీరితో పాటు అదనంగా ఏపీఎస్పీ రెండు ప్లాటూన్లతో మొత్తంగా 40 మంది సిబ్బందిని తీసుకున్నారు. గ్రామవార్డు మహిళా కార్యదర్శులు 460మందితో పాటు అగ్నిమాపక, అటవీ శాఖకు చెందిన 21మంది సిబ్బందిని బందోబస్తు కోసం నియమించారు.

20 చెక్‌ పోస్టులు

ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా నగదు, మద్యం, తదితర నిషేధిత వస్తువులు అక్రమ రవాణాకు జరగకుండా జిల్లా వ్యాప్తంగా 20 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. సదరు చెక్‌పోస్టుల వద్ద నిత్యం తనిఖీలతో పాటు నిఘా విస్తృతం చేశారు.

నిబంధనలు పక్కాగా అమలయ్యేలా..

పోలింగ్‌ కేంద్రాలతో పాటు సమీప ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో అవాంఛనీ ఘటనలకు తలెత్తకుండా ఎక్కడికక్కడ ఎన్నికల నిబంధనలు పక్కాగా అమలయ్యే విధంగా 42 పికెట్లు, 36 రూట్‌ మొబైల్స్‌, 20 స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ బృందాలు, 13 షాడో బృందాలు, 16 ప్లయింగ్‌ స్క్యాడ్స్‌, 5 ఎంసీసీ బృందాలు, 5 వీఎ్‌సటీ బృందాలు ఏర్పాటు చేశారు. సదరు బృందాలన్నీ కూడా నిత్యం నిఘాతో పాటు పర్యవేక్షణ చేస్తారు.

Updated Date - Oct 29 , 2026 | 11:53 PM