Share News

ఆస్పరి పోలీస్‌ స్టేషన్‌లో హైడ్రామా

ABN , Publish Date - Jul 07 , 2026 | 11:32 PM

ఆస్పరి పోలీస్‌స్టేషన్‌లో విచారణ సమయంలో బిల్లేకల్లు గ్రామానికి చెందిన హనుమంతరెడ్డి ఒక్కసారిగా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

ఆస్పరి పోలీస్‌ స్టేషన్‌లో హైడ్రామా
ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులు

విచారణకు వచ్చిన వ్యక్తి ఆత్మహత్యాయత్నం

పురుగుల మందు తాగిన వైనం

పెరిగిన సీఐ వేధింపులు

స్టేషన్‌కు వచ్చిన మహిళలపై దురుసు ప్రవర్తన

బాధిత వర్గాల ఆరోపణ

ఆలూరు/ఆస్పరి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ఆస్పరి పోలీస్‌స్టేషన్‌లో విచారణ సమయంలో బిల్లేకల్లు గ్రామానికి చెందిన హనుమంతరెడ్డి ఒక్కసారిగా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఒక్కసారిగా పోలీస్‌స్టేషన్‌లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. విచారణ పేరుతో ఆస్పరి సీఐ శ్రీనివాస్‌నాయక్‌ తనను తీవ్రంగా వేధిస్తున్నాడని బాధితుడు ఆరోపించారు. పోలీసులు ఆయనను స్వయంగా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు...

నెల రోజుల క్రితం గ్రామంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కేసులో హనుమంతరెడ్డి ప్రమేయం ఉందనే అనుమానంతో పోలీసులు పలుమార్లు విచారణకు పిలిపించారు. ఆస్పరిలోని పోలీస్‌ క్వార్టర్స్‌లో మూడు రోజులపాటు నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారన్నారు. అలాగే ఆస్పరి సహకార సొసైటీలో జరిగిన అవినీతి అక్రమాలపై సింగిల్‌ విండో సీఈఓ నరసింహులు ఇచ్చిన కేసు ఆధారంగా విచారణ పేరుతో మూడు రోజుల క్రితం కూడా స్టేషన్‌కు రప్పించి తీవ్రంగా కొట్టారన్నారు. మంగళశారం మరోసారి స్టేషన్‌కు రావాలని చెప్పడంతో పోలీసులు వేధింపుల కు గురి చేస్తారనేభయంతో తీవ్ర మనస్థాపానికి గురై హనుమంతరెడ్డి పోలీస్‌స్టేషన్‌లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వైద్యాధికారి డాక్టర్‌ బాలకృష్ణ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 అంబులెన్స్‌ ద్వారా ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనపై ఆరా తీసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన మహిళలతో కూడా సీఐ దురుసుగా ప్రవర్తించాడని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనతో బాధితుడి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు స్థానిక పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. విచారణ పేరుతో పోలీసుల వేధింపులే ఈ ఘటనకు కారణమని ఆరోపిస్తూ ఘటనపై న్యాయ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితా కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు.

భయంతోనే చేశాడు

ఆస్పరి సహకార బ్యాంకులో క్లర్క్‌గా పనిచేసిన హనుమంతురెడ్డిపై చిగిలి గ్రామానికి చెందిన రైతు వీరేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. క్లర్క్‌గా ఉన్న సమయంలో హనుమంత రెడ్డి, చిగిలి గ్రామ రైతు వీరేష్‌కు బ్యాంకులో ఉన్న అప్పు మాఫీ చేయిస్తానని రూ.1.29 లక్షలు నగదు, మరో రూ.35 వేలు ఫోన్‌ పే వేయించుకున్నాడు. బాధితుడు వీరేష్‌ ఫిర్యాదు మేరకు హనుమంతరెడ్డిని విచారించాం. మోసం ఎక్కడ బయటపడుతుందోనని భయపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అంతే తప్పా ఆము ఎవరిని వేధించలేదని మహిళలను దుర్భాషలాడలేదన్నారు. తనపై ఉద్దేశపూర్వ కంగానే ఆరోపణలు చేస్తున్నారని సీఐ తెలిపారు.

- శ్రీనివాసనాయక్‌, సీఐ, ఆస్పరి

Updated Date - Jul 07 , 2026 | 11:32 PM