త్వరలో హైకోర్టు బెంచ్
ABN , Publish Date - Jun 10 , 2026 | 11:16 PM
‘ఎన్నికల ముందు హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై స్పష్టమైన హామీ ఇచ్చాం.
పశ్చిమ ప్రాంత అభివృద్ధి, ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
వేదవతి పనుల ప్రారంభానికి సన్నాహాలు
జీడీపీ, జీఆర్‌పీ పనులు పూర్తి చేయాలి
గుండ్రేవుల, ఆర్డీఎస్‌పై తెలంగాణతో చర్చించాలి
కర్నూలు-బళ్లారి రోడ్డును జాతీయ రహదారిగా మార్చాలి
కర్నూలు ఇన్‌చార్జి మంత్రి నిమ్మలతో కీలక నేతల భేటీ
కర్నూలు, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): ‘ఎన్నికల ముందు హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై స్పష్టమైన హామీ ఇచ్చాం. కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం కూటమి ప్రభుత్వం నివేదిక పంపింది. ఢిల్లీలో ఫాలోఅప్ చేసి త్వరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి..’ అని కర్నూలు జిల్లా ఇన్‌చార్జి, ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును మంత్రి టీజీ భరత్ కోరారు. కర్నూలు జిల్లా సమగ్రాభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు మంత్రి నిమ్మల రామానాయుడుతో బుధవారం అమరావతిలోని జలవనరుల శాఖ ఈఎన్‌సీ కార్యాలయంలో చర్చించారు. ఈ సమావేశానికి మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యేలు బీవీ జయనాగేశ్వరరెడ్డి, కేఈ శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి, టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, నియోజకవర్గ ఇన్‌చార్జిలు కె.మీనాక్షినాయుడు, ఎన్.రాఘవేంద్రరెడ్డి, వైకుంఠం జ్యోతి, ప్రధాన కార్యదర్శి నాగరాజుయాదవ్‌లు హాజరయ్యారు.
పశ్చిమ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాలి
కర్నూలు జిల్లా అంటే పశ్చిమ ప్రాంతమైన ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లో కరువు, వలసలే గుర్తుకు వస్తాయి. ఈ ప్రాంతంలో సాగు, తాగునీటి సమస్యలు తీరుస్తామని సీఎం చంద్రబాబు, యవగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేశ్‌లు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ హామీలు సాకారం కావాలంటే గుండ్రేవులు జలాశయం, ఆర్డీఎస్, వేదావతి ప్రాజెక్టులు తక్షణమే చేపట్టాలని ముక్తకంఠంతో ఎంపీ, ఎమ్మెల్యేలు ఇన్‌చార్జి మంత్రి నిమ్మల దృష్టికి తీసుకెళ్లారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి టీజీ భరత్ సహా ప్రజా ప్రతినిధులు కోరారు. త్వరలోనే ఏర్పాటు చేసేలా సీఎంవో, ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని మంత్రి నిమ్మల వివరించారు. గుండ్రేవుల, ఆర్డీఎస్ ప్రాజెక్టులు అంతర్ రాష్ట్ర సమస్యలు ఉన్నాయని, ఆ ప్రాజెక్టులపై త్వరలోనే తెలంగాణ ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. వేదవతి ప్రాజెక్టు పనులు త్వరలో చేపడుతామన్నారు. అసంపూర్తిగా ఉన్న గాజులదిన్నె జలాశయం ఎత్తు పెంచే పనులకు బ్యాలెన్స్ నిధులు ఇవ్వాలని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, దోపిడికి గురైన గురురాఘవేంద్ర ఎత్తిపోతల పథకాలకు రూ.11 కోట్లు నిధులు ఇచ్చి మరమ్మతులు చేపట్టాలని మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి ఇన్‌చార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హంద్రీనీవా నుంచి 68 చెరవులకు కృష్ణా జలాలు ఎత్తిపోసే ప్రాజెక్టుకు గత ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు 85 శాతం పూర్తయ్యింది.. ఈ నెల 24 లేదా 27 తేదీల్లో జొన్నగిరిలో గోల్డ్ మైన్ ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు రానున్నారు.. అసంపూర్తి పైపులైన్ పూర్తి చేసి జొన్నగిరి చెరువుకు హంద్రీనీవా నీటిని మళ్లించేలా చర్యలు చేపట్టాలని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు కోరారు. ఆదోనిలో ఐటీఐ, ఉర్దూ జూనియర్ కాలేజీలు, మైనార్టీ రెసిడెన్షియల్ కళాశాలల నిర్మాణం పూర్తయ్యింది. సిబ్బంది, ఫర్నీచర్ లేక నిరుపయోగంగా ఉన్నాయి.. ఫర్నీచర్ ఏర్పాటు చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదోని ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు కోరారు. ఆలూరులో ఐటీఐ కళాశాల భవనం నిర్మాణం పూర్తయినా స్థలదాత పేరు పెట్టే విషయంలో ఆగిపోయిందని, స్థలదాత పేరు పెట్టేలా చర్యలు తీసుకోవాలని, నగరడోన జలాశయం పనులు చేపట్టాలని ఆలూరు ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి కోరారు. సి.బెళగల్ చెరువుకు తుంగభద్ర జలాలు ఎత్తిపోతల పథకం చేపట్టాలని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఇన్‌చార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కర్నూలు-బళ్లారి వయా కోడుమూరు రోడ్డు అధ్వానంగా మారిందని, ఈ రోడ్డును నేషనల్ హైవేలో చేర్చి నాలుగు వరుసల రోడ్డుగా అభివృద్ధి చేయాలని ఎంపీ బస్తాపాటి నాగరాజు విన్నవించారు. పలు సమస్యలు, ప్రగతిపై సుదీర్ఘంగా చర్చించారు. జిల్లా నేతలు తీసుకొచ్చి పలు సమస్యలను ఫోన్‌లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి దృష్టికి ఇన్‌చార్జి మంత్రి నిమ్మల తీసుకెళ్లి.. తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.
15న కర్నూలులో విజయోత్సవ సభ
సీఎం చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకోవడం, ప్రధానిగా నరేంద్ర మోదీ పుష్కరకాలం పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 15న కర్నూలులో విజయోత్సవ సభ నిర్వహించాలని టీడీపీ అధిష్టానం ఆదేశించింది. ఈ సభను విజయవంతం చేయడంపై ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లా నాయకులతో చర్చించారు. కూటమి పార్టీలు జనసేనా, బీజేపీ నాయకులతో సమన్వయం చేసుకుని ఐదు వేల మందికి తగ్గకుండా విజయోత్సవ సభ నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి నియోజకవర్గం నుంచి 750 మంది తగ్గకుండా రావాలని, ఈ సభ తరువాత ప్రతి నియోజకవర్గంలో విజయోత్సవ సభలు నిర్వహించాలని ఆదేశించారు.