కర్నూలులోనే హైకోర్టు బెంచ్
ABN , Publish Date - Jan 11 , 2026 | 11:16 PM
కర్నూలులోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటుచేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ స్పష్టీకరించారు.
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
కర్నూలు లీగల్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): కర్నూలులోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటుచేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ స్పష్టీకరించారు. ఆదివారం నగరంలోని నరసింహారెడ్డి నగర్‌లో ఓ ఫంక్షన్‌హాలులో జరిగిన న్యాయవాదుల సంక్రాంతి సంబరాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కర్నూలులో న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామన్నారు. హైకోర్టు బెంచ్ కర్నూలు నగరంలోనే ఏర్పాటుచేసేందుకు సీఎం చంద్రబాబునాయుడు, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సుముఖంగా ఉన్నారన్నారు. ఈ హైకోర్టు బెంచ్‌ను ఏ, బీ, సీ క్యాంపుల్లో ఏర్పాటుచేసేందుకు ప్రతి పా దనలు పంపినట్లు ఆయన తెలిపారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు ఆషామాషీ కాదని, ఆప్రతిపాదనలు కార్యరూపం దాల్చేందుకు ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. హైకోర్టు బెంచ్‌తో పాటు నగరంలోనే నూతన కలెక్టరేట్ నిర్మాణం కూడా చేస్తామని అన్నారు. వైసీపీ నాయకులు తిరుమలలో మద్యం బాటిళ్ల పేరుతో కుట్రలు చేస్తుందని, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ప్రభుత్వం వాస్తవాలను బయట పెడుతుందని తెలిపారు. ఇకనైనా వైసీపీ నాయకులు చిల్లర చేష్టలు మానుకోవాలని హితువు పలికారు. రానున్న బార్ కౌన్సిల్ ఎన్నికల్లో న్యాయవాదులందరూ సంఘటితమై టీడీపీ బలపరిచిన యలమంచి బాలాజీని అత్యధిక మెజారీటీతో గెలిపించాలని ఆయన న్యాయవాదులను కోరారు. వివిధ కోర్టుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా ఇటీవలే నియమింపబడిన జీపీ, ఏజీపీలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, టీడీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు కేఈ జగదీష్, టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్, కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్షులు హరినాథ చౌదరి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ రాఘవేంద్ర, బీజేపీ లీగల్ సెల్ నాయకులు లోకేశ్వరయ్య, టీడీపీ లీగల్ సెల్ జిల్లా ఉపాద్యక్షుడు గణేష్ సింగ్ పాల్గొన్నారు.