Share News

రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయింది

ABN , Publish Date - Aug 18 , 2026 | 11:52 PM

ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి బాగా పెరిగిపోయిందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ ఆరోపించారు. నగరంలోని త్రిగుణ హోటల్‌ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు కుటుంబాల పరిపాలన కొనసాగుతోందని, ఈ రెండు కుటుంబాలు కలిసి రాష్ట్రాన్ని అవినీతి ఆంధ్రప్రదేశ్‌గా మార్చాయని ఆరోపించారు

రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయింది
మాట్లాడుతున్న చింతా మోహన్‌

కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్‌

కర్నూలు న్యూసిటీ, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి బాగా పెరిగిపోయిందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ ఆరోపించారు. నగరంలోని త్రిగుణ హోటల్‌ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు కుటుంబాల పరిపాలన కొనసాగుతోందని, ఈ రెండు కుటుంబాలు కలిసి రాష్ట్రాన్ని అవినీతి ఆంధ్రప్రదేశ్‌గా మార్చాయని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి విజయ్‌భాస్కర్‌రెడ్డి దగ్గర లేని డబ్బు, ఆస్తులు, చంద్రబాబు నాయుడు, వైఎస్‌ కుటుంబానికి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. వంద రోజుల్లో అవినీతి లేకుండా చేస్తానని చెప్పిన విజయ్‌, తమిళనాడులో తన వందరోజుల పాలనలో అవినీతి లేకుండా చేశారన్నారు. విజయ్‌పాలనలో తమిళనాడు రాష్ట్రంలో పోలీస్‌ స్టేషన్లలో మామూళ్లు లేవని, లారీలు, ఇతర వాహనదారులు నుంచి రూ.500 తీసుకున్న దానికి సస్పెండ్‌ అయ్యారని అన్నారు. బిల్డర్లకు కమీషన్లు చెల్లించుకునే పరిస్థితి పూర్తిగా అరికట్టారన్నారు. ఏపీలో అవినీతి బాగా పెరిగిపోయిందని, ప్రతి ఫైలుకు పైసలు వసూలు చేస్తున్నారని అన్నారు. కాపులు, బలిజలు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, టీడీపీలో కాపులకు అవకాశం లేదని, వైసీపీలో జగన్‌ తప్ప కాపులు ముఖ్యమంత్రి కాలేరని అన్నారు. కాపులు, బలిజలు కాంగ్రె్‌సలోకి రావాలని, 2029లో ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాలు ఏర్పాటు కావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో నాయకులు అశోకరత్నం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 18 , 2026 | 11:52 PM