Share News

సాయం ఎండమావుల్లో

ABN , Publish Date - Jun 28 , 2026 | 11:48 PM

హనుమంతు కోడుమూరు మండలం.. వర్కూరు గ్రామానికి చెందిన ఈ రైతుకు ఒకటిన్నర ఎకరం పొలం ఉంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంతో పాటు రాష్ట్రం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి రూ.20వేల ఆర్థిక సాయం పొందుతున్నాడు.

సాయం ఎండమావుల్లో

పీఎం కిసాన్‌ పథకం కోసం ఆరేళ్లుగా రైతుల ఎదురు చూపు

సాంకేతిక సమస్యలతో జాబితాలో దక్కని చోటు

2019 ఫిబ్రవరి తర్వాత జాబితాలో నమోదు కాని రైతులు

ఉమ్మడి జిల్లాలో 2019 నుంచి 57,681 మందికి చేకూరని లబ్ధి

ఆరేళ్లలో కోల్పోయిన సాయం రూ.295 కోట్లు

అన్నదాత సుఖీభవ కింద కౌలు రైతులకు లబ్ధి చేకూరిస్తామని హామీ

ఉమ్మడి జిల్లాలో 55వేల మంది కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ కింద మొండిచేయి

హనుమంతు కోడుమూరు మండలం.. వర్కూరు గ్రామానికి చెందిన ఈ రైతుకు ఒకటిన్నర ఎకరం పొలం ఉంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంతో పాటు రాష్ట్రం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి రూ.20వేల ఆర్థిక సాయం పొందుతున్నాడు. కొంత కాలం పాటు పీఎం కిసాన్‌ పథకం కింద 2వేల ఆర్థిక సాయం అందుకున్నాడు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కాని ఉన్న ఫలంగా ఈ సాయం తన బ్యాంకు ఖాతాలో జమ కావడం నిలిచిపోయింది. దీంతో ఆ రైతు గ్రామంలోని రైతు సేవా కేంద్రానికి, మండల కేంద్రానికి వెళ్లాడు. అక్కడ సమస్య పరిష్కారం కాకపోవడంతో వ్యవసాయాధికారి కార్యాలయానికి, చివరకు కర్నూలు జిల్లా కేంద్రంలోని జేడీ కార్యాలయానికి నాలుగు సంవత్సరాలుగా తిరుగుతున్నాడు. ఈ సమస్యను తీర్చడం తమ వల్ల కాదని అధికారులు చేతులెత్తేశారు. దీనిపై గురువారం కలెక్టరేట్‌ వద్ద ఈ రైతు కన్నీటి పర్యంతమయ్యాడు.

కర్నూలు అగ్రికల్చర్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): ఈ విధంగా పీఎం కిసాన్‌ పథకం కింద అనర్హులుగా మిగిలిపోయిన వారు ఉమ్మడి జిల్లాలో 57,681 మంది ఉన్నారు. వీరంతా ఈ పథకం కింద లబ్ధి కోసం అధికారులందరినీ కలుస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయాన్ని అందిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే గత సంవత్సరం నుంచి ఈ పథకం ప్రారంభమైనా వీరికి మొండిచేయే దక్కింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 55వేల మంది కౌలు రైతులు ఉన్నారు. కనీసం ప్రస్తుత ఖరీఫ్‌లోనైనా మొదటి విడతగా అందించిన రూ.5వేలు తమ బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారేమోనని అధికారులు బ్యాంకుల వద్దకు పరుగులు తీశారు. ఒక్క రూపాయి కూడా బ్యాంకులో తమ ఖాతాలకు జమ కాలేదు. కష్టాల్లో ఉన్న రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం కిసాన్‌సమ్మాన్‌ నిధితో పాటు అన్నదాత సుఖీభవ పథకాలను పెట్టుబడి సాయంగా అందిస్తామని చెప్పడమేగాని ఆచరణలోకి రావడం లేదు. ఈ జాబితాలో చోటు దక్కని వేలాది మంది రైతులు ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్‌తో పాటు గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాలకు వెళుతున్నారు. మండల కేంద్రాల్లోని వ్యవసాయాధికారులను, జిల్లా కేంద్రంలోని జేడీ కార్యాలయ అధికారులను కలుస్తూనే ఉన్నారు.

కౌలు రైతులకు మొండి చేయి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సొంత పొలం ఉన్న రైతులకే కాకుండా కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయాన్ని అందిస్తామని ప్రకటించింది. దీంతో కౌలు రైతులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే.. గత సంవత్సరం కౌలు రైతులకు ఈ పథకం కింద ఒక్క రూపాయి కూడా జమ చేయలేదు. కర్నూలు జిల్లాలో 30వేల మంది, నంద్యాల జిల్లాలో 20వేల మంది కౌలు రైతులు ఉన్నారు. అన్నదాత సుఖీభవ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో మూడు విడతల్లో 14వేల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. కనీసం ఈ సంవత్సరం ప్రస్తుత ఖరీఫ్‌లోనైనా తమకు పెట్టుబడి సాయం అందిస్తారేమోనని కౌలు రైతులు ఆశగా ఎదురు చూశారు. వారం క్రితం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మొదటి విడత రూ.5వేల సాయాన్ని వారి బ్యాంకు ఖాతాలకు జమ చేసింది. అయితే.. కౌలు రైతులకు మాత్రం మొండిచేయే మిగిలింది. కనీసం రాష్ట్ర ప్రభుత్వం తమకు పెట్టుబడి సాయాన్ని అందేలా చూడాలని కౌలు రైతులు కోరుతున్నారు.

పీఎం కిసాన్‌ కింద 57,681 మందికి దక్కని చోటు..

కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరి నెల నుంచి పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని రైతుల కోసం అమలు చేస్తోంది. వారం రోజుల క్రితం 23వ విడత కింద ఒక్కో రైతుకు రూ.2వేల సాయాన్ని వారి బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. అయితే కర్నూలు జిల్లాలో 43,557 మంది, నంద్యాల జిల్లాలో 14,124 మంది రైతులకు ఈ సాయం అందలేదు. మొత్తం రెండు జిల్లాల్లో 57,681 మంది రైతులు 2019 నుంచి వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అధికారులు చెబుతున్న వివరణ పరిశీలిస్తే విస్తు పోక తప్పదు. 2019 ఫిబ్రవరి వరకు రైతులకు ఈ పథకం కింద లబ్ధి అందుతుందని, ఆ తర్వాత కొత్తగా పాస్‌బుక్‌లు నమోదు చేసుకున్న వారికి లబ్ధిదారుల జాబితాలో చోటు దక్కడం లేదని, ఈ విషయంపై వందలసార్లు కేంద్ర ప్రభుత్వానికి నివేదికను అందజేసినా అక్కడి నుంచి ఎటువంటి సమాధానం లేదని అధికారులు అంటున్నారు. చాలా మంది రైతులు 2019 ఫిబ్రవరి తర్వాత కొత్తగా పాస్‌ బుక్‌లు తమ పేరిట తయారు చేసుకున్నారు. ఆ రైతులందరికీ పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద లబ్ధి చేకూరడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఒక్కో రైతుకు ఒక్కో విడతలో రూ.2వేలు సాయం అందిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని 57,681 మంది రైతులకు ఒక్క విడతలో రూ.2వేల ప్రకారం అందాల్సిన సాయం రూ.11.53 కోట్లు అవుతుంది. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం 23 విడతల ఒక్కో రైతుకు రూ.2వేల ప్రకారం అందించింది. ఈ లెక్కన 57,681 మంది రైతులకు ఆరేళ్లకు 23 విడతల రూ.2వేల ప్రకారం లెక్కవేస్తే రూ.2.065 కోట్లకు పైగా అందాల్సి ఉంది. అంత పెద్ద మొత్తంలో అర్హులైన రైతులకు కేంద్ర సాయం అందలేదు. దీనిపై రైతుసంఘాల నేతలు ధ్వజమెత్తుతున్నారు.

అనుమతులు వస్తే రైతులందరికీ ఆర్థికసాయం

పీఎం కిసాన్‌ పథకం కింద ఒక్కో రైతుకు కేంద్ర ప్రభుత్వం ఒక విడతలో రూ.2వేల సాయాన్ని అందిస్తుంది. ఇప్పటికీ 23 విడతలుగా రైతుల ఖాతాలో జమ అయింది. 2019 ఫిబ్రవరి తర్వాత పాస్‌బుక్‌లు పొందిన రైతులకు ఈ పెట్టుబడి సాయం కేంద్రం నుంచి అందడం లేదు. కేంద్రం నుంచి అనుమతులు వస్తేనే ఈ పథకం కింద రైతులకు సాయం అందించే అవకాశం ఉంది. కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందించే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

- వరలక్ష్మి, జేడీ

Updated Date - Jun 28 , 2026 | 11:48 PM