Share News

మురిపించిన వర్షం

ABN , Publish Date - Jun 15 , 2026 | 12:14 AM

నియోజకవర్గ వ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుఝాము వరకు భారీ వర్షం కురిసింది. వారం రోజులుగా చెదురు మదురు వర్షాలు పడ్డా పొలాలు పదును కాలేదు. ఎట్టకేలకు భారీ వర్షం కురియడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బనగానపల్లె మండలంలో 28.2 మి.మీ., అవుకు 46.2. కొలిమిగుండ 16.2 కోవెలకుంట్ల 26.0, సంజామల 26.2 మి.మీ.ల వర్షం కురియడంతో రైతులు ఖరీఫ్‌ సాగుకు సిద్ధమవుతున్నారు.

మురిపించిన వర్షం
చాగలమర్రి: పెద్దబోధనం సమీపంలో ప్రవహిస్తున్న వంక

బనగానపల్లె, ఆళ్లగడ్డ నియోజకవర్గాలో కుండపోత, హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

బనగానపల్లె, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ వ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుఝాము వరకు భారీ వర్షం కురిసింది. వారం రోజులుగా చెదురు మదురు వర్షాలు పడ్డా పొలాలు పదును కాలేదు. ఎట్టకేలకు భారీ వర్షం కురియడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బనగానపల్లె మండలంలో 28.2 మి.మీ., అవుకు 46.2. కొలిమిగుండ 16.2 కోవెలకుంట్ల 26.0, సంజామల 26.2 మి.మీ.ల వర్షం కురియడంతో రైతులు ఖరీఫ్‌ సాగుకు సిద్ధమవుతున్నారు.

బనగానపల్లె మండలంలో 13 వేల హెక్టార్లలో పంటు సాగయ్యే అవకాశముంది. వరి, కంది, పత్తి, మొక్కజొన్న, మినుము, కొర్ర, పొద్దుతిరురుగుడు తదితర పంటలు సాగు చేసేందుకు రైతులు పొలాన్ని సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు.

ముందుగా రైతులు పచ్చిరొట్ట విత్తనాలు వేసి, మొక్కలు వచ్చాక కలియదున్నితే భూమి సారవంతం అవుతుందని ఏవో సుబ్బారెడ్డి సూచించారు. తగిన సలహాలు, సూచనలకోసం వ్యవసాయ కార్యాలయం, రైతు భరోసా కేంద్రాల్లో సంప్రదించవ్చని ఏవో కోరారు.

పంటలకు ప్రాణం పోసిన వర్షం

రుద్రవరం: మండలంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షం వర్షం మిరప, అరటి, బొప్పాయి పంటలకు ప్రాణం పోసిందని రైతులు తెలిపారు. ఎండలకు వాడబారుతున్న తరుణంలో వర్షం కురియడంతో మొక్కలు పచ్చగా కనిపిస్తున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేశారు.

చాగలమర్రిలో 43.2 మీ.మీ..

చాగలమర్రి: మండలంలో ఉరుములు, మెరుపులతో ఆదివారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. 43.2 మీ.మీ వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారి అబ్దుల్‌సత్తార్‌ తెలిపారు. బోర్ల కింద సాగు చేసిన మొక్కజొన్న, వేరుశనగ, మినుము పంటలకు వర్షం ఊపిరి పోసింది. వారం నుంచి ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది. మండలంలో పసుపు, మొక్కజొన్న విత్తనాలు వేసేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు.

సంజామల: మండలంలో ఆదివారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. పాలేరు వాగులో నీటిమట్టం పెరిగింది. రుతుపవనాల ప్రభావంతో వర్షం కురయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆరుతడి పంటలు సాగు చేయండి

ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం ఉండటంతో వరి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలి. ఈనెల 30వ తేదీ వరకు విత్తనాలు వేయవచ్చు, మినుము, కొర్ర, వేరుశనగ, పెసర, కంది, పసుపు సాగుకు అనుకూలం, మొక్కజొన్న సాగుకు అనుకూలం కాదు. రసాయనిక ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులు వాడాలి. - రంగనేతాజీ, ఏవో, చాగలమర్రి

Updated Date - Jun 15 , 2026 | 12:14 AM