Share News

దంచికొట్టిన వాన

ABN , Publish Date - Jun 14 , 2026 | 11:39 PM

కష్టజీవులనుల ఓ వైపు ఎల్‌నినో భయపడుతున్నా.. రుతుపవనాల ప్రభావంతో జిల్లాలో పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి భారీ, అతిభారీ వర్షాలు కురిశాయి.

దంచికొట్టిన వాన
వర్షంతో ఉప్పొంగిన గర్జివంక

పశ్చిమ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు

పొంగిపొర్లిన వాగులు, వంకలు

పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు

అన్నదాతల్లో చిగురిస్తున్న సాగు ఆశలు

అత్యధికంగా కోసిగిలో 100.6 మి.మీ. వర్షపాతం నమోదు

కర్నూలు, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): కష్టజీవులనుల ఓ వైపు ఎల్‌నినో భయపడుతున్నా.. రుతుపవనాల ప్రభావంతో జిల్లాలో పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి భారీ, అతిభారీ వర్షాలు కురిశాయి. నిన్నటిదాకా ఉక్కపోతతో అల్లాడిన ప్రజానీకానికి ఈ వర్షాలు ఊరటనిచ్చాయి. ముఖ్యంగా కరువుతో తల్లడిల్లే పశ్చిమ ప్రాంత రైతుల్లో సాగు ఆశలు చిగురిస్తున్నాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు.. రాత్రి ఉరుము, మెరుపులతో వరుణుడు విరుచుకుపడ్డాడు. ఒక్కసారిగా వర్షం దంచి కొట్టింది. ఈదురుగాలులతో కూడిన వానల వల్ల పలు ప్రాంతాల ప్రజలు వణికిపోయారు. ఈ వర్షాల వల్ల జిల్లా అంతటా అన్నదాతలు పత్తి విత్తనాలు నాటే పనుల్లో బిజీ అయ్యారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 4.35 లక్షల హెక్టార్లలో సాగు అంచనా వేశారు. ఇప్పటికే దాదాపు 35వేల హెక్టార్లలో పత్తి విత్తనాలు భూమిలో నాటారు. బోరుబావుల కింద పచ్చగా పెరుగుతోంది. ఈ వర్షాలకు వేరుశనగ సాగు జోరు అందుకోనుంది.

అత్యధికంగా కోసిగిలో 100.6 మి.మీ.ల వర్షపాతం

జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు అన్నదాత మురిసిపోయారు. ఆదివారం ఉదయం 8 గంటలకు రెవెన్యూ అధికారులు నమోదు చేసిన వర్షపాతం లెక్కలు మేరకు అత్యధికంగా కోసిగి మండలంలో 100.6 మి.మీల వర్షం పడింది. ఆలూరులో 86.2, హొళగుందలో 75.4, పెద్దకడుబూరులో 70.4, ఆదోనిలో 62.4, హాలహర్విలో 57.6, దేవనకొండలో 50.8, చిప్పగిరి, మంత్రాలయంలో 50.2, ఆస్పరిలో 50.0 వర్షపాతం నమోదయ్యింది. అలాగే మద్దికెరలో 48.8, పత్తికొండలో 45.6, ఎమ్మిగనూరులో 44.6, తుగ్గలి మండలంలో 42.4 మి.మీల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా సి.బెళగల్‌ మండలంలో 16.4మి.మీ. వర్షం కురిసింది. జిల్లాలో 1,164.6 మి.మీ.ల వర్షం నమోదు కాగా, సగటు వర్షం 44.8 మి.మీ. నమోదైంది. జూన్‌ మాసంలో సాధారణ వర్షపాతం 77.7 మి.మీ. వర్షపాతం కాగా, ఈ 14 రోజుల్లో 90.9 మి.మీ. వర్షం కురిసింది.

పత్తి విత్తనాల అమ్మకాల జోరు

పశ్చిమ ప్రాంతంలో కురిసిన వర్షాలకు ఆదోని, ఎమ్మిగనూరు కేంద్రాల్లో దాదాపు ఐదు లక్షల విత్తన ప్యాకెట్లు అమ్ముడుపోయాయని అంచనా. తన వ్యాపార చరిత్రలో ఇంతటి వర్షాలు, పత్తి విత్తనాలు అమ్మకాలు మునుపెన్నడూ చూడలేదని ఆదోనికి చెందిన ఓ వ్యాపారి పేర్కొన్నారు. వర్షం ఏ స్థాయిలో దంచి కొట్టిందో అన్నదాతలు ఎలా సంతోషిస్తున్నారో ఇట్లే తెలుస్తోంది.

ఉప్పొంగిన వాగులు.. నిలిచిన రాకపోకలు

శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు వంకలు, వాగులు పొంగిపొర్లాయి. ఆలూరు-గుంతకల్లు రహదారి మధ్య ప్రవహించే కళ్లివంక ఉప్పొంగడంతో రాకపోకలు ఆగిపోయాయి. ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హాలహర్వి మండలం నెట్రవటి రహదారిలో పెద్దవాగు గ్రామ మధ్లఓనే పెద్దవంకలు ఉప్పొంగడంతో ఆ పల్లె జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆస్పరి మండలం యాటకల్లు వంక పొంగిపొర్లింది. కల్వర్టు తెగిపోవడంతో రాకపోకలు ఆగిపోయాయి. కైరుప్పల, బిలెకలు మీదుగా 20 కిలోమీటర్లు దూరం నుంచి మండల కేంద్రానికి చేరుకోవాల్సి ఉంది. కోసిగి మండలంలో వంకలు, వాగులు ఉప్పొంగాయి. కోసిగి-హాల్వి రోడ్డులోని ఉన్న చాపవంక వరద ఉధృతికి రాకపోకలు స్తంభించాయి. దేవరబెట్ట గ్రామం కల్వర్టు కొట్టుకుపోడంతో ఆ గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. మార్టబండ గ్రామ ఆంజనేయస్వామి ఆలయం రోడ్డు కొట్టుకుపోయింది. పత్తి వందల ఎకరాల్లో దెబ్బతింది.

Updated Date - Jun 14 , 2026 | 11:39 PM