భారీ వర్షం
ABN , Publish Date - Jun 05 , 2026 | 11:29 PM
చాగలమర్రి మండలంలో శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
చాగలమర్రిలో జలమయమైన రోడ్లు
తడిచిన మొక్కజొన్న
చాగలమర్రి, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): చాగలమర్రి మండలంలో శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో పలు కాలనీల రోడ్లు జలమయమయ్యాయి. పాఠశాలలు, దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో వర్షపు నీరు చేరింది. మల్లెవేముల రహదారిలోని సర్వీసు రహదారులపై ఆరబెట్టుకున్న మొక్కజొన్న ధాన్యం తడిచి దెబ్బతింది. ప్లాస్టిక్ పట్టాలు కప్పేలోపే వర్షం కురవడంతో మొక్కజొన్న ధాన్యం తడిచి రైతులకు నష్టం వాటిల్లింది. కొందరు రైతులు ముందస్తుగా ధాన్యంపై కప్పిన పట్టాల్లో నిలిచిన వర్షపు నీటిని తొలగించేందుకు అవస్థలు పడ్డారు. ముత్యాల పాడు, శెట్టివీడు, చిన్నబోదనం, పెద్దబోదనం సర్వీసు రహదారుల్లో ఆరబెట్టుకున్న మొక్కజొన్న తడవగా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల నుంచి ఎండ తీవ్రతతో అల్లాడుతున్న జనానికి వర్షం ఉపశమనం కలిగించింది.