భారీ వర్షం
ABN , Publish Date - May 30 , 2026 | 11:34 PM
జిల్లాలో శనివారం తెల్లవారుజామున బలమైన ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. బలమైన గాలులు వీచడంతో అరటి, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
అరటి, బొప్పాయి పంటలకు నష్టం
మహానందిలో 61.4 మి.మీ వర్షపాతం
నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
నంద్యాల ఎడ్యుకేషన్, మే 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శనివారం తెల్లవారుజామున బలమైన ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. బలమైన గాలులు వీచడంతో అరటి, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మహానంది మండలంలో అత్యధికంగా 61.4 ఎంఎం వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. బలమైన గాలులు వీచడంతో అరటి రైతులకు స్వల్పనష్టం వాటిల్లింది. బండిఆత్మకూరు మండలంలో 24.8 ఎంఎం, నంద్యాల మండలంలో 4.2ఎంఎం వర్షపాతం నమోదైంది. రాబోయే నాలుగు రోజుల్లో జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు గంటకు 40 కి.మీ నుంచి 50 కి.మీ వేగంతో వీచే అవకాశముందని, జిల్లా వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది.
గాలివాన బీభత్సం
బండిఆత్మకూరు: మండల వ్యాప్తంగా శనివారం తెల్లవారు జామునుంచి గాలివాన బీభత్సం సృష్టించింది. పలు గ్రామాల్లో చెట్లు ,విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. బీ.కో డూరు, వెంగళరెడ్డిపేట, కడమలకాల్వ, మణి కంఠపురం గ్రామాల్లో చెట్లు నేలకూలగా రహదారుల్లో వాహన రాకపోకలకు ఇబ్బం దులు ఏర్పడ్డాయి. ఇళ్ల మధ్యనే పెద్ద, పెద్ద చెట్లు కూలటం ఎంతో భయమేసిందని ఈర్నపాడు గ్రామస్థులు పేర్కొన్నారు. కొన్ని గ్రామాల్లో రేకుల షెడ్లు, వారపాకులు గాలి ధాటికి లేచిపోయాయి. ఎలాంటి ప్రమాదాలు జరగకపోవటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మామిడి కాయలు రాలిపోవటంతో రైతులు లబోదిబోమంటున్నారు..